ఈ పెళ్లి చేయాలా? వద్దా?

ఆంధ్రజ్యోతి (03-01-2020): 
 
డాక్టర్‌! మా అమ్మాయికి రెండో పెళ్లి చేయబోతున్నాం. మొదటి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ ఉండడంతో విడాకులు తీసుకోక తప్పలేదు. ఇప్పుడు అమ్మాయికి కాబోయే భర్త కూడా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అయితే నపుంసకత్వం కారణంగానే ఆ దంపతులు విడిపోయినట్టు తెలిసింది. కానీ అబ్బాయి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఈ పెళ్లి చేయాలా? వద్దా? అనే సంశయంలో ఉన్నాం. ఏం చేయమంటారు?
- ఓ సోదరుడు, ఒంగోలు.
 
అతను మంచి వ్యక్తి అంటున్నారు. అయితే అతనికి నిజంగానే నపుంసకత్వం ఉండి ఉంటే, అమ్మాయి జీవితం పాడవుతుందని మీరు భయపడుతున్నట్టు అర్థం అవుతోంది. ఈ విషయంలో మీరు కొంత చొరవ తీసుకుని ఆ అబ్బాయితో మాట్లాడండి. నపుసంకత్వం ఉందా? ఎలాంటి సమస్య ఉంది? అందుకు కారణం మానసికమా, శారీరకమా? అనేది పరీక్షల ద్వారా తేల్చుకోవచ్చు. అబ్బాయి కుటుంబంతో చర్చించి, అందుకు అయ్యే ఖర్చులను మీరే పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పి, ఒప్పించండి. సుమారు 7 వేలు ఖర్చుతో పొటెన్సీ టెస్ట్‌, పినైల్‌ డాప్లర్‌ పరీక్షలు చేయిస్తే సమస్య ఉన్నదీ, లేనిదీ తేలిపోతుంది. ఒకవేళ సమస్య ఉందని తేలినా, అందుకు సమర్థమైన చికిత్సలు ఉన్నాయి. అబ్బాయి మంచి వ్యక్తి అంటున్నారు కాబట్టి, సమస్యను చికిత్సతో సరిదిద్ది, పెళ్లికి సిద్ధపడవచ్చు. కొన్ని సందర్భాల్లో భర్తలో ఎలాంటి లోపం లేకపోయినా, నపుసంకత్వం ఉందనే నెపం మోపి విడాకులకు సిద్ధపడే భార్యలూ ఉంటారు. అతని విషయంలో ఇలా కూడా జరిగి ఉండవచ్చు కదా? కాబట్టి అనుమానం ఉంటే, వైద్య పరీక్షలు చేయించి, అంతిమ నిర్ణయం తీసుకోండి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)