వానల్లో పదిలం సుమా!

25-06-2019: వానాకాలం మొదలైంది... పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణమిది. వర్షంలో దుస్తులూ, పుస్తకాలు తడిసి ముద్ద కావడం ఒకటైతే... రోడ్లన్నీ జలమయమై, మ్యాన్‌హోల్స్‌ ప్రాణాంతకంగా మారడం మరొకటి. అందుకే వరదతో నిండిపోయి, కనిపించకుండా ఉండే మ్యాన్‌హోల్స్‌, గుంతల పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి. భారీ వర్షం కురిసిన రోజున తల్లితండ్రులు మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 
స్కూలుకు వాళ్లే వెళతారు, వాళ్లే వస్తారులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా, వీలైతే పిల్లల వెంట ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లలు సాయంత్రం వేళ బడి నుంచి నేరుగా ఇంటికి రాకుండా, సరదా కోసం దగ్గరలో ఉన్న మరే ప్రదేశానికో వెళ్లకుండా వారించాలి. ఇనుప కరెంటు స్థంభాలను తాకకూడదని, బాగా ఒరిగిన చెట్లకిందుగా నడవరాదని చెప్పాలి. వాన మరీ ఎక్కువైతే స్కూలులోనే ఉండమనాలి. పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లే ఆటోవాళ్లకు కూడా కొన్ని జాగ్రత్తలు పదే పదే చెప్పాల్సిందే.