ఆ ఆసక్తి లోపిస్తే...

జీవితంలో సెక్స్‌కు పరిమితమైన స్థానముంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఓ సందర్భంలో లైంగికాసక్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడటం సహజం. కానీ కొన్ని సందర్భాల్లో మరీ ముఖ్యంగా స్త్రీలలో ఆ ఆసక్తి పూర్తిగా లోపిస్తూ ఉంటుంది. అందుకు స్పష్టమైన కారణాలున్నా స్త్రీలు దానికంతగా ప్రాముఖ్యం ఇవ్వరు. కానీ ఈ సమస్యను సకాలంలో సరిదిద్దిక పోతే పలురకాల మానసిక రుగ్మతలకు దారితీసే ప్రమాదముందని అంటున్నారు సెక్సాలజిస్ట్‌, సైకోఅనలిస్ట్‌ షర్మిల మజూందార్‌. 

లైంగికాసక్తి తగ్గటాన్ని వైద్య పరిభాషలో ‘హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’ అంటారు. మహిళల్లో ఇది అత్యంత సాధారణంగా కనిపించే సమస్య. ప్రపంచవ్యాప్తంగా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారని సర్వేలు చెబుతున్నాయి. మహిళల్లో ఈ సమస్యకు మానసికపరమైన, శారీరకపరమైన...రెండు కారణాలున్నాయి. ఈ రెండు కారణాలను విశ్లేషించి తగిన చికిత్స అందించగలిగినప్పుడే సమస్యను సమూలంగా పరిష్కరించటానికి వీలుంటుంది. 20 ఏళ్ల యుక్త వయస్కులు మొదలుకుని 60 ఏళ్లు దాటిన స్త్రీలందరిలో ఈ సమస్య కనిపించవచ్చు. అయితే యుక్త వయస్కులతో పోలిస్తే మధ్యవయస్కులైన మహిళల్లోనే హైపోయాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌’ అధికం.
 
అలక్ష్యం - అవగాహన లోపం 
ఓ వయసుకి చేరుకున్న తర్వాత సెక్స్‌కు సీ్త్రలు దూరమవటం మొదలుపెడతూ ఉంటారు. దానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పెరిగిన వాతావరణం, కుటుంబ కట్టుబాట్లు, పెద్దల నుంచి సంక్రమించిన అలవాట్లు...ఇలా స్త్రీలు సెక్స్‌ను ఒక వయసు వరకే పరిమితం చేయటానికి ఎన్నో కారణాలున్నాయి. కొందరు సీ్త్రలల్లో పిల్లలకు తల్లవగానే లైంగికాసక్తి తగ్గుముఖం పడుతుంది. తల్లవటంతో ఇక సెక్స్‌ అవసరం ఏముందనే ఆలోచన వాళ్లలో తెలత్తడమే ఇందుకు కారణం. అలాగని వీళ్లలో ఆసక్తి లేకపోయినంత మాత్రాన సెక్స్‌కు పనికిరారని చెప్పటానికి లేదు. అన్నివిధాలా ఆరోగ్యంగానే ఉన్నా లైంగిక చర్య మీద ఆసక్తి, ఇష్టం లోపించిందంటే ఆ చర్యకు తగినంత ప్రాధాన్యత ఇవ్వటంలేదని అర్థం చేసుకోవాలి. కొందరు సీ్త్రలలో సహజంగానే లైంగికాసక్తి పూర్తిగా లోపిస్తుంది. ఇందుకు పలు రకాల కారణాలున్నా దాన్నో సమస్యగా భావించరు. పెద్దరికం తలకెత్తుకుని ‘వయసైపోయిందిలే!’ అని సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇంకొందరు స్త్రీలు సమస్యను గ్రహించగలిగినా అది చికిత్స తీసుకోవాల్సినంత రుగ్మతగా భావించరు. బహిర్గతంగా చెప్పుకోడానికి సిగ్గుపడి మనసులోనే దాచేసుకుంటారు. కారణాలేవైనా లైంగికాసక్తి లోపం ఉన్న అధిక శాతం సీ్త్రలు నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. ఇది కూడా అన్ని రుగ్మతల్లాగే తీవ్రంగా పరిగణించాల్సిన రుగ్మతని, ఇందుకూ తగిన వైద్యులు, చికిత్సలున్నాయని సీ్త్రలందరూ తెలుసుకోవాలి. సమస్య తలెత్తినప్పుడు వైద్య సహాయంతో అవసరమైన చికిత్స తప్పనిసరిగా తీసుకుని అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయకుండా నియంత్రించాలి.
 
ఆ లోపం ఏ వయసులో అధికం 
లైంగికాసక్తికి హార్మోన్లకు దగ్గరి సంబంధం ఉంది. లైంగికంగా ఉద్రేకం చెందటంలో, లైంగిక చర్యలో పాల్గొనటంలో, తృప్తి పొందటంలో స్త్రీ శరీరంలోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే 40 ఏళ్ల వయసుకి చేరుకున్నప్పుడు సీ్త్రల అండాశయాల నుంచి అండాల విడుదల ఆగిపోతుంది. దాంతో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఫలితంగా లైంగిక ఆసక్తి కోల్పోతారు. లైంగికాసకి లోపాన్తికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే...
 
 • కటి ప్రదేశంలో సర్జరీ జరగటం 
 • లైంగిక హింస 
 • స్థూలకాయం 
 • వ్యసనాలు 
 • మానసిక వ్యాధులకు తీసుకునే మందులు 
 • హైపర్‌టెన్షన్‌ 
 • హృద్రోగాలకు ఉపయోగించే మందలు 
 • మధుమేహం 
 • నరాల సమస్యలు 
 • వెన్నుముక సమస్యలు 
 • పుట్టుకతో జననాంగంలో ఉండే బర్తోలిన్‌ గ్రంథులు దెబ్బతినటం

మానసిక కారణాలు 
సెక్స్‌ మీద ఆసక్తి తగ్గటానికి శారీరక, మానసిక కారణాలెన్నో ఉంటాయి. దాంపత్యం సంతృప్తికరంగా లేకపోవటం, ఆరోగ్యం అనుకూలించకపోవడం, దాంపత్య జీవితం ఆనందకరంగా లేకపోవడం లాంటి పలురకాల శరీరక, మానసిక అంశాలు దోహదపడతాయి. మరిముఖ్యంగా లైంగికాసక్తి లోపానికి శారీరకమైన కారణాలకంటే మానసికమైన కారణాల ప్రభావమే ఎక్కువ.
 
డిప్రెషన్‌ 
తగినంత ఫోర్‌ ప్లే లేకపోవటం 
భాగస్వామి మీద ఆసక్తి సన్నగిల్లడం 
దంపతుల మధ్య ప్రేమ, సఖ్యత కొరవడటం, 
విపరీతమైన ఆర్థికపరమైన, వృత్తిపరమైన, కుటుంబపరమైన ఒత్తిడి 
భాగస్వామి మీద అయిష్టత ఏర్పడటం 
అవతలి వ్యక్తిలో లైంగిక సామర్ధ్యం లోపించటం.
 
డిప్రెషన్‌ 
కుటుంబ కలహాలు 
దంపతుల మధ్య మానసిక దూరం పెరగటం 
తన శరీరాకారం పట్ల అసంతృప్తి. 
దీర్ఘకాలం లైంగిక అసంతృప్తికి లోనవటం. 
లైంగిక పరమైన ఆసక్తులు, ప్రాధామ్యాలు, అవసరాల గురించి దంపుతుల్లో అవగాహన లేకపోవడం. 

చికిత్స 
లైంగికాసక్తి తగ్గుదలకు ఇచ్చే చికిత్స కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానసిక కారణాల వల్ల ఆసక్తి లోపిస్తే అందుకు కౌన్సిలింగ్‌, కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ ఇస్తారు. ఒకవేళ శారీరక కారణాలవల్లే సెక్స్‌ పట్ల ఆసక్తి లోపిస్తే అందుకు మందులున్నాయి. శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను సహజసిద్ధంగా పెంపొందించే నోటి మాత్రలు, జెల్‌లు, లూబ్రికేటింగ్‌ క్రీమ్‌లను వైద్యులు సూచిస్తారు. విదేశాల్లో టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్లు, ప్యాచెస్‌, ఈసో్ట్రజెన్‌ క్రీమ్స్‌ ఉపయోగంలో ఉన్నాయి. అయితే వీటి వాడకం వల్ల దుష్ప్రభావాలు అధికం.
 
లైంగిక సంతృప్తి అవసరమే! 
జీవితం 100 శాతం పరిపూర్ణత సాధించటానికి 4 అంశాలు దోహదపడతాయి. 25 శాతం  లైంగిక ఆరోగ్యం, 25 శాతం  మెంటల్‌ హెల్త్‌, 25శాతం శారీరక ఆరోగ్యం, 25శాతం సైకలాజికల్‌ హెల్త్‌. వీటిలో లైంగిక ఆరోగ్యం లోపిస్తే 75 శాతంజీవితాన్నే ఆస్వాదించినవాళ్లమవుతాం. ఆ లోటును కూడా భర్తీ చేయగలిగినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. లైంగిక సంతృప్తి పొందటం వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. ఆ తృప్తి పొందినప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌, డోపమైన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా శరీరం కొత్త ఉత్తేజం పొందుతుంది. రక్త ప్రసరణ మెరుగై చర్మం యవ్వనవంతంగా ఉంటుంది. మానసిక సంతృప్తి పొందుతారు. మరిముఖ్యంగా భాగస్వామితో బంధం బలపడుతుంది. సెక్స్‌ సంతృప్తి కొరవడినప్పుడు సీ్త్రలలో డిప్రెషన్‌, చిరాకు, ఆందోళన, అకారణమైన ఒళ్లు నొప్పులులాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

లైంగికాసక్తి పెరగాలంటే... 
 • ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే సోయా ఉత్పత్తులు రోజూ తీసుకోవాలి. 
 • చీజ్‌ బదులుగా టోఫు తినాలి. 
 • విటమిన్‌ ఇ, సి ఉన్న ఆహారం తీసుకోవాలి. 
 • లైంగిక ఉద్రేకం పొందటంలో రక్త ప్రసరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రక్త వృద్ధిని పెంచే ఆకుకూరలు, దానిమ్మ పండ్లు తినాలి. 
 • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఫిష్‌ ఆయిల్‌ తీసుకోవాలి. 
 • జననావయవాల దగ్గర వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌తో మర్దనా చేయాలి. 
 • క్రమం తప్పక యోగా, ప్రాణాయామం చేసినా ఫలితం ఉంటుంది. 
 • చక్కటి శరీరాకృతినిచ్చే వ్యాయామాలు చేయాలి. 

డా.షర్మిల మజూందార్‌ 
సెక్సాలజిస్ట్‌, సైకోఅనలిస్ట్‌, 
రామయ్య ప్రమీల హాస్పిటల్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌