వానల్లో ఇవి మేలు!

02-07-2019: వర్షాకాలంలో జలుబు, గొంతు పొడిబారడం వంటి సమస్యలు చాలా సాధారణం. వీటి బారిన పడకుండా ఉండేందుకు పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఫిట్‌గా ఉంటూ రెయినీ డేను ఎంజాయ్‌ చేసేందుకు తోడ్పడే ఎటువంటి ఆహారం, పానీయాలు తీసుకోవాలో సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్‌ అవంతీ దేశ్‌పాండే. అవేమిటంటే...
 
హెర్బల్‌ టీ: వర్షం పడుతున్న సాయంత్రం వేడివేడి హెర్బల్‌ టీ, స్నాక్స్‌ పర్‌ఫెక్ట్‌ కాంబినేషన్‌. హెర్బల్‌ టీ శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోకి చేరిన హానికర బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
 
డ్రై ఫ్రూట్స్‌: కాజూ, వాల్‌నట్‌, బాదం, ఖర్జూరం వంటివి ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచి, వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను అడ్డుకుంటాయి.
 
యోగర్ట్‌: ప్రొటీన్లు, ప్రొబయాటిక్స్‌ మెండుగా ఉండే యోగర్ట్‌ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. దీన్ని స్మూతీల్లో లేదా మజ్జిగగా తీసుకున్నా మంచిదే. రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యానికి భరోసానిచ్చే ఆహారం ఇది.
 
సుగంధ ద్రవ్యాలు: పసుపు, నల్లమిరియాలు, అల్లం, దాల్చినచెక్కను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇవి భోజనం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతాయి. వీటితో పాటు తాజా కూరగాయలు, పండ్లు తింటే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉంటారు.