వానాకాలంలో జాగ్రత్త

ఆంధ్రజ్యోతి, 10/07/15: వర్షాకాలంలో చీటికీమాటికీ జలుబు, దగ్గు, జ్వరం వస్తున్నాయంటే.. మీ శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిందన్నమాట. అలాంటి వాళ్లు ఏం చేయాలంటే..
 
డీ హైడ్రేషన్‌ అనేది ఎండా కాలంలోనే కాదు. వర్షాకాలంలోను వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో గాలిలో ఆర్ద్రత ఎక్కువ. దీనివల్ల శరీరంలోని స్వేదం తరచూ బయటికి వెళ్లడంతో నీరసం ఆవహిస్తుంది. ఒక్కోసారి సిక్‌ అయ్యే ప్రమాదమూ ఉంది. ఈ సమస్య రాకూడదంటే - తరచూ ద్రవ పదార్థాలను తీసుకోవాలి. గ్రీన్‌ టీ తాగడం ఉత్తమం.
 
ఆహారంలో అధిక పీచుపదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఓట్స్‌, బ్రౌన్‌ రైస్‌, బార్లీ తీసుకోవడం మంచిది. పీచుపదార్థం కడుపులోని ప్రేవుల్ని శుభ్రం చేస్తుంది. అయితే ధాన్యాలతో వండిన కర్రీడ్‌ రైస్‌ వంటి ఐటమ్స్‌ను ఎక్కువగా తినొద్దు. వానాకాలంలో అలాంటి వాటిని తింటే కడుపుబ్బరంగా ఉంటుంది.
 
బయట చినుకులు పడుతున్నప్పుడు.. వాతావరణం చల్లగా మారితే.. వేడి వేడి పకోడీలను తినాలనిపిస్తుంది. అలాంటి వాటిని మితిమీరి తినడం మంచిది కాదు. వానాకాలంలో శరీరంలోని జీర్ణప్రక్రియలు చురుగ్గా ఉండవు. తిన్నది అంత తొందరగా జీర్ణం అవ్వదు. వర్షాకాలంలో ముఖ్యంగా ఆవనూనెలు, నువ్వుల నూనెలకు బదులుగా తేలికైన కార్న్‌ ఆయిల్‌, ఆలివ్‌ ఆయిల్‌ వాడండి.
 
జీర్ణశక్తి పుంజుకుని వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే.. కొన్ని సంప్రదాయ చిట్కాలను పాటించాలి. అందుకని వేప, పసుపు, మెంతులతో తయారైన హెర్బల్స్‌ను వాడండి. ఇవి యాంటీ బయాటిక్స్‌గానూ పనిచేస్తాయి.
 
మెటాబాలిజంతోపాటు ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సులభమైన, చౌకైన మార్గం. నిమ్మరసంలోకి తేనెను కలుపుకొని తాగడం. వర్షాకాలం, చలికాలం ఇదెంతో ఉపయుక్తం. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయాన్నే గ్లాసుడు తాగితే హాయిగా ఉంటుంది.