ప్రేమా.. మోహమా?

ఆంధ్రజ్యోతి, 01-11-2015: నచ్చిన వ్యక్తితో కలిసి నవ్వుతాం. చేతులు కలిపి నడుస్తాం. సమయాన్ని పరిగెత్తిస్తాం. ఇంతకీ ఆ వ్యక్తి మీద మనకున్నది ప్రేమా లేక లైంగికాకర్షణా? ఈ రెండిటి సంకేతాలేంటి?
 
మోహపు మత్తు 
లైంగికార్షణ ప్రేమకంటే ఎంతో బలమైనది. అది వ్యక్తుల విచక్షణాఙ్ఞానాన్ని, అంతఃచేతనను కప్పేసి చిత్రమైన స్థితికి లోను చేస్తుంది. మనలో అంతర్లీనంగా ఉండే ప్రకృతిసిద్ధమైన శారీరక వాంఛే ఇంతటి తీవ్రమైన భావోద్వేగానికి అసలు కారణం. ఈ దశలో మన మెదడు మత్తు పదార్థాలకు లోనైనట్టు ప్రవర్తిస్తుందని అధ్యయనాల్లో తేలింది. కొకెయిన్‌ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తుల మెదడులో ఏ ప్రదేశాలు చైతన్యమవుతున్నాయో అవే ప్రదేశాలు లైంగికార్షణకు లోనైనప్పుడు కూడా చైతన్యమవుతున్నట్టు ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌లో తేలింది. రిలేషన్‌షిప్‌ ప్రారంభంలో సెక్స్‌ హార్మోన్లు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటాయి. దాంతో లైంగికార్షణే ప్రధానమవుతుంది. ఫలితంగా ఎదుటి వ్యక్తి అసలు స్వరూపం, తప్పులు, లోపాలకు బదులు ఆ వ్యక్తిలో ఏం చూడాలనుకుంటున్నామో వాటినే చూస్తాం.

లస్ట్‌ ఆర్‌ లవ్‌ 
లైంగికార్షణ శారీరక ఆకర్షణతోనే మొదలవుతుంది. వ్యకి అసలు స్వరూపం బయల్పడేవరకూ ఈ భావాలు తీవ్రంగానే ఉంటాయి. అవతలి వ్యక్తి మనకు ఇష్టంలేని పని చేయనంత కాలం ప్రపంచమంతా రంగుటద్దాల్లోంచే కనిపిస్తుంది. అయితే ప్రేమలో ఉన్నంతమాత్రాన లైంగికార్షణ అసలు ఉండదనటానికి లేదు. నిజానికి కొన్నిసార్లు లస్ట్‌ కూడా ప్రేమకు దారితీయొచ్చు. ఏదేమైనా నిజమైన ప్రేమకు ఒకర్నొకరు పూర్తిగా అర్థం చేసుకునేంత సమయం కావాలి. మరి మీది ప్రేమా లేక లైంగికార్షణా? ఈ సంకేతాలనుబట్టి అసలు నిజాన్ని తెలుసుకోండి.
 
లస్ట్‌ సంకేతాలు 
మీ దృష్టంతా ఆ వ్యక్తి రూపం, శరీరం మీదే ఉంటుంది. 
ఆ వ్యక్తితో మాటలకంటే శారీరక సుఖం మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. 
మనసులో కలిగే భావాలను చర్చించకుండా ఆ రిలేషన్‌షి్‌పని కేవలం కలలకే పరిమితం చేస్తారు. 
లైంగిక కోరిక తీరిన వెంటనే ఎలాంటి ముద్దు మురిపెం లేకుండా అక్కడినుంచి వెళ్లిపోవాలనుకుంటారు. 
మీరు స్నేహితులు కారు ప్రేమికులు మాత్రమే!
 
ప్రేమకు సంకేతాలు 
ఆ వ్యక్తితో సెక్స్‌కు మించి క్వాలిటీ టైమ్‌ గడుపటానికి ఇష్టపడతారు. 
సంభాషణల్లో మునిగిపోయి సమయాన్నే మర్చిపోతూ ఉంటారు. 
ఒకర్నొకరు సంతోషంగా ఉంచుకోవటం కోసం ఒకరి భావాల్నొకరు నిజాయితీగా అర్థం చేసుకుంటూ ఉంటారు. 
మెరుగైన వ్యక్తులుగా ఒకర్నొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు. 
ఆ వ్యక్తి స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుసుకోవాలని కోరుకుంటారు.
 
ప్రేమ ఒక సవాలే! 
హార్మోన్లు ఉరకలేస్తున్న వయసులో లైంగికాకర్షణకు లోనై కూడా విచక్షణతో మెలగటం ఓ సవాలే! అయితే ఆ సమయంలోనే స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. రిలేషన్‌‌షిప్‌లో ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆ మాత్రం మానసిక సంతులనం ఎంతో అవసరం. శారీరక ఆకర్షణకు లోనైనప్పుడు విచక్షణతతో ఆలోచించేందుకు శరీర స్పందనలు, అంతరాత్మ తోడ్పడుతూనే ఉంటాయి. అవి చేసే హెచ్చరికల మీద ఓ కన్నేసి ఉంచాలి. తదనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడే ఆకర్షణకు లోనైనా దానితో ముడిపడి ఉండే పొరపాట్ల బారిన పడకుండా ఉంటాం.