చలికాలంలో బరువు పెరుగుతారా?

ఆంధ్రజ్యోతి, 01-11-2015: చలికాలం వస్తే బరువు పెరుగుతామనేది చాలామంది అభిప్రాయం, కానీ ఇది పూర్తిగా తప్పంటున్నారు వైద్యనిపుణులు. చలికాలానికి, బరువుకు సంబంధం ఉందని శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. చలికాలంలో తినే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. అతిగా తినకూడదు. అలాగే తీసుకుంటున్న ఆహారానికి తగ్గట్టు శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. చలికాలంలో బరువుపెరగడానికి బద్ధకం కూడా ఒక కారణమే. ఈ సీజన్‌లో ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల కూడా లావయ్యే అవకాశాలు ఉన్నాయి. నిద్ర ఎక్కువైనపుడు శరీరం బద్ధకంగా ఉంటుంది. నిద్రతో పాటు మితం లేకుండా తినడం వల్ల ఊబకాయం వస్తుంది. ఆహారం విషయంలో ఏమి తింటున్నామన్న దానిపై అవగాహనతో మెలగాలి. ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకుంటే మంచిది. శీతాకాలంలో తినాల్సినవి తినకుండా వేరేవి తినడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. తిండి బాగా తింటూ వ్యాయామాలు చేయకపోయినా లావెక్కుతారు. శీతాకాలంలో శరీర బరువు పరంగా కొందరిలో ఫ్లక్చుయేషన్స్‌ కూడా వస్తుంటాయి. హార్మోన్లలో వచ్చిన మార్పులతోపాటు కాలేయం దెబ్బతినడం వల్ల కూడా శరీర బరువులో తేడాపాడాలు కనిపిస్తుంటాయి. అందుకే శీతాకాలంలో వ్యాయామాలు చేయండి. సరైన డైట్‌ తీసుకోండి. నిద్ర వేళల్లో క్రమం పాటించండి. బద్ధకం వదలండి.