ఎండల్లో ఎనర్జీ కోసం!

22-03-2019: ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి దాకా, నేను నాతో పాటు చాలామంది ఎలక్షన్ల పని మీద ఎండలో తిరుగుతున్నాం. బయటే తినాల్సి వస్తోంది. ఎండ వేడికి తట్టుకోలేక ఏదంటే అది తాగడం జరుగుతోంది. ఇలా రోజంతా బయట తిరిగి వచ్చేసరికి బాగా అలసిపోతున్నాం. మా గొంతులు కూడా బొంగురు పోతున్నాయి. దాహం అస్సలు తీరడం లేదు. సరైన డైట్‌ప్లాన్‌ చెప్పండి.
-ప్రణతి ప్రకాశ్‌
మీరు ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉన్నారు. మీరే కాదు... రోజంతా ఎండల్లో బయట తిరిగేవారికి కూడా కొన్ని ముఖ్య సూచనలివి...
 
ఉదయం బయటికి వెళ్లే ముందు ఆహారం కడుపునిండా తినాలి. ఈ ఆహారంలో భోజనం లేక టిఫిన్స్‌ ఉండవచ్చు. దీనితో పాటు ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ తాగి వెళ్లండి. దీనివల్ల మీకు కావాల్సినంత శక్తి లభిస్తుంది.
రోజంతా మధ్య మధ్యలో తాగడానికి సబ్జా గింజలు, నిమ్మరసం కలిపిన పల్చటి మజ్జిగ ఒక బాటిల్‌... మజ్జిగ కలిపిన పలుచటి రాగి జావా ఒక బాటిల్‌ తీసుకుని వెళ్లండి. ఈ పానీయాలు మీకు కావాల్సినంత శక్తిని ఇస్తాయి. మజ్జిగలో ఉన్న కాల్షియం కండరాలని బలహీనపరచకుండా చూస్తుంది. నిమ్మరసంలో ఉన్న పొటాషియం, మజ్జిగలో కలిపిన ఉప్పు... చెమట ద్వారా బయటకు పోయిన లవణాలను రిప్లేస్‌ చేస్తాయి. సబ్జాగింజలు డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తాయి.
బయటి ఆహారం తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్టీమ్‌ చేసిన ఆహారం అంటే ఇడ్లీ లాంటివి తీసుకోండి. అలాగే పానీయాలు ఉడికించినవి తీసుకోండి. ఉదాహరణకు టీ, కాఫీలాంటివి.
ఇంటికి చేరాక నిద్రపోయే ముందు ఫ్రూట్‌ జ్యూస్‌లో నానబెట్టిన బాదాం (5), ఖర్జూరం (2), నల్ల ఎండు ద్రాక్ష (10) తీసుకుని, ఒక కప్పు పాలు తీసుకుంటే మంచిది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే, ఎండకు అలసిపోకుండా ఉత్సాహంగా ఉండొచ్చు.
డాక్టర్‌ బి.జానకి న్యూట్రిషనిస్ట్‌,