సాఫ్ట్‌డ్రింక్స్‌కు బదులుగా..!

10-05-2019: ఎండలు మండిపోతున్నాయి. సాఫ్ట్‌ డ్రింక్స్‌ తాగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. రోజుకు కనీసం ఒక్క సాఫ్ట్‌ డ్రింక్‌ అయిన తాగుతున్నా. అయితే సాఫ్ట్‌ డ్రింక్స్‌లో రసాయనాలుంటాయని, మంచివి కావని అందరూ ఎంత చెప్పినా మానుకోలేకపోతున్నా. సమ్మర్‌లో దాహం తీర్చుకోవడం చాలా కష్టం కదండీ... ఏదైనా మంచి ఉపాయం చెప్పండి.
 
-రాధిక, రామంతపూర్‌, హైదరాబాద్‌
 
 ఎండాకాలంలో దాహం చాలా ఎక్కువగానే ఉంటుంది. సాఫ్ట్‌డ్రింక్స్‌ తాగేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. అయితే వేసవి దాహార్తిని తీర్చుకోవడానికి ఇవి పాటించండి.
 
దాహం వేసినప్పుడల్లా మంచినీళ్లు తీసుకోవడం. సాఫ్ట్‌ డ్రింక్‌ తాగాలన్నా కూడా మొదట నీళ్లు తాగిన తర్వాత వాటిని తాగడం బెటర్‌.
జ్యూసులో కొద్దిగా చక్కెర, ఉప్పు వేసుకుని తాగడం వల్ల చెమట ద్వారా పోయిన లవణాలు తిరిగి చేరుతాయి. నీరసం పోతుంది. దాహార్తి తగ్గుతుంది.
జ్యూస్‌లలో సోడా వేసుకుని తాగడం వల్ల ఫిజ్‌ సాఫ్ట్‌ డ్రింక్‌లా ఉంటుంది. అప్పుడు సాఫ్ట్‌ డ్రింక్‌ జోలికి వెళ్లకుండా జ్యూసులే తాగుతారు. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలలో కూడా సోడా మిక్స్‌ చేసుకుని తాగొచ్చు.
ఒక గ్లాసులో మీకిష్టమైన ఐస్‌క్రీమ్‌ వేసి, మెల్లగా సోడా కలుపుకుంటే అద్భుతమైన ఐస్‌క్రీమ్‌ సోడా తయారవుతుంది. ఐస్‌క్రీమ్‌లోని కాల్షియం కండరాల బలహీనతను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎండదెబ్బ వల్ల వచ్చే కండరాల బలహీనతను పోగొడుతుంది.
పండ్ల రసాలను ఐస్‌ ట్రేలో పెట్టి ఐస్‌క్యూబ్స్‌ తయారుచేసి, ఒక గ్లాసులో వేసుకుని సోడా కలిపితే చాలా ఇంట్రెస్టింగ్‌, టేస్టీ జ్యూస్‌ రెడీ.
ఈ విధంగా సమ్మర్‌లో ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేట్‌ చేసుకుంటూ ఉండటం చాలా అవసరం.
 
డాక్టర్‌ బి.జానకి
న్యూట్రిషనిస్ట్‌