ఆయన ధోరణి మారదా?

 

16-09-2019: డాక్టర్‌! నాకు పెళ్లయి 6 ఏళ్లు. మొదటి రాత్రి ఆయన నా దగ్గరకు రాలేదు. వైద్యులకు చూపించాం. వయాగ్రా మాత్రలు వాడిన తర్వాత ఒకే ఒక్కసారి లైంగికంగా కలిశాం. దాంతో నేను గర్భం దాల్చాను. ఆ తర్వాత ఇప్పటి వరకూ తిరిగి కలిసింది లేదు. ‘తల్లివి అయ్యావు కాబట్టి, ఇక శారీరకంగా కలవవలసిన అవసరం ఏముంది?’ అనేది ఆయన, మా అత్తింటివారి వాదన. వాళ్ల ధోరణి నచ్చక విడాకులు తీసుకుందామని అనుకుంటున్నాను. నాకు సలహా ఇవ్వగలరు?
- ఓ సోదరి, హైదరాబాద్‌.

లైంగికంగా కలిశారు కాబట్టి ఆయనలో ఎలాంటి లైంగిక సమస్యలూ లేవని అర్థం అవుతోంది. నిజానికి వయాగ్రా మాత్రలకు మించిన సురక్షితమైన చికిత్సలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మొదటిసారి ఎక్కువ డోసు వయాగ్రా మాత్రలు వాడడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంది. బహుశా ఆయన విషయంలో అదే జరిగి ఉండవచ్చు.

ఏదేమైన ప్పటికీ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తే తప్ప, లైంగికంగా కలవలేకపోతున్నంత మాత్రాన విడాకులు తీసుకోవాలని అనుకోవడం సరి కాదు. ప్రతి లైంగిక సమస్యనూ ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్సలతో సరిదిద్దే వీలుంది. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీ వారిని వైద్యులకు చూపించండి. మీకు శారీరకంగా దగ్గర కాలేకపోవడానికి అసలు కారణాన్ని వైద్యులు కనిపెట్టగలుగుతారు. మీ అత్తింటివారికి నచ్చజెప్పి మీ వారిని వైద్యులను కలవడానికి ఒప్పించండి. సమస్య
కచ్చితంగా పరిష్కారమవుతుంది.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి

ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)