లేత వయసులో ఎంత ఘాటు ప్రేమయో

మనిషి ప్రాథమిక అవసరాల్లో ‘సెక్స్‌’ ఒకటి. కాని పెద్దల దృష్టిలో ఇదొక నిషిద్ధ విషయం. ఇంకా చెప్పాలంటే బూతు పదం. దీని గురించి పెద్దలు ఎంతగా దాయాలనుకుంటున్నారో... అంతకంటే ఎక్కువగా పిల్లల మెదళ్లలో ఇది తిష్టవేసుకుని కూర్చుంటోంది. పిల్లల మనసుల్లో ఈ విషయానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలుసుకునేందుకు ఇటీవల ఒక సర్వే చేశారు. అందులో అనేక అంశాలు వెలుగు చూశాయి. 

బాల్యానికి యుక్తవయసుకి మధ్య విభజన రేఖ క్రమంగా చెరిగిపోతోంది. ఆపోజిట్‌ సెక్స్‌ పట్ల స్నేహం, అభిమానం, ఆకర్షణ, ప్రేమ, సెక్స్‌ ఇవన్నీ ఒకప్పుడు సినిమాలకే పరిమితమై ఉండేవి. క్రమంగా ఇవి పిల్లల జీవితాల్లోకి చొరబడ్డాయి. చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం పిల్లల దృష్టిని లైంగిక విషయాల మీదకు మరలిస్తోంది. పాఠ్య పుస్తకాల మీది ఆసక్తి క్రమంగా శరీరంలో చోటుచేసుకుంటున్న మార్పులు, కోరికలు, అవసరాల మీదకు మళ్లుతోంది. పిల్లల్లో చోటుచేసుకుంటున్న ఈ మార్పులను తెలుసుకోవడం కోసం జరిపిన సర్వేలో ముఖ్యంగా ఈ రకమైన పిల్లలు పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 1996 తర్వాత పుట్టి పట్ణణాల్లో పెరుగుతున్న 30 శాతం కౌమారులకు ఇంటర్నెట్‌ మొట్టమెదటిసారి అందుబాటులోకొచ్చింది. పెళ్లికి ముందు సెక్స్‌ అనుభవం కంటే పరీక్షల్లో తక్కువ మార్చులు తెచ్చుకోవడం పెద్దలకి కోపం తెప్పించగలదని వాళ్లు గ్రహించారు. అందుకే చదువు ప్రాధాన్యత తగ్గించకుండానే లైంగిక విషయాల మీద కూడా ఆసక్తిని పెంచుకుంటున్నారు. మార్కులే ముఖ్యం కాబట్టి కన్యత్వానికి ప్రాధాన్యత తక్కువనే అభిప్రాయాన్ని కూడా ఏర్పరుచుకున్నారు. వాళ్ల ఉద్దేశంలో సెక్స్‌ అనేది ఓ ఫన్‌. చాట్స్‌, ఎస్సెమ్మెస్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో చర్చించుకోవడానికి మంచి హాట్‌ టాపిక్‌. దేశంలోని 19 ప్రధాన పట్టణాల్లో నివసించే నాలుగువేలమంది పిల్లల మీద సర్వే చేసినప్పుడు పెద్దలను ఆందోళనకు గురిచేసే వాస్తవాలెన్నో వెలుగులోకొచ్చాయి.
 
ప్రతి 10 శాతం  మంది పదో తరగతి విద్యార్థుల్లో ముగ్గురు సెక్స్‌ అనుభవాన్ని పొందుతున్నారు. వీళ్లలో 46 శాతం  మంది స్కూలు, కాలేజీ ప్రాంగణంలో కండోమ్‌ ప్యాక్స్‌ చూసినట్టు చెప్పారు. 25 శాతం  మంది తమ తోటి విద్యార్థులు గర్భం దాల్చినట్టు చెప్పారు. 2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2014కి 10:3 స్థాయికి పెరిగింది. 2004లో చేపట్టిన మరో సర్వేలో తొలి సెక్స్‌ అనుభవాన్ని పొందిన వయసు 18 - 26 ఏళ్లుంటే 2014లో ఈ వయోపరిమితి 15 - 16కి తరిగిపోయింది. ఇంతకుముందు తరం పిల్లలతో పోలిస్తే నేటి తరం పిల్లలకు సాంకేతిక ఎంతో అందుబాటులోకొచ్చింది. ఫలితంగా ఇంటర్నెట్‌లో అశ్లీల చిత్రాలు చూడటం పరిపాటైపోయింది. అయితే పిల్లల్లో ఇలాంటి మార్పుకు కారణమేంటి? లైంగిక ఆసక్తి లేదా శరీర హార్మోన్ల ఉధృతి వల్లే పిల్లలు సెక్స్‌ పట్ల ఆకర్షితులవుతున్నారా? 

ప్రేమే ప్రధానం 
ప్రేమలో పడ్డప్పుడు లైంగికంగా దగ్గరవ్వాలనే కోరిక కలగటం సహజం. కానీ దశాబ్దం క్రితం ఆ కోరికలు ముద్దులు, కౌగిలింతలవరకే పరిమితమయ్యేవి. శారీరకంగా దగ్గరవ్వటానికి పెళ్లి వరకూ ఆగాల్సిందేననే దృఢాభిప్రాయం అప్పటి యువతలో బలంగా ఉండేది. కానీ నేటి తరంలో అంతటి సహనం లోపిస్తోంది. వీళ్లలో ప్రేమ ఒరవడి సెక్స్‌ కేసి పరుగులు పెట్టేలా చే స్తోంది. సెక్స్‌ అనుభవం పొందటానికి ప్రేమ ఓ కారణమవుతోంది. సెక్స్‌ అనుభవం పొందిన టీనేజర్లందరూ అవతలి వ్యక్తితో ప్రేమలో ఉన్నాం కాబట్టే శారీరకంగా దగ్గరయ్యాం అని చెప్పడం విశేషం. కన్యత్వానికి విలువిచ్చే ఐదు శాతం మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. కేవలం 6 మంది తాము సెక్స్‌ అనుభవాన్ని పొందకపోవడానికి కారణం తమకు తగిన జోడి దొరకక పోవడమేనని చెప్పారు.
 
నెర్డ్స్‌ అండ్‌ కూల్స్‌ 
టీనేజర్ల ప్రపంచం ‘నెర్డ్స్‌, కూల్స్‌’ అనే రెండు వర్గాలుగా విడిపోయింది. చదువు, సెక్స్‌ ప్రాతిపదికగా యువత మధ్య పోటీ నెలకొంది. ఎటువంటి సోషల్‌ స్కిల్స్‌ లేకుండా, ఎప్పుడూ చదువుతూ శరీర బరువుని మించిన ఐక్యు కలిగి ఉండే వాళ్లు నెర్డ్స్‌. వీళ్లకు సెక్స్‌ పట్ల ఆసక్తి ఉన్నా ఉద్రేకపరిచే విషయాలను పుస్తకాల్లో వెతుక్కుంటారు తప్ప ప్రయోగాల జోలికి వెళ్లరు. వీళ్లెప్పుడూ ఐఫోన్‌, ఐపాడ్లకు అతుక్కుపోయి ఉంటారు. వీళ్లకు చదువే తప్ప సెక్స్‌ ప్రాధాన్యం కాదు. ఈ వర్గానికి చెందిన అమ్మాయిలు తక్కువ మేకప్‌ వేసుకుంటారు. అమ్మాయిలు ఆకర్షణల గురించి అబ్బాయిలు మైనర్‌ క్రష్‌ల గురించి మాట్లాడుకుంటారు. ఇక కూల్స్‌ విషయానికొస్తే వీళ్లకి ప్రేమే ప్రపంచం. వీళ్లు భాగస్వాముల్ని తరచుగా మార్చేస్తుంటారు. పెద్దలకుద్దేశించిన పుస్తకాలు చదువుతారు. జేబుల్లో కండోమ్‌ ప్యాకెట్స్‌ ఉంచుకుని స్కూలు, కాలేజీ వేళల్లో ప్రయోగాలు చేస్తుంటారు.
 
పిల్లలు పెద్దల్ని అడిగితే... 
ప్రతి తల్లిదండ్రులు మేం ఎలా పుట్టాం? అనే ఇబ్బందికరమైన ప్రశ్నను పిల్లల్నుంచి ఒక్కసారైనా ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అప్పటికి తోచిందేదో చెప్పేసి మాట దాటేస్తుంటాం. కానీ పిల్లల్లో అంతటితో ఆ ఆసక్తి ఆగిపోదు. స్కూల్‌లో బయాలజీ టీచర్‌ కూడా పునరుత్పత్తి పాఠం చెప్పేటప్పుడు స్పెర్మ్‌, అండాన్ని కలిసే క్రమాన్ని ఓ కథలా చెపుతుంది కానీ వాస్తవంలో ఇంతకుమించిన ఆసక్తికరమైన అంశమేదో దాన్లో ఉందని పిల్లలకు తెలుసు. పైగా తల్లిదండ్రులు, టీచర్లు చెప్పే విషయాల్లో విద్యార్ధులు మాటల్లో తరచుగా దొర్లే ‘జీ-స్పాట్‌, సెక్స్‌, స్వయంతృప్తిలాంటి పదాలేవీ వినిపించవు. వీటి గురించిన సమాధానాలకోసం పిల్లలు అంతర్జాలంపై ఆధారపడుతున్నారు.
 
ఊబకాయంతో చదువులో వెనకబడిన ఓ విద్యార్ధి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విమర్శలతో విసుగెత్తిపోయి ఉపశమనం కోసం అంతర్జాలాన్ని వెతకటం మొదలుపెట్టింది. తన అభిమాన సోషల్‌ వెబ్‌సైట్‌లో తప్పుడు ఈమెయిల్‌ ఐడి, ప్రొఫైల్‌ తయారుచేసి అపరిచితులతో చాటింగ్‌ ప్రారంభించింది. అలా తనకు తాను ఏర్పరచుకున్న ప్రపంచంలో తనకిష్టమైనట్టుగా గడపటం మొదలుపెట్టింది. కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయికి ఇప్పుడు నలుగురు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లతో ఫోర్‌ప్లే మొదలుకుని ఇంటర్‌కోర్స్‌ వరకూ ఆమె చర్చిస్తూ ఉంటుంది. అసహ్యించుకోకుండా అందరూ తనను కోరుకోవాలనే ఆకాంక్షను ఆమె అలా తీర్చుకుంది. ఈమెలాగే ఎంతోమంది టీనేజర్లకు ఇంటర్నెట్‌ ప్రయోగాలకు, పరిశోధనలకు ఓ వేదికగా మారింది. ‘టిండర్‌, హైక్‌, మ్యాచ్‌.కామ్‌, ప్లెంటీ ఆఫ్‌ ఫిష్‌, ఓకెక్యుపిడ్‌ మొదలైన చాటింగ్‌, వీడియో షేరింగ్‌ మొబైల్‌ యాప్స్‌ సహాయంతో యువత సెక్స్‌ సంబంధ అంశాలను సరఫరా చేసుకుంటున్నారు. శ్నాప్‌చాట్‌ అనే యాప్‌ ద్వారా పంపించిన ఫోటో లేదా వీడియో వీక్షకులు చూసిన 10  సెకండ్లకే డిలీట్‌ అయిపోతుంది. ఇలాంటి రిస్క్‌ఫ్రీ యాప్స్‌ వల్ల ఉపయోగమున్నా శ్నాప్‌చాట్‌లో ఫొటోలు డిలీట్‌ అయిపోకుండా కాపాడే శ్నాప్‌సేవ్‌ అనే యాప్‌ కూడా రూపొందింది. కాబట్టి ఇలాంటి ఫోటోలు, వీడియోలు ఎప్పటికైనా ప్రమాదకరమే!
 
పిల్లలతో పెద్దలు మాట్లాడితే? 
పిల్లలతో సెక్స్‌ గురించి చర్చించే విషయంలో పెద్దలకెన్నో అనుమానాలున్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ఓ వయసొస్తే వాళ్లంతటవాళ్లే తెలుసుకుంటారని కొందరి అభిప్రాయం. వాళ్లతో సెక్స్‌ గురించి చర్చించటం ద్వారా అంతకుముందు వరకూ లేని సెక్స్‌ ఆలోచనలను పిల్లల్లో కలిగించినట్టవుతుందేమోననేది ఇంకొందరు పెద్దల అనుమానం. ఈ సంశయాలతో ఆ సబ్జెక్ట్‌ను సాధ్యమైనంతవరకూ వాయిదా వేస్తూ ఉంటారు. కానీ మనసులో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలను ఇతర మార్గాల్లో పిల్లలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారని తల్లిదండ్రులు తెలుసుకోలేరు. ఆ ప్రయత్నంలో భాగంగా లైంగిక అనుభవాన్ని కూడా పొందే ప్రయత్నం చేసే అవకాశాలూ లేకపోలేదు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే తీరులో సెక్స్‌, దాని అవసరం, పర్యవసానాలు గురించి స్పష్టంగా చెప్పాలి. అశ్లీలతకు తావు లేకుండా, స్నేహపూర్వకమైన స్వరంతో, అదొక సాధారణమైన విషయంలా పిల్లలకు చెప్పగలగాలి.
 
స్నేహితులు, ఇంటర్నెట్‌, అశ్లీల పుస్తకాలు అందించే అసభ్య వివరణల కంటే తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్న సమాచారం వల్ల పిల్లలు లైంగిక ఆసక్తిని పెంచుకోకుండా వాస్తవ ధృక్పధంతో నడుచుకునే అవకాశాలుంటాయి. సెక్స్‌కు సంబంధించిన చర్చకు పిల్లలు ఆసక్తి కనబరిచినప్పుడు పెద్దలు కూడా జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రులతో సఖ్యతగా మెలిగే పిల్లలు తమ లైంగిక అనుమానాలను నివృత్తి చేసుకోవడం మొదలుపెట్టారు. సెక్స్‌ గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడారా? అనే ప్రశ్నకు 91 శాతం  మంది ‘లేదు’ అని సమాధానం చెబితే కేవలం 9 శాతం  మంది మాత్రమే అవునని సమాధానమిచ్చారు. ఈ సర్వేలో 10  మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో స్వయంతృప్తి గురించి చర్చిస్తున్నట్టు తెలిసింది. 37 శాతం  మంది పిల్లలు వాళ్ల రిలేషన్స్‌ గురించి పెద్దలకు చెప్పేస్తున్నారు. 25 మంది పిల్లలు తల్లిదండ్రులిద్దరికీ చెపుతుంటే, కేవలం 18 శాతం  మంది తల్లులతో మాత్రమే తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఇది స్వాగతించవలసిన విషయం.


పెద్దల రిపోర్టు 
పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకోవటం - 48% 
- పెద్దలతో అమర్యాదగా ప్రవర్తించటం - 30%
- అశ్లీల వెబ్‌సైట్లు చూడటం - 10%

పిల్లల రిపోర్ట్‌ 
క్యాంపస్‌లో కండోమ్స్‌ను చూసినవాళ్లు - 63%
రొమాంటిక్‌గా ముద్దుపెట్టుకున్నవాళ్లు - 95%
స్వయంతృప్తి పొందినవాళ్లు - 81%
సెలబ్రిటీలతో సెక్స్‌ కలలు కన్నవాళ్లు - 55%
ఎవరితోనైనా ప్రేమిస్తున్నట్టు చెప్పారా? - 92%

లైంగికపరమైన అంశాల్లో పిల్లలతో పెద్దలు ఎలా మసలుకోవాలంటే... 
దాన్నో తప్పులా చూడకుండా దగ్గర కూర్చోబెట్టుకుని మృదువుగా మాట్లాడాలి. 
నువ్వు తప్పు చేస్తూ పట్టుబడ్డావు అనే అర్థం ధ్వనించకుండా పిల్లలను అనునయిస్తూ మాట్లాడాలి. 
ఏదో వెబ్‌సైట్‌ కోసం వెతుకుతుంటే ఇలాంటి అసభ్యమైనవి కనిపిస్తూ ఉండటం మామూలే అని విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్టు నటించాలి. 
అదే సమయంలో అలాంటి అశ్లీల వెబ్‌సైట్ల వల్ల కలిగే పర్యవసానాల గురించి చెప్పాలి. 
ఇంకోసారి అలాంటివి కనిపించకుండా చూసుకొమ్మని హెచ్చరించాలి. 
ఎదిగే వయసులో శరీరంలోని హార్మోన్ల పనితీరు, వాటి ప్రభావాలు, మనసులో చెలరేగే ఆలోచనల గురించి విపులంగా పిల్లలతో చర్చించాలి. 
పిల్లలు స్వయంతృప్తి పొందటం ఎంతో సహజమైన చర్య. అంతమాత్రాన దాన్ని పాపంలా, చేయ కూడని పనిలా పిల్లల్ని దండించకూడదు.

డాక్టర్‌. ప్రవీణ్‌ కుమార్‌ చింతపంటి, సైకియాట్రిస్ట్‌, ట్రాంక్విల్‌ హాస్పిటల్‌ , హైదరాబాద్‌