సన్‌ ట్యాన్‌ వదలాలంటే?

31-03-2019: ఎండకు నల్లబడిన చర్మం తిరిగి తెల్లబడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. బ్యూటీ పార్లర్‌లో చేసే బ్లీచింగ్‌ వల్ల చర్మం పొడిబారి మరింత గరుకుగా తయారవుతుంది. పైగా బ్లీచింగ్‌తో చేకూరే రంగు తిరిగి వెలసిపోవడానికి ఎక్కువ కాలమూ పట్టదు. కాబట్టి ఖర్చుతో పని లేని వంటింటి చిట్కాలను అనుసరించడమే మేలు!
నిమ్మకాయను అడ్డంగా కోసి, నల్లబడిన చోట రుద్దాలి. తర్వాత కొన్ని నిమిషాలపాటు వదిలేసి చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి.
నిమ్మరసం, దోస రసం, రోజ్‌ వాటర్‌ సమపాళ్లలో కలిపి నల్లబడిన ప్రదేశం మీద అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
రెండు టీస్పూన్ల సెనగపిండిలో కొద్దిగా పాలు, ఒక టీస్పూను రోజ్‌వాటర్‌, చిటికెడు పసుపు కలిపి, ఈ పేస్ట్‌ను ఎండకు నల్లబడిన చర్మం మీద అప్లై చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
పెసరపప్పు నీళ్లలో నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌లో కలబంద గుజ్జు, టమాటా గుజ్జు సమపాళ్లలో కలిపి అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
పండిన బొప్పాయి గుజ్జులో ఒక టీస్పూను తేనె కలిపి పూసుకోవాలి. ఆరిన తర్వాత చల్ల నీళ్లతో కడిగేసుకోవాలి.
3 టేబుల్‌స్పూన్ల మజ్జిగలో రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌ మీల్‌ కలిపి నల్లబడిన ప్రదేశాల్లో పూసుకోవాలి. తర్వాత వేళ్లతో సున్నితంగా వృత్తాకారంలో మర్దించి కడిగేసుకోవాలి.
పెరుగు, టమాటా రసం సమపాళ్లలో కలిపి అప్లై చేసి, పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.