ఎండల్లో.. ఇలా పదిలం!

సమ్మర్‌ కేర్‌

26-03-2019:వేసవిలో వచ్చే ఎన్నికల కథే వే రు. ఎన్నికల్లో పోటీచేసే నేతలే కాదు. పార్టీ కార్యకర్తలూ, ప్రచారకులూ, సాధారణ ప్రజలూ ఈ రోజుల్లో అదేపనిగా ఎండలో తిరుగుతూ ఉంటారు. ప్రచారం ఉత్సాహంలో, ఎండను లెక్క చేయకుండా తిరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ ఒక్కటే కాదు, ఇంకా అనేక సమస్యలు తలెత్తుతాయి. ఒక్కో సమస్యలో కనిపించే లక్షణాలు ఒక్కో రకంగా ఉంటాయి.
 
వడదెబ్బ...
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పూర్తిగా విఫలం కావడాన్నే వడదెబ్బ అంటాం. ఈ పరిణామంతో శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారన్‌ హీట్‌ను కూడా దాటిపోవచ్చు. కళ్లు తిరగడం, వాంతులు ఉంటాయి. శరీరం బాగా వేడెక్కుతుందేగానీ, చెమట పట్టదు. అవసరమైన వైద్యచికిత్సలు తక్షణమే అందకపోతే, అపస్మారక స్థితిలోకి వె ళ్లిపోవచ్చు. ఈ స్థితిలో రోగి ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్లే అవకాశం 40 శాతం దాకా ఉంది. వెనువెంటనే వైద్యచికిత్సలు అందించకపోతే, ప్రాణాపాయానికి కూడా
దారి తీయవచ్చు.
 
ఎందుకిలా?
 పరిసరాల ఉష్ణోగ్రత బాగా ఎక్కువైనా, మరీ తక్కువైనా, మన శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీల ఫారన్‌ హీట్‌ వద్ద స్థిరంగానే నిలిచి ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతలోనే మన శరీర జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. శరీర ఉష్ణోగ్రత అలా స్థిరంగా ఉండడానికి మెదడులోని హైపోథాలామస్‌ గ్రంధి తోడ్పడుతూ ఉంటుంది. 
 శరీర ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు స్వేద గ్రంధులు సహజంగా మనకు చెమట పట్టేలా చేస్తాయి. దాంతో ఒంట్లోని ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే వాతావరణంలో వేడి మరీ ఎక్కువగా ఉండి స్వేద గ్రంధులు అదేపనిగా పనిచేయాల్సి వస్తే... ఒక దశలో అవి పూర్తిగా అలసిపోతాయి. దాంతో చెమట పట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో ఒంట్లోని ఉష్ణం బయటికి పోదు. ఫలితంగా, మన శరీర ఉష్ణోగ్రత నిరంతరాయంగా పెరుగుతూ వెళుతుంది. హైపోథాలామస్‌ కూడా ఆ ఉష్ణాన్ని తగ్గించలేక నిస్సహాయంగా ఉండిపోతుంది. సహజంగా ఉండాల్సిన శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారన్‌ హీట్‌ల నుంచి 104, 106... కొన్ని సందర్భాల్లో 110కి కూడా చేరుతుంది. ఉష్ణోగ్రత తగ్గకుండా అలాగే ఉండిపోతే, శరీరంలోని అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది.

వడదెబ్బకు వైద్యం

శరీర ఉష్ణోగ్రత 100 ఫారన్‌ హీట్లకు మించుతున్నట్లు తెలియగానే, పెద్దలనైనా, పిల్లలైనా వెంటనే చల్లగాలి సోకేలా ఫ్యాన్‌ కింద ఉంచాలి. దుస్తులను వదులు చేసి ఒంటికి చల్లగాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులు  పలచగా ఉంటేనే మరింత మేలు.
 
ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, చంకల కింద ఐస్‌ గడ్డలను ఉంచాలి. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
 
డాక్టర్‌ బి. గోవర్ధన్‌
జనరల్‌ ఫిజిషియన్‌,
కేర్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌
 
 
ఇవీలక్షణాలు...
వికారం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, అయోమయం, స్పృహ తప్పడం, ఫిట్స్‌ రావడం వంటి లక్షణాలు వడదెబ్బ వల్ల ప్రధానంగా కనిపిస్తాయి. పరిస్థితిని గమనించి వెంటనే అవసరమైన వైద్యం అందించాలి.
 
‘ఇన్నేళ్ల కాలంలో ఎన్ని ఎండలు చూడలేదు? ఎప్పుడూ ఏమీ కానిది, ఇప్పుడు మాత్రం ఏమవుతుంది?’ అనుకుని కొందరు ఎడాపెడా ఎండలో తిరిగేస్తుంటారు. వడదెబ్బకు గురవుతుంటారు. ఇతరమైన చాలా జబ్బులు విషమించడానికి రోజులూ నెలలూ పడుతుందేమో కానీ, వడదెబ్బ అలా కాదు. నిమిషాల్లో పరిస్థితి చేయిదాటిపోతుంది. కేవలం వడదెబ్బే అని కాదు. ఎండ తీవ్రత వల్ల వచ్చే ఏ సమస్యకైనా అంతే వేగంగా స్పందించాలి. అవసరమైన చర్యలు ఆ క్షణమే చేపట్టాలి.
 
హీట్‌ సింకోప్‌
ఎండలో ఎక్కువ సేపు తిరిగినప్పుడు, తల తిరిగినట్లు అనిపించడం, మరీ ఎక్కువ సేపు తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం వంటి పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. గంటల తరబడి ఎండలో గడపడం వల్ల, రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. ఫలితంగా మెదడుకు సరిపడా రక్తం అందకపోవచ్చు. అదే జరిగితే, సొమ్మసిల్ల్లి పడిపోవచ్చు. ఈ పరిస్థితినే ‘హీట్‌ సింకోప్‌’ అంటారు. ఎంతటి ఆరోగ్యవంతులైనా ఈ పరిస్థితికి గురికారన్న గ్యారెంటీ ఏదీ లేదు. కాకపోతే వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే త్వరగానే కోలుకోవచ్చు. 
 
చికిత్స: హీట్‌ సింకోప్‌కు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించాలి. అక్కడ మంచి నీరు, తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవాలను తాగించాలి.
 
హీట్‌ క్రాంప్స్‌/ మజిల్‌ క్రాంప్స్‌
ఎండలో బాగా తిరిగిన వారికి రాత్రివేళల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అప్పటికప్పుడు పిక్కలు పట్టేసినట్లై, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ఇలా పిక్కలు పట్టేసి నిద్రాభంగం కలుగుతుంది. ఇందుకు శరీరంలోని లవణాలూ, ద్రవాలూ తగ్గడమే ప్రధాన కారణం. సహజంగా శరీరం తన జీవక్రియలను కొనసాగించడానికి మెదడు నుంచి ప్రతి నరానికీ ఆదేశాలు అందాలి. ఈ ఆదేశాలన్నీ లవణాల్లోని అయాన్ల రూపంలో నరాల ద్వారా ప్రసరించి, కండరాలకు చేరతాయి. అయితే, ఎండ తీవ్రతతో నీటినీ, లవణాలనూ కోల్పోవడం వల్ల, కండరాలకు ఆదేశాలు సరిగా అందవు. పైగా కండరాలు బిగుసుకుపోతాయి. దాంతో మజిల్‌ క్రాంప్స్‌ తలెత్తుతాయి. మజిల్‌ క్రాంప్స్‌కు గురైనప్పుడు, శరీరం కోల్పోయిన మేరకు నీటిని, లవణాలను వెంటనే మళ్లీ భర్తీ చేయాలి.
 
చికిత్స: పిల్లలకు మజిల్‌ క్రాంప్స్‌ వచ్చి కండరాలు బిగుసుకుపోతుంటే, వెంటనే వారికి ఓ.ఆర్‌.ఎస్‌. ద్రావణాన్ని తాగించాలి. ఈ ద్రావణం అందుబాటులో లేకపోతే, కొబ్బరి నీళ్లయినా తాగించవచ్చు. లేదంటే అరటి పండు ఇచ్చి, కొద్దిసేపటి తర్వాత నీళ్లు తాగించవచ్చు. అరటి పండులో పొటాషియం వంటి లవణాలు పుష్కలంగా ఉంటాయి. అరటి పండులోని పోషకాల వల్ల ఆ లోపాలు తీరతాయి.
 
హీట్‌ ఎగ్జార్షన్‌
ఇది నీరు, ఖనిజ లవణాలు కోల్పోవడం వల్ల శరీరంలో ఏర్పడే పరిస్థితి. కొన్నాళ్ల పాటు అదేపనిగా ఎండకు గురికావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. నీరసం, నిస్సత్తువ, కండరాలు పటుత్వం కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. ఈ సమస్య ఎక్కువగా వృద్ధుల్లోనే కనిపిస్తుంది.
 
చికిత్స: ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని చల్లటి ప్రదేశానికి తరలించి, అక్కడ తగినన్ని ద్రవాలు తాగించాలి. అయితే, వెంటనే మళ్లీ ఎండకు వెళ్లకుండా చూడాలి. బయటికి వెళ్లడం తప్పనిసరైతే, బాగా చల్లబడ్డాకే వెళ్లనివ్వాలి.
 
హీట్‌ హైపర్‌ పైరెక్సియా
ఎండ కారణంగా కొందరికి జ్వరం వచ్చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్‌హీట్‌ దాకా పెరుగుతుంది. ఈ పరిస్థితినే హైపర్‌ పైరెక్సియా అంటారు. దీనికీ, వడదెబ్బకూ కాస్త తేడా ఉంది. హైపర్‌ పైరెక్సియాలో మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ తాత్కాలికంగానే దెబ్బతింటే, వడదెబ్బ (హీట్‌ స్ట్రోక్‌)లో తక్షణమే వైద్య సహాయం అందితే తప్ప ఆ వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించలేనంతగా పూర్తిగా దెబ్బ తింటుంది.
 
మంచినీళ్లే... మందు!
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల వడదెబ్బ తగిలిందని అందరూ అనుకుంటారే గానీ, శరీరంలో నీరు తగ్గడం అసలు కారణమని గ్రహించరు. నీరు తక్కువగా తాగేవారికి, ఆ కొద్ది నీరు ఎండ నుంచి చర్మాన్ని రక్షించడం కోసం చర్మంలోకి వెళుతుంది. ఎండలో పనిచేయడం, లేదా ఎండలో తిరగడం వంటివి చేసినప్పుడు కండరాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, శరీరం విధులు నిర్వర్తించడానికి సరిపడా నీరు ఉండదు. నీరు తగ్గినప్పుడు సహజంగానే రక్తం చిక్కబడుతుంది. రక్తంలో నీటి శాతం తగ్గడం మూలంగా, మెదడుకు రక్తప్రసరణ సరిగా అందదు. మెదడు కణాలకు నీరు అందకపోవడం వల్ల వేసవిలో కళ్లు తిరగడం, తూలడం, కళ్లు బైర్లు కమ్మడం, తల దిమ్ముగా ఉండడం, వడదెబ్బ తగిలి పడిపోవడం, స్పృహ తప్పడం వంటివి జరుగుతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి సరిపడా నీరు తాగడమే మార్గం. వేసవి కాలం ఎండలో తిరగకుండా నీడ పట్టున ఉండే వారికి, 5 లీటర్ల నీరు సరిపోతుంది. ఎండలో తిరిగేవారికి, ఎండలో పనిచేసేవారికి మరో రెండు లీటర్ల నీరు అదనంగా అవసరమవుతుంది. 
 నీటి ఫలితం శరీరానికి సత్వరమే దక్కాలంటే ఖాళీ కడుపుతో నీరు తాగాలి. అలా తాగిన నీరు దాదాపు 15 నిమిషాల్లో రక్తంలోకి వెళుతుంది. రక్తంలోకి వెళ్లిన నీరు కణాలకు చేరి, వాటి అవసరాలను తీరుస్తుంది. అలాగే చర్మానికి కూడా వెంటనే చేరుతుంది. అందుకు భిన్నంగా, పొట్టలో ఏదైనా ఆహారం తిన్నప్పుడు తాగితే, ఆ నీరు ఆహారం అరిగే వరకూ పొట్టలోనే ఉంటుంది. అంటే సుమారు రెండు మూడు గంటల పాటు, ఆ నీరు శరీర అవసరాలను తీర్చలేదు. ఇది పలు సమస్యలకు దారి తీస్తుంది. వేసవి కాలం మరిన్ని సమస్యలకు మూలమవుతుంది.
ఎండ ఏమాత్రం పడని చోట, ఇళ్లల్లో నీడన ఉండిపోతే, వడదెబ్బ తగలదని కొందరు అనుకుంటారు. కానీ నీడలో ఉన్నా, ఇళ్లు ఉక్కపోతగా ఉంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందువల్ల నేరుగా ఎండ తగలకుండా చూసుకోవడమే కాదు. ఇంటి వాతావరణం చల్లగా ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. కూలర్లు ఉన్నా, గది వేడెక్కిన వెంటనే నీరు మారుస్తూ ఉండాలి. లేదా తలుపులూ, కిటికీలకు వేళ్లాడదీసే తెరలను, ఎప్పటికప్పుడు చల్లని నీటితో తడుపుతూ ఉండాలి. అన్నింటినీ మించి తరుచూ నీరు తాగుతూ ఉండాలి.
 
డాక్టర్‌ టి. కృష్ణమూర్తి
సూపరింటెండెంట్‌,
రెడ్‌క్రాస్‌ యోగా, నేచర్‌ క్యూర్‌ సెంటర్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.