బలహీనత అందుకేనా?.. పెళ్లంటే భయమేస్తోంది..!

 

ఆంధ్రజ్యోతి (07-01-2020): 
ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 23 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. అయితే వారంలో కనీసం రెండు సార్లు అయినా, నిద్రలో స్ఖలనం అవుతోంది. ఇలా వీర్య నష్టం జరగడం వల్ల నేను బరువు తగ్గిపోతున్నాను. ఈ ఇబ్బంది తొలగడం కోసం ఎన్నో మందులు వాడాను. ఎంతో డబ్బు ఖర్చు చేశాను. అయినా ఫలితం లేదు. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకోవాలంటే నాకు చాలా భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి?
- ఓ సోదరుడు, సూర్యాపేట.
 
డాక్టర్ సమాధానం: వృషణాల్లో తయారయ్యే వీర్యం సాధారణంగా హస్తప్రయోగం ద్వారా, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు నిద్రలో కూడా ఇలా జరగవచ్చు. ఇలా వీర్యం బయటకు వెళ్లిపోవడం అనేది పురుషుల్లో అత్యంత సహజం. దీని వల్ల శారీరక బలహీనత వచ్చే అవకాశమే లేదు. ఇలా వీర్యం కోల్పోవడం అనేది బలహీనత కలిగించే లక్షణంగా మీరు మనసులో బలంగా నమ్మడం వల్ల, నిద్రలో స్ఖలనం జరిగిన ప్రతిసారీ మీరు బలహీనత అనే భావనకు లోనవుతున్నారు. మీది నిజానికి సమస్యే కాదు. అలాంటప్పుడు అనవసరంగా మందుల కోసం డబ్బు వృథా చేసుకోవద్దు. ఒకవేళ వీర్యం స్ఖలనం జరిగిన ప్రతిసారీ అంగంలో నొప్పి, మంట ఉంటే ప్రాస్టేట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు భావించాలి. అలాంటప్పుడు వైద్యులను కలిసి చికిత్స తీసుకోవలసి ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణం లేకపోతే, నిద్రలో వీర్యం లీకేజీ గురించి చింతించవలసిన అవసరం లేదు. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే బరువు పెరిగే వీలు ఉంటుంది. కాబట్టి అనవసరపు భయాలు వీడి పెళ్లికి సిద్ధపడండి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)