నాకు మరణమే శరణమా?

27-05-2019: డాక్టర్‌! నా వయసు 28. రెండు నెలల క్రితం మొదటిసారి ఒక స్త్రీతో లైంగికంగా కలవడానికి ప్రయత్నించి విఫలమయ్యాను. దాంతో, లైంగిక సామర్థ్యం నాలో లోపించిందని తేలడంతో, ఎంతో ఆత్మన్యూనతకు లోనయ్యాను. మానసికంగా కూడా కుంగిపోతున్నాను. బతకడమే వృథా అనే నిశ్చయానికొచ్చాను. అయితే, ఆత్మహత్య చేసుకోవాలని ఉన్నా, తల్లితండ్రులను ఒంటరివాళ్లను చేయడం ఇష్టంలేక బతుకుతున్నాను. నాలాంటి వారికి చావే పరిష్కారమా?
- ఓ సోదరుడు, మంథని
 
జలుబు, దగ్గు వచ్చిందని ఆత్మహత్య చేసుకున్న వాళ్లను ఎక్కడైనా చూశారా? మీదీ అలాంటి సమస్యే. మీలాంటి అనుభవం ఎంతోమందికి ఎదురవుతూ ఉంటుంది. తొలి కలయికలో ఉద్రేకం, కోరికలు ఎక్కువగా ఉండి, ఆ ఆందోళనలో సమర్థంగా లైంగిక క్రీడలో పాల్గొనలేకపోవడం అత్యంత సహజం. అలా జరిగిందని, కుంగిపోయి, ఆత్మహత్య గురించి ఆలోచించడం అవివేకం. పాత రోజులతో పోలిస్తే, సాంకేతికత ఎంతో పెరిగింది. లైంగిక విషయాల గురించిన ఎంతో సమాచారం ఇంటర్నెట్‌లో దొరుకుతోంది. వీడియోలూ అందుబాటులో ఉన్నాయి.
 
అలాగే లైంగిక సమస్యలకు సమర్థమైన వైద్య చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని వెసులుబాట్లు, సౌలభ్యాలు ఉన్నప్పుడు, తొలిసారి కలయికలో ఫెయిల్‌ అయినందుకు ప్రాణాలు తీసుకోవాలని నిశ్చయించుకునేంతగా కుంగిపోవడంలో అర్థం లేదు. మీకు ఉన్నది అసలు సమస్యే కాదు. సరైన అవగాహన లేకుండా కలిసే ప్రయత్నం చేయడంతో ఫెయిలై ఇంతలా కుంగిపోతున్నారు. కాబట్టి వైద్యులను కలిసి తగిన అవగాహన ఏర్పరుచుకోండి. లైంగిక సామర్థ్యం, పటుత్వాలకు సంబంధించిన పరీక్షలతో మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. పరీక్షల్లో మీలో లోపం ఉందని తేలినా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎలాంటి లైంగిక సమస్యలనైనా చక్కదిద్దే సమర్థమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆత్మహత్య ఆలోచనలకు స్వస్తి చెప్పి, వెంటనే వైద్యులను
కలవండి.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,
ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
833285090 (కన్సల్టేషన్‌ కోసం)