శీతాకాలం వస్తే

ఆంధ్రజ్యోతి, 23/12/14: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా శీతాకాలంలో ఏదో ఒక అలర్జీ సమస్య వేధిస్తుంది. తుమ్ములూ, దగ్గులే కాదు ... ఒక్కోసారి శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. క్రమ క్రమంగా సమస్య తీవ్రమయ్యే కొద్దీ లక్షణాలను బట్టి ఇది మామూలు జలుబు సమస్య కాదని తేలిపోతుంది. అయినా ఊరకే ఆందోళన పడిపోతే ఒరిగేదేమిటి? ఇవిగో ఇక్కడ పేర్కొన్న కొన్ని లక్షణాల వివరాల్ని పరిశీలించండి మీకున్నది ఏ సమస్యో తెలిసిపోతుంది. ఎలాంటి చర్యలు చేపడితే ఉపశమనం పొందవచ్చో కూడా బోధపడుతుంది. 

శీతాకాలం చ ల్లగా హాయిగొలుపనూవచ్చు.లేదా పలురకాల వ్యాధులతో ప్రాణాలు తోడేయనూ వచ్చు. అయితే నివారించే కొన్ని జాగ్రత్తలతో పాటు అవసరమైనపుడు వైద్యచికిత్సలు కూడా తీసుకుంటే ఆ వ్యాధుల వేధింపులే ఉండవు.
అలర్జిక్‌ రైనైటిస్‌ 
లక్షణాలు: వరుసగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లు, ముక్కు దురదగా ఉండడం. 
సాధారణ జలుబు కాదని ఒకసారి తేలిపోతే, అది అలర్జీ సమస్యేననే నిర్థారణకు రావచ్చు. గాలిలో ఉండే కొన్ని రకాల పదార్థాల కారణంగా ముక్కులోపలి కణజాలంలో వాపు రావడం ఇందులోని సమస్య. పొగ, దుమ్ము, కాలుష్యాలు, గాలిలో ఉండే ఉన్ని వంటి మరికొన్ని అంశాలు. సమస్య ఇంకా మామూలుగానే ఉన్నప్పుడు బాహ్యంగా పరిశీలించడం ద్వారానే పసిగట్టవచ్చు. లేదంటే అలర్జెన్‌ టెస్ట్‌లు చేయించాలి.
 
ఉపశమనం కోసం... 
వైద్యంగా...యాంటీహిస్టమిన్‌ మందులు ఈ సమస్యనుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిద్వారా అలర్జిక్‌ అంశాలకు అతిగా స్పందించే తత్వం తగ్గుతుంది. 
నివారణగా: మంచు బారిన పడకుండా మార్నింగ్‌ వాక్‌లకు కాస్త ఆలస్యంగా వెళ్లాలి. 
ఉన్ని దుస్తులు ఏడాదిగా స్లోరేజ్‌లో ఉండి ఉంటే, మీరు ధరించడానికి ముందు వాటిని తప్పనిసరిగా ఉతికి మంచి ఎండలో వాటిని ఉంచాలి. 
అలర్జిన్‌ రైనైటిస్‌ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో సెన్సిటివిటీని తగ్గించుకునే కొంత శిక్షణ పొందాలి.
 
ఆస్తమా 
లక్షణాలు: గొంతులోంచి పిల్లికూతలు రావడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ పట్టేసినట్లు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎందుకిలా? 
శ్వాసకోశాల్లోకి వెళ్లే శ్వాసవాహికల్లోని మ్యూకస్‌ పొర కుంచించుకుపోయి వాపు ఏర్పడటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ స్థితిలో శ్వాసవాహికల్లో మ్యూకస్‌ అడ్డుపడి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ సమస్య రాత్రివేళల్లో మరీ ఎక్కువగా ఉంటుంది.
 
కారణాలు: చల్లగాలి, పొగ, దుమ్ము, శ్వాసనాళాల్లో ఇన్‌ఫెక్షన్లు రావడం, గాలిలో రసాయన అంశాలు గానీ, కొన్ని రకాల పూల పుప్పొడి ఉండడం. వీటికి తోడు ఎక్కువ ఒత్తిడికి గురిచేసే వ్యాయామాలు, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, బయటి ఆహార పదార్థాలు, తరుచూ ఆస్పిరిన్‌ వంటి మందులు వాడటం కూడా ఇందుకు కారణం కావచ్చు.
 
పరీక్షలు 
నాన్‌ ఇన్‌వేసివ్‌ స్పిరోమెట్రీ పరీక్షలు, లంగ్‌ ఫంక్షన్‌ పరీక్షలు 
వైద్యంగా... శ్వాసకోశాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు యాంటీబయాటిక్స్‌ తీసుకోవడం అవసరమవుతుంది. 
నివారణగా: కొన్ని రకాల మందుల వల్ల యాంటీ ఇన్‌ప్లమేటరీ అంశాలు శ్వాసకోశాల్లోని వాపును తగ్గిస్తాయి. శ్వాసక్రియను క్రమబద్దం చేస్తాయి. ఇన్‌హేలర్లు కూడా ఇందులో బాగా పనిచేస్తాయి. 
ఉపశమనానికి: శ్వాసకోశాల్లోని మ్యూకస్‌ను తొలగించే మందుల వల్ల ఉపశమనం లభిస్తుంది. ఒక్కోసారి చిక్కని కాఫీ కూడా ఛాతీ పట్టివేత వంటి సమస్యలనుంచి ఉపశమని కలిగిస్తుంది. ఇన్‌హేలర్లతోనూ మేలు కలుగుతుంది. 
జు పరిస్థితి విషమంగా ఉంటే ఆసుపత్రిలో చేర్చడం తప్పనిసరి అవుతుంది. ఈ స్థితిలో ఆక్సీజన్‌, ఇంట్రావీనస్‌ ఫ్లూయిడ్స్‌ అవసరమవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో నెబులైజర్‌ అనే పరికరం ద్వారా మందులు నేరుగా శ్వాసకోశాల్లోకి వెళ్లే ఏర్పాట్లు చేస్తారు. శ్వాసకోశాల్లోని కొన్ని హానికారక ద్రవాల్ని పలుచబరిచే మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
 
బ్రాంకైటిస్‌ 
పసుపు- ఆకుపచ్చరంగులో కఫం రావడం ఇందులో కనిపించే ఒక ప్రధాన లక్షణం. 
శ్వాసకోశాల్లోకి వెళ్లే నాళాల్లో వాపు రావడం ఈ సమస్యకు కారణం. 
బాహ్య పరీక్షల ద్వారానే ఈ సమస్యను గుర్తించవచ్చు. 
కారణాలు: దుమ్ము, వాతావరణ కాలుష్యాలు, వాహనాల పొగ ప్రధాన కారణాలు 
ఉపశమనానికి: వైద్యులు సూచించిన మందులతో పాటు, విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. మూత్రము పసుపు వర్ణంలో ఉన్నప్పుడు సహజవర్ణంలోకి వచ్చే స్థాయిలో నీరు బాగా తాగాలి. 
స్ట్రీమ్ ఇన్‌హెలేషన్‌ శ్వాస సమస్యను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇన్‌ఫెక్షన్లు పూర్తిగా తగ్గిపోయేదాకా దగ్గు వస్తూనే ఉంటుంది. అందుకే దగ్గు సమూలంగా తొలగిపోయేదాకా వైద్యులు సూచించిన మందులు తప్పనిసరిగా వాడాలి.
 
లారింజైటిస్‌ 
కీచు గొంతు రావడం, గొంతు నొప్పి, గొంతు బిగుసుకుపోతున్నట్లు అనిపించడం, మాట సరిగా రాకపోవడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో కనిపిస్తాయి.
 
స్వరపేటికలో వాపు రావడం ఈ సమస్యకు కారణం. 
కారకాలు: వాతావరణ కాలుష్యాలు, సిగరెట్టు పొగ, చల్లగాలి, స్వరాన్ని అతిగా వినియోగించడం వంటివి ఈ సమస్యకు మూలం.
 
ఎలా గుర్తించాలి? 
స్వరంలో వచ్చే మార్పుల ద్వారా సమస్యను గుర్తించవచ్చు. బాహ్యంగా పరిశీలించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 
ఉపశమనానికి: వైద్యులు సూచించే మందులు తీసుకోవడంతో పాటు కనీసం రెండురోజులైన గొంతుకు పూర్తి స్థాయి విశ్రాంతి ఇవ్వాలి. వోకల్‌ కార్డ్స్‌ మీద ఒత్తిడి పడే ఏ పనీ చేయకూడదు. 
స్ట్రీమ్ ఇన్హెలేషన్‌ ఈ సమస్యనుంచి ఉపశమనాన్నిస్తుంది. 
కొద్దిరోజుల దాకా గార్గ్‌లింగ్‌ చేయకూడదు. దీని వల్ల వోకల్‌ కార్డ్స్‌ మీద ఒత్తిడి పడే వీలుంది. 
వోకల్‌ కార్డ్స్‌ తడిగా ఉండేందుకు తరుచూ ద్రవాలు తీసుకుంటూ ఉండాలి.