కడుపు చల్లగా...

27-05-2019: వేసవి సెలవుల్ని ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌ చేస్తున్న పిల్లలు ఒక్కసారిగా అనారోగ్యం పాలవుతారు. ఎండ, వేడిగాలులు ఎక్కువవడమే అందుకు ప్రధాన కారణం. వేడి ప్రభావంతో ఆకలి వేయకపోవడం, డీహైడ్రేషన్‌కు లోనవడం, పొట్టలో నులిపురుగులు ఏర్పడడం, డయేరియా, వాంతులు వంటివి పిల్లల్ని, వారి తల్లుల్ని కలవరపరుస్తాయి. ఈ సీజన్‌లో పిల్లల ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు డాక్టర్‌ జయకాంత్‌ కొన్ని ఆహార సూచనలు చేస్తున్నారు. అవేమంటే..
 
సమస్యకు కారణం: వేసవిలో జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. కాబట్టి తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినిపించాలి. దాంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల శరీరంలో నీరు, ఎలకో్ట్రలైట్స్‌, లవణాల శాతం తగ్గిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం, ద్రవ పదార్థాలు ఎక్కువగా తినిపించాలి.
 
ఆహారం: పిల్లలకు ఒకేసారి పొట్ట నిండుగా ఆహారం ఇవ్వకూడదు. తక్కువ తక్కువగా రోజులో కొద్ది సమయం తేడాతో ఎక్కువసార్లు తినిపించాలి. దాంతో ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. అంతేకాదు వారిలో ఆకలి పెరుగుతుంది కూడా. తాజా ఆకుకూరలు, తాజా పండ్లు తొందరగా అరుగుతాయి. ఇవి పిల్లల్ని ఎక్కువ సేపు హైడ్రేట్‌గా ఉంచుతాయి.
 
నీటిని భర్తీ చేసేందుకు: ఈ కాలంలో పిల్లల్లో ఆకలి మందగించడం, శక్తి తగ్గిపోవడం చాలా సాధారణం. నీళ్లు, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మామిడి పన్నా వంటివి శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేస్తాయి. తాజాపండ్లు విటమిన్లు, లవణాలను మాత్రమే కాదు నీటిని కూడా అందిస్తాయి.
 
హెర్బ్స్‌: కొత్తిమీర, అల్లం, సోంపును వంటలో చేర్చడం ద్వారా పిల్లలకు ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. ఈ పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు పొట్ట మీద ఒత్తిడిని తగ్గించి, జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ జరిగేలా చూస్తాయి. వేడికి చమట రూపంలో లవణాలను శరీరం కోల్పోతుంది. కాబట్టి ఆహారంలో సరిపడా ఉప్పు వేయాలి.
 
ఇవి తినిపించకూడదు: స్పైసీ ఫుడ్‌, వేపుళ్లు ఈ సీజన్‌లో తినిపించకూడదు. ఎందుకంటే ఇవి ప్లీహాన్ని బలహీనం చేసి, పొట్టలో వాపునకు కారణమవుతాయి. కాబట్టి వీటికి బదులు బీన్స్‌, క్యారెట్లను పిల్లలకు తినిపిస్తే ప్లీహం, ఉదరం ఆరోగ్యంగా ఉంటాయి.