వర్షాకాలంలో వచ్చే జ్వరాలతో జాగ్రత్త!

05-08-2019: వర్షాకాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్య జ్వరం. అయితే జ్వరాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే జ్వరం అనేది శరీరంలో నిగూఢంగా ఉన్న ఒక వ్యాధి లక్షణమే తప్ప వ్యాధి కాదు. అందువల్ల జ్వరాన్ని మామూలేగా అనుకుని నిర్లక్ష్యం చేస్తే అది ఒక్కోసారి ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. అలాగని జ్వరం అనగానే విపరీతంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కు వచ్చే వాటిల్లో మామూలు జ్వరాలే ఎక్కువ.
 
ఎండలోనో లేదా మంట దగ్గరో ఎక్కువ సేపు నిలుచుంటే శరీరం కాస్త వేడిగా అనిపించడం మామూలే. అలా కాకుండా, సాధారణ పరిస్థితుల్లోనే శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్‌ కన్నా ఎక్కువగా ఉంటే , జ్వరంగా ఉందని భావించవచ్చు. అలాగని పెరిగిన శరీర ఉష్ణోగ్రత రోజంతా ఒకేలా ఉండకపోవచ్చు. చాలాసార్లు ఒక డిగ్రీ ఫారన్‌ హీట్‌ అటూ ఇటుగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా, ఉదయం వేళల్లో ఒక డిగ్రీ తక్కువగానూ, సాయంత్రం వేళ ఒక డిగ్రీ ఎక్కువగానూ ఉండవచ్చు. సాధారణంగా, చంకలో థర్మామీటర్‌ పెట్టి చూస్తే, నోటి ఉష్ణోగ్రత కన్నా 0. 7 డీగ్రీ ఫారన్‌ హీట్‌ తక్కువగా ఉంటుంది. అయితే నోటిలో థర్మామీటర్‌ పెట్టి చూసినప్పుడు 100 డిగ్రీల ఫారన్‌ హీట్‌ కన్నా ఎక్కువగా ఉంటే, జ్వరం ఉన్నట్లు నిర్ధారణకు రావచ్చు అయితే, ఉష్ణోగ్రత కొలవడం ఆదరాబాదరాగా చేసేది కాదు. అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులుగా పొరబడే ప్రమాదం ఉంది. అందువ ల్ల మెర్క్యురీ థర్మామీటర్‌ని నాలుక కింద పెట్టి కనీసం రెండు నిమిషాలు ఉంచాలి. థర్మామీటర్‌ నోట్లో ఉన్నప్పుడు పెదాలు గట్టిగా మూసి ఉంచాలి. చంకలో థర్మామీటర్‌ ఉంచినప్పుడు చేతిని ఛాతీవైపు అదిమి ఉంచడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో థర్మామీటర్‌ పగిలి అందులోని పాదరసం వెలుపలకి వచ్చే అవకాశం ఉంది, అందువ ల్ల ఎలకా్ట్రనిక్‌ థర్మామీటర్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం. అయితే చిన్న పిల్లలకు ఫిట్స్‌ (మూర్ఛ) వచ్చినప్పుడు ఉష్ణోగ్రత కొలవకూడదు. అలాగే కాఫీ, టీ, పొగ తాగిన వెంటనే గానీ, సైనస్‌ లాంటి సమస్యల వల్ల నోటితో గాలి పీలుస్తున్న వారిలోనూ ఉష్ణోగ్రతను నోటిద్వారా కొలవ కూడదు.
 
వ్యాధి లక్షణమది!
జ్వరమే ఒక వ్యాధి అన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ, జ్వరం అనేది ఇంకా బయటపడని ఒక వ్యాధి లక్షణం మాత్రమే. అందువల్ల వైద్యున్ని సంప్రతించినప్పుడు ‘నాకు జ్వరంగా ఉంది’ అనే ఆ ఒక్క మాటతో సరిపెట్టకుండా, జ్వరంతో పాటే ఉన్న ఇతర లక్షణాల గురించి కూడా చెప్పాలి. జ్వరం ఎప్పుడు మొదలయ్యిందో చెప్పాలి. దద్దుర్లు, జలుబు, దగ్గు, కీళ్లనొప్పులు, ఒంటి నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, చలి వంటి ఏ ఇతర లక్షణాలు ఉన్నా డాక్టర్‌కు తెలియచేయాలి. చర్మం పైన మచ్చలు ఏర్పడడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, మెడ వద్ద గానీ, చంకలో గానీ బిళ్లలు తయారు కావడం, చురుకు మంటలతో పాటు మూత్రం పసుపు పచ్చగా రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే వాటి గురించి వైద్యునికి సవివరంగా తెలియజేయాలి.
 
కారణాలు అనేకం....
చికెన్‌ పాక్స్‌ (ఆటలమ్మ)లో జ్వరంతో పాటు చర్మం పైన పొక్కులు ఏర్పడతాయి. పెద్ద అపాయమేమీ లేకపోయినా ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కొన్ని రకాల మందుల వాడకం వల్ల కూడా కొందరికి ఒక్కోసారి జ్వరం రావచ్చు. జ్వరంతో పాటు దురద, దద్దుర్లు కూడా ఏర్పడవచ్చు. ఈ స్థితిలో వెంటనే డాక్టర్‌ను సంప్రతించి జ్వరానికి కారణమైన మందులు ఆపేయాలి. రక్తం ఎక్కించినప్పుడు కొంతమందికి చలితో పాటు జ్వరం రావచ్చు. 
వడదెబ్బ, సెప్టిసేమియా(సెప్సిస్‌), మెదడులో రక్తనాళం చిట్లడం (పాంటైన్‌ హెమెరేజ్‌), సెరిబ్రల్‌ మలేరియా, మెనింజైటిస్‌ వంటి వ్యాధుల్లో జ్వరం తీవ్రంగా రావచ్చు.
వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, రికెట్సియా... వీటిల్లో ఏవైనా, శరీరంలోనిఏ భాగాన్ని ఇన్‌ఫెక్ట్‌ చేసినా జ్వరం రావచ్చు. శరీర భాగాల్లో ఎక్కడ చీము చేరినా జ్వరం వస్తుంది. సెగగడ్డలు, మూత్ర కోశాలు ఇన్‌ఫెక్ట్‌ అయినప్పుడు కూడా జ్వరం రావచ్చు. వెంటనే వైద్య చికిత్స లభించకపోతే సమస్య బాగా తీవ్రమవుతుంది.

ఆహారం...

జ్వరంతో బాధ పడుతున్న వ్యక్తికి మామూలు వ్యక్తుల కన్నా, ఎక్కువ క్యాలరీల ఆహారం అవసరమవుతుంది. కానీ, కొంతమంది ద్రవ పదార్థాలు కూడా ఇవ్వకుండా పస్తులు ఉంచేస్తారు. జ్వరం వల్ల నాలుక చేదుగా అనిపించడం వల్ల గానీ, ఆకలి తగ్గిపోవడం వల్ల గానీ ఏమీ తినలేకపోతారు. అలాంటి వారికి ఘనపదార్థాలు కాకుండా, తేలికగా జీర్ణమయ్యే బ్రెడ్‌, పాలు, గ్లూకోజ్‌, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తరచూ ఇవ్వాలి.
క్షయ వంటి వ్యాధుల్లో చికిత్స ప్రారంభమైన తర్వాత కూడా రోజూ సాయంత్రం వేళ జ్వరం వస్తూనే ఉంటుంది. అలాంటి స్థితిలో వైద్య చికిత్సలతో పాటు పుష్ఠికరమైన ఆహారం ఇవ్వడం తప్పనిసరి. జ్వరం ఉన్నప్పుడు ‘పారాసెటమాల్‌’ వంటి మందులు గానీ, యాంటీ బయోటిక్‌ మందులు గానీ డాక్టర్‌ సూచన మేరకే వాడాలి. మొత్తంగా చూస్తే, చిన్న జ్వరమైనా, పెద్ద జ్వరమైనా, ఏ మాత్రం అశ్రద్ద చేయకుండా జ్వరం మొదలైన తొలి రోజుల్లోనే డాక్టర్‌ను సంప్రతించి, తగిన వైద్య చికిత్సలు తీసుకోవడం తప్పనిసరి.
న్యుమోనియాలో జ్వరంతో పాటు దగ్గు, ఆయాసం ఉంటాయి. క్షయలో అయితే, జ్వరం సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది.
‘ఇన్‌ఫ్లూయెంజా’ వంటి వైరల్‌ జ్వరాలు, మూడు నాలుగురోజుల్లోనే తగ్గిపోవచ్చు. కానీ, మలేరియా, టైఫాయిడ్‌, కాలేయంలో చీము చేరడం, న్యుమోనియా వంటి జ్వరాలు వచ్చినప్పుడు మాత్రం నిర్ధారణ కోసం, రక్త, మూత్ర పరీక్షలతో పాటు అవసరమైన పరీక్ష లన్నీ చేయిచాలి. అంతేగానీ, పరీక్షలు చేయిస్తున్నారని అపోహ పడకూడదు.
డెంగ్యూ జ్వరంలో తలనొప్పి, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. 3 నుంచి 7 రోజుల పాటు జ్వరం కొనసాగవచ్చు. జ్వరం తగ్గిపోయాక కొందరిలో చర్మం పైన ఎర్ర మచ్చలు, పొట్టలో నొప్పి, వాంతులు, విరేచనాలు నల్లగా రావడం, ఊపిరితిత్తుల్లోనూ, పొట్టలోనూ నీరు చేరడం,రక్తపోటు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు రావచ్చు. అలాంటి సమయాల్లో మందుల షాపుకు వెళ్లి, ఏవో మాత్రలు తెచ్చుకోవడం కాకుండా, నిపుణులైన వైద్యులను సంప్రతించి చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.
- డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి
ఫిజీషియన్‌ గీతా నర్సింగ్‌ హోమ్‌, తెనాలి