చలి కాలంలో ఆ వ్యాక్సిన్లు తప్పనిసరి

22-10-2019: చలి మెల్లగా పంజా విప్పుతోంది. చల్లని వాతావరణంలో వైరస్‌లు విజృంభిస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలూ పెరిగిపోతాయి. కాబట్టి వాటి నుంచి ముందస్తు రక్షణ పొందాలంటే వ్యాక్సిన్లను ఆశ్రయించాలి. అవేంటంటే....
 
స్వైన్‌ ఫ్లూ, న్యుమోకోకల్‌వ్యాక్సిన్లు తీసుకుంటే స్వైన్‌ ఫ్లూ, న్యుమోనియా వ్యాధులు తగ్గుముఖం పట్టడంతోపాటు మరింత పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఒకవేళ ఆ వ్యాధుల బారిన పడకపోయి ఉంటే వ్యాక్సిన్‌ తీసుకోవటం వల్ల వ్యాధి నుంచి కొంతమేర రక్షణ పొందవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గటం మూలంగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే వీలున్న వాళ్లు హీమోఫిలస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
 
న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌: 65 ఏళ్లు దాటిన వాళ్లు ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. మూత్రపిండాలు, గుండె, కాలేయం, సిఒపిడి, ధూమపానం, మధుమేహం, ఎముక మజ్జ లేదా ఇతర అవయవ మార్పిడులు చేసి ఉంటే తప్ప 65 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవటం అత్యవసరం. అవయవ మార్పిడికి వెళ్లేవాళ్లు మార్పిడికి ముందే ఈ వ్యాక్సిన్‌ తీసుకోవలసి ఉంటుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా, 65 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే న్యూమోకోకల్‌ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు. వీళ్లే కాకుండా చలికాలంలో ఎటువంటి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లకూ గురికాకుండా ఉండాలనుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
 
స్వైన్‌ ఫ్లూ: ఆరు నెలల వయసు పసికందు మొదలు ఎవరైనా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. ఎలాంటి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నా ఈ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.
 
హీమోఫిలస్‌ వ్యాక్సిన్‌: శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం మూలంగా పిల్లలు తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. ఎపిగ్లాయిటిస్‌ (తీవ్రమైన గొంతు ఇన్‌ఫెక్షన్‌), న్యుమోనియా మొదలైన ఇన్‌ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే ఐదేళ్ల లోపే ఈ వ్యాక్సిన్‌ను విడతలవారీగా ఇప్పించాలి.