విజృంభిస్తున్న నపుంసకత్వం

ఆంధ్రజ్యోతి, 06-10-2013:  ‘భర్త నపుంసకుడని తేలడంతో.. విడాకులు కోరుతున్న భార్య..’.. ఇలాంటి వార్తలు వారానికి ఒకసారయినా పత్రికల్లో టీవీల్లో చదువుతూనే ఉన్నాం.. దేశంలో విడాకుల శాతం రోజు రోజుకూ పెరిగిపోతుండడానికి మిగిలిన అన్ని కారణాల కంటే నపుంసకత్వమే ప్రధాన కారణంగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో సుమారు 22 శాతం పెళ్లిళ్లు విడాకులకు దారి తీస్తున్నాయి. పైగా విడాకులు తీసుకోవడమనేది 25 నుంచి 30 ఏళ్ల లోపు వయసువారిలో ఎక్కువగా చోటు చేసుకుంటోంది. యువతీ యువకుల్లో విడాకుల సంఖ్య 2011 కంటే 2012 నాటికి ఎనిమిది శాతానికి పైగా పెరిగింది.
 
పురుషుల్లో లైంగిక సంబంధమైన సమస్యలపై ప్రత్యేకంగా అధ్యయనం చేసిన ఆల్ఫా అనే ఆండ్రాలజీ నిపుణుల బృందం 2500 మంది పురుషుల (విడాకులు తీసుకున్నవారు) కేసుల్ని పరిశీలించి, భారతదేశంలో నపుంసకత్వం రాను రానూ ఓ మహమ్మారిలా విజృంభిస్తోందని హెచ్చరించింది. నలభయ్యేళ్లు పైబడినవారిలో సగానికి సగం మంది, 40 ఏళ్ల లోపువారిలో కూడా పది శాతానికంటే ఎక్కువ మంది నపుంసకత్వంతో అవస్థలు పడుతున్నారని అది తెలిపింది. పురుషులలోనే కాక, మహిళల్లో సైతం  లైంగిక జడత్వం పెరుగుతోందని అది తెలిపింది.
 
ఎక్కువ మంది పురుషులు లైంగికంగా సంతృప్తి పరచలేని స్థితిలో ఉన్నారు. వారిలో లైంగిక జీవితం పట్ల వైముఖ్యం పెరుగుతోంది. విడాకులే కాకుండా పది శాతం మంది వైవాహిక జీవితాలు నిర్వేదంగా, నిరర్థకంగా మారుతున్నాయి. ఈ సమస్య విషయంలో పురుషులు ఎంత త్వరగా జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది్‌ అని ప్రముఖ ఆండ్రాలజిస్ట్‌ జగ్మేష్‌ సక్సేనా చెప్పారు. వృత్తి ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగానూ, ఆహార విహారాల్లో వస్తున్న మార్పుల వల్లనూ పురుషుల్లో లైంగిక పటుత్వం సాపేక్షికంగా తగ్గిపోతోందని ఆయన వివరించారు.
 
భారతదేశంలో పురుషుల్లో నపుంసకత్వ సమస్య రాను రానూ పెరుగుతున్నప్పటికీ, వైద్యపరంగా దీన్ని చక్కదిద్దడానికి అవసరమైనంత పరిశోధన జరగడం లేదనీ, చికిత్సా సౌకర్యాలు కూడా పెంపొందడం లేదనీ ఆయన అన్నారు. దీనివల్ల వైవాహిక జీవితాలు, కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తలు ఎంతో అవగాహనతో ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంది్‌ అని ఆయన అన్నారు.
 
సాధారణంగా ఆరోగ్యవంతమైన భార్యాభర్తలు ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తరువాత ఏడాదికి సగటున 58 సార్లు లైంగిక జీవితాన్ని అనుభవించగలుగుతారని, అంటే వారానికి ఒకటి రెండుసార్లు ఆనందంగా గడపగలుగుతారని, అయితే ఈ సంఖ్య క్రమంగా 25కు తగ్గిపోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఒకే చోట కూర్చుని పని చేయడం, మానసిక ఒత్తిడికి గురవుతుండడం, క్షణం కూడా తీరిక లేకుండా పని చేయడం, తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, మద్యం తీసుకోవడం, సిగరెట్లు తాగడం, బరువు పెరగడం, మధుమేహంతో అవస్థ పడడం వంటివి వైవాహిక జీవితాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ూనలభయ్యేళ్లు దాటే సరికి 48 శాతం మంది మధుమేహానికి గురవుతున్నారు. 45 శాతం మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యల కారణంగా పురుషుల్లో లైంగిక జీవితం పట్ల ఆసక్తి సన్నగిలుతోంది.
 
ఈ సమస్య గత అయిదేళ్లలో 15 శాతం పెరిగింది్‌ అని ఆ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకు వాడే మందులు నాడీ మండలం మీద పనిచేసి లైంగిక జీవితాన్ని కుంటుపరుస్తున్నాయి. లైంగిక సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని వ్యసనాలకు స్వస్తి చెప్పి, ఆసనాలు, వ్యాయామం, యోగా వంటివి సాధన చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుంది.
 
కాగా, దాదాపు 90 శాతం మంది పురుషులు తమ వైవాహిక జీవితం కుప్పకూలే దాకా మేల్కోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. తమకు లైంగిక సమస్యలున్నట్టు ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి ఎక్కువ శాతం మంది పురుషులు సిగ్గుపడుతుంటారని వారు తెలిపారు. చికిత్స చేయించుకోవడం ఆలస్యం అయిన కొద్దీ సమస్య ముదిరిపోతూనే ఉంటుంది. ఇటువంటి సున్నితమైన సమస్యల విషయంలో పురుషులు దాపరికంతో వ్యవహరించక, వెంటనే డాక్టర్లను సంప్రతించి, ప్రారంభ దశలోనే చికిత్స తీసుకోవాలని కూడా వారు సలహా ఇస్తున్నారు.