ఎండల నుంచి ఉపశమనం కోసం...

30-03-2019: వేసవికాలంలో పచ్చి మామిడికాయలు తినొచ్చా? అవి తింటే ఒళ్లు పేలుతుందని, గడ్డలు వస్తాయని అంటారు నిజమేనా? వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ముఖ్యంగా చిన్న పిల్లలు, ముసలివాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

-లక్ష్మి

వేసవిలో పచ్చి మామిడికాయని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఎండదెబ్బ పోవడానికి, పచ్చి మామిడికాయను కాల్చి దాని రసం తీసి, ఉప్పు పంచదార కలిపి తాగిస్తారు. ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇలాంటి పానీయం రెడీ చేసి పెట్టుకుని చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకు మధ్యాహ్నం పూట స్క్వాష్‌లాగా ఇవ్వొచ్చు. ఎండలో బయటికి వెళ్లే వాళ్లకి ఇస్తే మంచిది.

ఒళ్లు పేలడం, గడ్డలు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే... చెమట ఎక్కువ పట్టి, దుమ్ము చేరడం, తద్వారా ఇన్‌ఫెక్షన్‌ రావడం. అందుకే వేసవిలో రెండు పూటలు, లేదా మూడు పూటలు స్నానం చేయాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు చెమటను వాష్‌ చేసుకుంటూ ఉంటే ఒళ్లు పేలడం జరగదు. సమ్మర్‌లో కాటన్‌ దుస్తులు ధరించాలి. టైట్‌గా ఉండే సింథటిక్‌ దుస్తులు ధరించడం వల్ల గడ్డలు వచ్చే అవకాశముంది.

సమ్మర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే...

నూనెపదార్థాలు తగ్గించాలి.
ఎక్కువగా నీరు ఉన్న పదార్థాలు తినాలి.
చిన్నపిల్లలు, పెద్ద వయసువారు ఎక్కువగా ఎండ దెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా నీళ్లు తీసుకోవాలి.
సడన్‌గా ఎసీ నుంచి ఎండల్లోకి వెళ్లడం, ఎండ నుంచి సడన్‌గా ఏసీలోకి వెళ్లడం చేయకూడదు.
ఏసీ నుంచి సాధారణ టెంపరేచర్‌కు వచ్చిన తర్వాత ఎండలోకి వెళ్లాలి. అలాగే ఎండ నుంచి సాధారణ టెంపరేచర్‌కు వచ్చిన తర్వాతే ఏసీలోకి వెళ్లాలి.
ఇలా చేస్తే తలనొప్పి రాకుండా ఉంటుంది. చర్మం కూడా నార్మల్‌గా ఉంటుంది.
వేసవిలో పిల్లలు పెద్దలు అంతా కూడా నిమ్మరసం కలిపిన పల్చటి మజ్జిగ రెగ్యులర్‌గా తాగుతుండాలి.