వానాకాలంలో పిల్లలు జాగ్రత్త..!

ఆంధ్రజ్యోతి(9-6-15): ఇపుడిపుడే వర్షాలు ప్రారంభమవుతున్నాయి. వర్షం వస్తే పచ్చదనం పలకరిస్తుంది.. వాతావరణం చల్లబడుతుంది. అయితే ఈ వర్షంతో పాటు రకరకాల వ్యాధులు కూడా పలకరిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లిదండ్రులు మరీ జాగ్రత్తగా ఉండాలి. వానచినుకుల్లో చిందులేయాలని పిల్లలు తెగ ఆరాటపడతారు. వానలో తడిస్తే మాత్రం జలుబు.. దానివెంటే దగ్గూ, జ్వరం వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలోనే పిల్లలకి వ్యాధులు అతి సులువుగా వ్యాపిస్తాయి. అందుకే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

వర్షాకాలం అంటే ఇల్లయినా, పరిసరాలైనా సరే చిత్తడితో కూడుకుని ఉంటాయి. ముందుగా వర్షం నీళ్లు ఇంటిచుట్టూ  ఎక్కడైనా ఉండే వాటిని తేసేయాలి. అలాగే ఉంచితే మాత్రం ఈగలు, దోమలకి స్వాగతం పలికినట్లే. తద్వారా పిల్లలకి సులువుగా కలరా, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. అంతేనా అలర్జీలు, ఇన్‌ఫెక్షన్‌లు పిల్లల్ని త్వరగా అటాక్‌ చేసేది వర్షాకాలంలోనే.

తడి బట్టలను, తడి టవల్స్‌ను ఇంట్లో ఉంచితే బాక్టీరియా, ఫంగస్‌ అభివృద్ధి చెందుతుంది. అందుకే వాటిని గాలి తగిలేట్లు ఆరేయాలి. 
 మృదువైన యాంటీబాక్టీరియా సోప్‌తో కనీసం రోజుకు రెండుసార్లు పిల్లలకి స్నానం చేయించాలి.

వానాకాలంలో పిల్లలకి మలేరియా వంటి జబ్బులు వచ్చే ప్రమాదముంది. తాగే నీళ్లు కలుషితం కాకుండా చూసుకోవాలి. తాజా ఆహారాన్నే తీసుకోవాలి. వర్షాకాలంలో పిల్లల జీర్ణక్రియ తగ్గుతుంది.

ఇంటి ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఆహారంలో అల్లం, పసుసు లాంటి యాంటీఆక్సిడెంట్స్‌ ఉండేట్లు చూసుకోవటం ఉత్తమం. వేడి ఆహారాన్ని మాత్రమే పిల్లలకి పెట్టాలి. పచ్చిగుడ్డు, ఫ్రూట్‌ సలాడ్‌, లస్సీ, బటర్‌మిల్క్‌లకు దూరంగా ఉంచాలి.

ప్యూరిఫైర్డ్‌ నీళ్లు పిల్లలకి తాగించాలి. లేకుంటే నీటిని కాచి వడబోసి తాగించాలి. దీని వల్ల సాధ్యమైనంత వరకు పిల్లల జోలికి వ్యాధులు దాదాపు రావు.

ఇంట్లోని కూలర్లు, ఫ్లవర్‌వాజ్‌లను శుభ్రంగా ఉంచాలి. ఏ.సి.లను వానాకాలం వాడకపోవటం మంచిది. ఇక పిల్లల పాదాలను శుభ్రంగా ఉంచాలి. దీంతో పాటు పిల్లల షూస్‌ని క్లీన్‌గా ఉంచాలి.

వర్షాకాలంలో లైట్‌ కాటన్‌, లూజ్‌ క్లోత్స్‌ని పిల్లలకి వేయాలి. పిల్లలు బయట ఆడుకొని వచ్చాక శుభ్రపరచాలి.

వానాకాలంలో పిల్లల గోర్లలో చేరుకున్న మట్టిని క్లీన్‌ చేయాలి. ఎందుకంటే పిల్లలు తరచూ వేళ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల కడుపునొప్పి సమస్యలు వస్తాయి... మొత్తానికి వానాకాలం వచ్చే వ్యాధుల బారినుండి పిల్లల్ని కాపాడాలంటే ముందు జాగ్రత్తలే శరణ్యం.