ఇవీ... వేసవి వెతలే!

02-04-2019: ఎగసిపడే ఉత్సాహమే తప్ప ఎన్నికల కోలాహలంలో మరేదీ స్ఫురించదు. మండుటెండలో తిరుగుతున్నామనీ, తీసుకోవలసిన ఆహారం, పానీయాలను నిర్లక్ష్యం చేస్తున్నామనీ గ్రహింపు ఉండదు. ప్రచార యాత్రలో భాగంగా అందుబాటులో ఉన్నవి ఆరగిస్తూ, పానీయాలు తాగేస్తూ సాగిపోతుంటాం. ఫలితంగా వేసవిలో సైతం చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి పలు రుగ్మతలకు గురవుతుంటాం. ఎండలతో వచ్చే ఇలాంటి సమస్యలకు హోమియో వైద్యంతో చెక్‌ పెట్టవచ్చు!
 
ముక్కు సమస్యలు...
 
వేసవిలో నేల పైన ఉన్న దుమ్ము పూర్తిగా పొడిగా ఉండడం వల్ల సాధారణ గాలికి కూడా ఎగిసిపడుతుంది. ఇది ముక్కువాహికలో చేరిపోతుంది. దీనికి తోడు, వేసవిలో పుప్పొడి సమస్య కూడా తీవ్రంగానే ఉంటుంది. పూల నుంచి రాలి పడిన పుప్పొడి ఎండకాలం కొన్ని మైళ్ల దూరం వ్యాపిస్తుంది. అందువల్ల వేసవిలో కొందరు తరచూ తుమ్ములూ, దగ్గు, ఆయాసం ముక్కు దిబ్బడ, తలనొప్పికి గురవుతూ ఉంటారు. ఈ స్థితిలో నోటికీ, ముక్కుకూ మాస్క్‌లు ధరించడంతో పాటు ప్రాణ శక్తినీ, వ్యాధి నిరోధక శక్తినీ పెంచుకోవాలి. అప్పటికే ఎన్నోసార్లు వేసవిలో ఇలాంటి సమస్యలకు గురైన వాళ్లు తమ శరీర తత్త్వంలో ఒక లోపం ఉందని గ్రహించి, ప్రతి ఏటా ఆ సమస్యలు మొదలవ్వక ముందే వ్యాధి నిరోధక శక్తిని పెంచే కొన్ని రకాల మందులను వాడాలి. ఒకవేళ ఇటీవలే కొత్తగా ఈ సమస్య మొదలై ఉంటే, ముందు వైద్య చికిత్సలు తీసుకుని, ఆ తర్వాతైనా వ్యాధినిరోధక శక్తిని పెంచే మందులు తీసుకుంటే సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు.
 
చికిత్స ఇలా!
వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవడానికి ఇచ్చే మందులు అందరికీ ఒకేలా ఉండవు. వాళ్లలో కనిపించే లక్షణాల ఆధారంగానే ఆ మందులు ఉంటాయి. శ్వాసపరమైన ఇబ్బందులతో ముడివడి ఉంటే ఆర్సనిక్‌ ఆల్బ్‌, ఎపార్‌సల్ఫ్‌, ఇపికాక్‌ వంటి మందులు బాగా పనిచేస్తాయి. వీటితో పాటు కొన్ని రకాల నోసోడ్స్‌ కూడా తీసుకుంటే వ్యాధి నివారకంగా బాగా పనిచేస్తాయి.
 
గొంతు సమస్యలు!
వేసవిలో వచ్చే గొంతు సమస్యలకు కలుషిత పానీయాలు తాగడం ప్రధాన కారణం. పదే పదే చల్లనీళ్లు తాగడం, చల్లటి పండ్లరసాలు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం కూడా గొంతు సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడో కోసి పెట్టిన పళ్ల ముక్కలను తినేయడం వల్ల కూడా గొంతు సమస్యలు రావచ్చు. ఫారింజైటిస్‌కు దారి తీసే ఈ సమస్యల్లో ప్రధానంగా గొంతులో గరగర, గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే గొంతు సమస్యలు అక్కడే ఆగిపోకుండా కాస్త విస్తరించి, సైనసైటిస్‌, టాన్సిలైటిస్‌, చెవికి సంబంధించి ఒటైటిస్‌ సమస్యలతో పాటు, శ్వాసకోశాల ఇన్‌ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.
 
చికిత్స ఇలా!
గొంతు నొప్పినుంచి వెంటనే ఉపశమనం అందించడంలో ఎపార్‌సల్ఫ్‌, కాంగినేరియా నైట్రికమ్‌ వంటి మందులు బాగా పనిచేస్తాయి. పైకి అతి సామాన్యంగా కనిపించే ఈ సమస్యలన్నింటికీ పైపై కారణాలు మాత్రమే ఉండవు. కొందరిలో అంతర్గతంగా జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవడం, తీసుకున్న పోషకాలను శరీరం సరిగా గ్రహించలేకపోవడం లాంటి సమస్యలూ ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థలో ఏమైనా సమస్యలు ఉన్నా పోషకాల శోషణ జరగదు. కాబట్టి మూల కారణం ఆధారంగా చికిత్స తీసుకోవాలి.
 
చెవుల సమస్యలు
వేసవిలోని వడగాలి వల్ల చెవుల్లోని గులిమి గట్టిపడి, ఆడిటరీ కెనాల్‌లో బిగదీసుకుపోతుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి కలుగుతుంది. వేసవిలో కొందరు రోజూ ఈతకు వెళుతుంటారు. ఈత సమయంలో నీళ్లు చెవిలోకి ప్రవేశించి, మధ్య చెవి ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. కాలువ, నది లాంటి ప్రవహించే నీటిలో ఈత కొట్టడం వేరు. నీళ్లు నిలువ ఉండే స్విమ్మింగ్‌ పూల్స్‌లో స్విమ్మింగ్‌ చేయడం వేరు. ఈత కొలనులు అన్నీ శుభ్రంగా ఉండకపోవచ్చు. వాటిలోని నీళ్లు వైరల్‌, బ్యాక్టీరియామయంగా ఉంటే, అవి చెవిలోకి వెళ్లడం వల్ల పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇతర కారణాల్లోకి వెళితే, చెవిలోని అంతర్వాహిక, ముక్కు, గొంతుతో అనుసంఽధానం అయి ఉండడం వల్ల అంతకు ముందే సైనసైటిస్‌, ఫారింజైటిస్‌, టాన్సిలైటిస్‌ ఉన్నవాళ్లు ఎండతో ప్రభావితమయ్యే అవకాశం మరింత పెరుగుతుంది. అంతకు ముందు ఉన్న ఇతర సమస్యలన్నీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
 
చికిత్స ఇలా!
చెవిలోని గులిమి గట్టిపడటమే సమస్య అయితే దాన్ని మెత్తబరచడానికి హోమియోలో నులిన్‌ ఆయిల్‌ అనే ఇయర్‌ డ్రాప్స్‌ ఉంటాయి. వీటిని 4 రోజుల పాటు వరుసగా వేసుకుంటే అది మెత్తబడుతుంది. గులిమి గట్టిపడకుండా ఉండడానికి కూడా అప్పుడప్పుడు ఇయర్‌ డ్రాప్స్‌ వేసుకోవచ్చు. దాన్ని తొలగించడానికి ఇ.ఎన్‌.టి డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈత కారణంగా ఇన్‌ఫెక్షన్‌ వస్తున్నట్లు అనిపిస్తే, ఈత సమయంలో ఇయర్‌ ప్లగ్స్‌ వాడితే నీళ్లు చెవిలోకి వెళ్లవు. ఒకవేళ అంతకు ముందునుంచే చెవి ఇన్‌ఫెక్షన్‌ సమస్య ఉన్నవాళ్లయితే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవాలి. లేకపోతే చెవిలో ఎప్పటి నుంచో ఉన్న ఇన్‌ఫెక్షన్లు మెదడుకు చేరి, తీవ్రమైన ఇతర సమస్యలకు దారి తీయవచ్చు. వడగాలిలో చెవినొప్పి రావడం అనేది ప్రాధమికంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య. దీనికి హోమియో మందు ‘కేమమిల్లా’ బాగా పనిచేస్తుంది. కేవలం ఎండ వల్ల కాకపోయినా, ఇన్‌ఫెక్షన్ల వల్ల నొప్పి వచ్చినా ఇన్‌ఫెక్షన్లకు వైద్యం చేయాలి. దానికి ‘హెపార్‌ సల్ఫ్‌, మెర్క్‌సాల్‌, పల్సటిల్లా’ వంటి మందులు బాగా పనిచేస్తాయి.
 
చిన్నప్పడు వచ్చిన వీజిల్స్‌, చికెన్‌పాక్స్‌ దుష్ప్రభావంగా కొంత మంది పిల్లలకు తరచూ చెవి ఇన్‌ ఫెక్షన్‌ వస్తుంది. చాలా సార్లు అది గమనానికి రాకుండానే ఉండిపోతుంది. కొన్ని ద్రవాలు విడుదల అవుతూనే ఉంటాయి. అయినా పట్టించుకోకుండా ఉండిపోతే ప్రమాదమే! అంతకు ముందే సైనసైటిస్‌, టాన్సిలైటిస్‌, ఫారింజైటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లు మరిన్ని సమస్యలకు గురవుతారు. అందువల్ల ఎండల్లో ఎదురయ్యే బాధల వెనుక ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని గమనించుకోవాలి.
 
రక్తస్రావాలతో జాగ్రత్త!
ముందు నుంచే సైనస్‌ సమ్యలు ఉన్నవాళ్లకు డ్రై హీట్‌ కారణంగా తరచూ తలనొప్పి వస్తుంది. వేసవి తాపం తీర్చుకోవడం కోసం చల్లనీళ్లు, శీతల పానీయాలు ఎక్కువగా తాగుతాం. అయితే వైరస్‌, బ్యాక్టీరియా చల్లని నీటిలోనే అధికంగా ఉంటాయి. బయట దొరికే నీళ్లల్లో కలుషితాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందువల్ల చల్లనీళ్లూ, శీతలపానీయాలూ, బండ్లపై అమ్మే పళ్లరసాలూ, బయటి నీళ్లు తాగకూడదు. కొంత మందికి ముక్కుల్లో బొడిపెలు ఉంటాయి. ఇవి వేసవి కాలంలో ఒరిపిడికి గురై, ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. ముక్కులోని సన్నని పొర ‘మ్యూకస్‌ మెంబ్రేన్‌’ వేడి గాలికి ఒడలి, అక్కడి సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతాయి. ఇది కూడా రక్తస్రావానికి కారణమవుతుంది. సైనసైటి్‌సలో కూడా రాపిడి ఎక్కువై, రక్తస్రావం కావచ్చు.
 
చికిత్స ఇలా!
వాతావరణ కారణాలతోపాటు, అంతకు ముందు నుంచే ఉన్న ఇతర సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు. అయితే ఏ కారణంగా రక్తస్రావం అవుతుందో గుర్తించి దానికి అవసరమైన చికిత్సలు అందించాలి. రక్తస్రావం అవుతున్నప్పుడు, ఐస్‌ప్యాక్‌లు పెట్టడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఫాస్పరస్‌, ఇపికాక్‌ వంటి మందులు కూడా బాగా పనిచేస్తాయి.
 
గొంతు బొంగురుపోతే?
సాధారణంగా వేసవిలో వచ్చే బొంగురు గొంతు సమస్య (ఫారింజైటిస్‌) తొందరగానే తగ్గుతుంది. కానీ, ఆ తర్వాత వచ్చే లారింగ్జయిటిస్‌ సమస్య తొందరగా తగ్గదు. ఎందుకంటే ఆ భాగానికి రక్తసరఫరా చాలా త క్కువగా ఉంటుంది. ఈ కారణంగా సమస్యనుంచి బయటపడ టానికి ఎక్కువ సమయం పడుతుంది. సమస్య వేసవితోనే మొదలైనా, వేసవి తర్వాత కూడా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఫారింజైటిస్‌కూ, లారింగ్జయిటిస్‌కూ హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కాకపోతే, ఎక్కువగా మాట్లాడే వాళ్లు సమస్య తగ్గేదాకా గొంతుకు సాధ్యమైనంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
 
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎండలోకి వెళ్లే అందరూ ఎండ తాలూకు దుష్ప్రభావాలకు గురికారు. దానికి మందు జాగ్రత్తలు తీసుకోవడం ఒక కారణమైతే, ఎప్పటినుంచో వెంటాడుతున్న కొన్ని వ్యాఽధులు కూడా అందుకు కారణమే. అన్నింటినీ మించి శరీర ధర్మం కూడా అందుకు మూలమే. అందువల్ల వేసవిలో వచ్చే చెవి, ముక్కు, గొంతు సమస్యలన్నింటికీ వేసవినే కారణంగా అనుకుని నిర్లక్ష్యంగా ఉండిపోకుండా, వాటి వెనుక పాత కారణాలు, ఎప్పటినుంచో తెలియకుండా కొనసాగుతున్న మూల వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని అవరమైన జాగ్రత్తలు, వైద్య చికిత్సలు తీసుకోవడం తప్పనిసరి.
డాక్టర్‌ కె. గోపాలకృష్ణ
హోమియో ఫిజిషియన్‌,
హోమియో కేర్‌ హోల్‌ హెల్త్‌ క్లినిక్‌,
చిక్కడపల్లి, హైదరాబాద్‌