చలికాలంతో ఈ .జబ్బులతో జాగ్రత్త సుమా..

హ..హ..హ...హాచ్!

08-07-2019: జలుబు చేసిందని వైద్యుల దగ్గరకువెళ్లొచ్చానంటే నవ్వే వాళ్లే ఎక్కువ!ముక్కుకు విక్స్‌ రుద్దుకుని,టాబ్లెట్‌ మింగితే సరిపోతుందిగా!అని ఉచిత సలహా ఇచ్చే వాళ్లూ ఉన్నారు!అయితే వర్షాకాలంలో దాడి చేసేజలుబు, దగ్గు, చెవి పోటు లాంటి రుగ్మతలనుఅంత తేలికగా తీసుకోకూడదు!అవి ఇన్‌ఫెక్షన్లకు మూలాలు కావచ్చు,తీవ్ర సమస్యలకూ దారి తీయవచ్చు!

చల్లని వాతావరణం, తేమతో నిండిన పరిసరాలు, జలుబు, దగ్గులను కలిగించే పలు రకాల సూక్ష్మక్రిముల వ్యాప్తికి, ఎలర్జీల వృద్ధికీ ఎంతో అనుకూలమైనవి. సాధారణ జలుబు, దగ్గులతో మొదలై ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారి తీసి తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తాయి. ఈ ఇబ్బందులు తాత్కాలిక ఉపశమనాన్ని అందించే మందులతో అన్ని సందర్భాల్లోనూ అదుపు కాకపోవచ్చు. సమస్య కారణం ఆధారంగా చికిత్స తీసుకోవలసిరావచ్చు. కాబట్టి ప్రత్యేకంగా వర్షాకాలంలో బాధించే జలుబు, దగ్గులను అంత తేలికగా తీసుకోకూడదు. వీటి మూలం ఎలర్జీలు అయి ఉండవచ్చు. వీటిలోనూ రకాలున్నాయి. అవేంటంటే....
 
ముక్కు, గొంతు ఎలర్జీలు!
ముక్కు సంబంధ ఎలర్జీ ‘రైనైటిస్‌’, గొంతుకు సంబంధించిన ఎలర్జీ ‘ఫారింగ్జయిటిస్‌’, చెవికి సంబంధించిన ఎలర్జీ ‘మిడిల్‌ ఇయర్‌ ఇన్‌ఫెక్షన్‌’! ఈ ఎలర్జీలను నిర్లక్ష్యం చేస్తే ‘సైనసైటి్‌స’కు దారి తీస్తుంది. ఈ ఇబ్బందుల లక్షణాలు స్పష్టంగా ఉంటాయి. అవేంటంటే....
 
రైనైటిస్‌: ముక్కు నుంచి నీరు కారుతుంది. తర్వాత దిబ్బెడ మొదలవుతుంది. దాంతో పాటు తలనొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాలు మొదలయిన నాలుగు రోజులు గడిచినా తగ్గకపోతే వైద్యులను కలవాలి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి వారం రోజుల వరకూ ఆగితే అది సైనసైటిస్‌గా మారుతుంది.

ఫారింగ్జయిటిస్‌: గొంతులో గరగర, గొంతులో ఏదో ఉన్నట్టు అనిపించడం, మింగుతున్నప్పుడు అడ్డుపడుతున్నట్టు అనిపించడం ఈ సమస్య ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు దాటి గొంతు బొంగురు కూడా పోవచ్చు. ఇలా జరిగిందంటే ఇన్‌ఫెక్షన్‌ చివరి దశకు చేరుకుందని అర్థం. ఈ సమయంలో కూడా చికిత్స అందించకపోతే ఫారింగ్జయిటిస్‌ ‘టాన్సిలైటి్‌స’కు దారి తీస్తుంది. టాన్సిలైటి్‌సలో దవడ ఎముకల దిగువ ఉండే టాన్సిల్స్‌ దగ్గరి లింఫ్‌ నోడ్స్‌ వాచి, జ్వరం కూడా వస్తుంది. ఈ దశలో ఎగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కూడా ఉంటుంది. కాబట్టి గొంతులో ఎలాంటి ఇబ్బంది అయినా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటే, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.

మిడిల్‌ ఇయర్‌ ఇన్‌ఫెక్షన్‌: జలుబుతో మొదలై ఐదు రోజులకు చెవిలో నొప్పి మొదలవుతుంది. చెవి నుంచి నీరు లేదా చీము కూడా కారుతూ ఉండవచ్చు. రైనైటిస్‌ దశ నుంచి సైనసైటి్‌సకు చేరుకున్న తర్వాత కూడా చికిత్స తీసుకోకపోతే చివరిగా మధ్య చెవికి ఇన్‌ఫెక్షన్‌ సోకి ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ను కూడా నిర్లక్ష్యం చేస్తే, అది మెదడుకు కూడా ప్రసరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రారంభంలోనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
 
ఈ చిట్కాలు ఉపయోగకరం!
ముక్కు దిబ్బెడ: వేడి నీళ్ల ఆవిరి పట్టడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
గొంతు నొప్పి, దగ్గు: ఉప్పు నీళ్లతో పుక్కిలించవచ్చు.
జలుబు: విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఎండిన ఉసిరి ముక్కలు తినాలి, నిమ్మరసం తాగాలి. ముక్కు, గొంతు, చెవి... ఈ మూడింటికీ లింక్‌ ఉంటుంది! వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ అయినా, ముక్కుతో మొదలై జలుబు ద్వారానే బయల్పడుతుంది. ఆ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే ముక్కు నుంచి గొంతుకు, అక్కడి నుంచి మధ్య చెవికి ఇన్‌ఫెక్షన్‌ పాకుతుంది. కాబట్టి జలుబు ఎలాంటిదైనా మూడు రోజులకు మించి తగ్గకపోయినా, జలుబుకు దగ్గు తోడయినా వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
 
దగ్గు ఆగకపోతే?
పొడి దగ్గు: వైర్‌సతో వచ్చే సాధారణ దగ్గు, దగ్గు మందులతో వారం రోజుల్లో తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే అది ఎలర్జిక్‌/సీజనల్‌ బ్రాంఖైటిస్‌ (ఎలర్జీ కారక దగ్గు)గా భావించాలి. ఇది సాధారణ మందులతో తగ్గకుండా చల్లగాలి సోకినా, సాయంత్రం వేళ వాతావరణం చల్లబడినా పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రివేళ దగ్గు ఎక్కువవుతుంది. ఈ దగ్గులో కఫం ఉండదు. మాట్లాడేటప్పుడు కూడా దగ్గు ఎక్కువవుతూ ఉంటుంది. ఆగకుండా దగ్గుతూ ఉండడం మూలంగా పెద్ద వయసు మహిళల్లో ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌’ (మూత్రం లీక్‌ అవడం), పొత్తికడుపులో నొప్పి లాంటి ఇబ్బందులూ మొదలవవచ్చు. ఈ దగ్గు చికిత్స చేసినా, వారం నుంచి 15 రోజులపాటు వేధించి క్రమంగా తగ్గుతుంది.
 
ఎలర్జీ కారకాలు: దుమ్ము, ధూళి, చలి, చల్లని నీళ్లు, పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, కాలుష్యం, పూల పుప్పొడి, పొగ...ఇవన్నీ దగ్గుకు దారితీసే ఎలర్జీ కారకాలు. వీటిని కనిపెట్టి దూరంగా ఉండడం, వైద్యుల పర్యవేక్షణలో యాంటీహిస్టమిన్‌ మందులు వాడడం ద్వారా ఎలర్జీలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఎలర్జీను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ తోడై కఫం కూడా మొదలవుతుంది. కాబట్టి రాత్రి పూట, మాట్లాడేటప్పుడు దగ్గు పెరుగుతున్నా, సాధారణ దగ్గు మందులతో తగ్గకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.
 
ఎలర్జీ మందులు: సాధారణంగా ఎలర్జీ కారక దగ్గుకూ మెడికల్‌ షాపులో ‘సెట్రిజిన్‌’ లాంటి మందులు కొని వాడేస్తూ ఉంటారు. ఈ మందులు కేవలం లక్షణాలను మాత్రమే కొంతమేరకు అదుపు చేయగలుగుతాయి. కానీ మూల కారణాన్ని సరి చేయలేవు.
 
జలుబు, దగ్గును నిర్లక్ష్యం చేస్తే?
సాధారణ జలుబు, దగ్గు కదా అని నిర్లక్ష్యం చేసినా, మందుల షాపుల్లో తోచిన మాత్రలు కొనుక్కుని వాడుతూ ఉండిపోయినా... ఈ ఇబ్బందులు తగ్గకపోగా, మరింత లోతుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా జ్వరం, ఎగువ, దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, ముక్కుకు సంబంధించి సైనసైటిస్‌, చెవి నుంచి నీరు, చీరు కారడం మొదలైన తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
 
ఎలర్జీ తత్వం, లక్షణాలను బట్టి...
ముక్కు, గొంతు, చెవులకు సంబంధించిన ఎలర్జీ లక్షణాలు, తత్వాలు వేర్వేరుగా ఉంటాయి. కొందరికి వర్షాకాలం, లేదా చలికాలం, వేసవి కాలాల్లోనే సమస్యలు వేధిస్తే, మరికొందరికి ఏడాది పొడవునా వేధిస్తాయి. కాబట్టి ఎలర్జీ కారకాలతో పాటు ఎలర్జీ రకం కూడా కనిపెట్టి తదనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ ఉంది అని గ్రహించడానికి తోడ్పడే లక్షణాలు ఇవే!
ఆగకుండా తుమ్ములు, ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆగకుండా 20 నుంచి 30 సార్లు తుమ్ముతూ ఉండడం
ముక్కు, కళ్ల నుంచి నీరు కారడం
మాట్లాడేటప్పుడు, రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువగా ఉండడం వీటికి దూరంగా ఉంటే మేలు! ఎలర్జీ కారకాలకు దూరంగా ఉండడమే మొట్టమొదటి ఎలర్జీ పరిష్కారం. ఇందుకోసం...
ఉదయం 7కు ముందు, రాత్రి 7 తర్వాత చల్లని వాతావరణంలో బయటకు వెళ్లకూడదు
ముక్కుకు మాస్క్‌ ధరించాలి
చల్లనీళ్లు, పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి
ఫుడ్‌ ఎలర్జీ ఉంటే, ఏ పదార్థం వల్ల ఎలర్జీ వస్తుందో స్వయంగా పరిశీలించి వాటికి దూరంగా ఉండాలి
ఎలర్జీ చికిత్స!
ఎలర్జీ వేధించే కాలపరిమితి, తీవ్రతలను బట్టి, ఆ మందులకు రోగుల స్పందనను బట్టి తీసుకోవలసిన యాంటాహిస్టమిన్ల చికిత్స ఆధారపడి ఉంటుంది. ఏ మందు, ఎంతకాలం, ఎంత మోతాదుతో ఉపయోగించాలో వైద్యులు మాత్రమే నిర్ణయించగలుగుతారు. కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్లు సొంత వైద్యం జోలికి వెళ్లకుండా వైద్యులను కలిసి సరైన చికిత్స తీసుకోవాలి.

 

డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి తళ్లపురెడ్డి
కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌
3సెన్సెస్‌ ఇ.ఎన్‌.టి స్పెషాలిటీ క్లినిక్‌
హబ్సిగూడ, హైదరాబాద్‌