వానలో ఇలా ముందుకు...

30-07-2019: వానలకు బురదమయమై, నీళ్లు నిలిచిన రోడ్ల మీద నడక అంత సులువు కాదు. సరైన ఫుట్‌వేర్‌ ఎంచుకోకుంటే ఈ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. ఈ సీజన్‌లో మెత్తని లెదర్‌, కూల్‌ కాన్వాస్‌ షూ సరైన ఎంపిక. హీల్స్‌ వేసుకునేవారు వెడ్జ్‌స్‌ ఎంచుకోవచ్చు. వర్షంలో నడవడానికి సౌకర్యంగా ఉండే మరికొన్ని ఫుట్‌వేర్స్‌....
 
గమ్‌ బూట్స్‌: వర్షాకాలంలో అనువైన ఫుట్‌వేర్‌. వీటిని ధరిస్తే దుస్తుల మీద బురద చిమ్మకుండా ఆఫీసు, కాలేజీకి వెళ్లొచ్చు. పలు రంగుల్లో లభించే గమ్‌బూట్స్‌ ఫ్యాషన్‌గానూ ఉంటాయి.
 
కాన్వాస్‌ స్నీకర్స్‌: వానాకాలంలో కాన్వాస్‌ స్నీకర్స్‌ తప్పనిసరిగా ఉండాలి. వర్షంలో బయటకు వెళ్లేందుకు ఇవి పర్‌ఫెక్ట్‌ ఛాయిస్‌. వీటికి బురద అంటినా కూడా శుభ్రం చేయడం తేలిక కాబట్టి పాడవుతాయనే బెంగ అక్కర్లేదు. కాన్వాస్‌ షూ కూడా ఇప్పుడు మంచి ఛాయిస్‌.
 
జెల్లీ ఫ్లాట్స్‌: స్టయిల్‌గా ఉండే వీటితో వర్షంలో ఎంచక్కా సాగిపోవచ్చు. పాదాలకు గాలి తగులడమే కాదు ప్యాంట్‌ మీద బురద చిమ్మకుండా ఉంటుంది. పాప్‌ కలర్స్‌లో లభించే ఈ సీజన్‌లో పర్‌ఫెక్ట్‌ ఫుట్‌వేర్‌.
 
క్రోక్స్‌: వర్షంలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు క్రోక్స్‌ వేసుకుంటే సరి. తడిసినా కూడా పాడవవు. డెనిమ్‌ జీన్స్‌ మీదకు సరిజోడుగా ఉండే ఇవి స్టయిల్‌గానూ ఉంటాయి.