అలాంటి కలలు కనొచ్చా?

ఆంధ్రజ్యోతి(7-11-15):  ప్రశ్న: మాది అన్యోన్య దాంపత్యం. అయినా పెళ్లికి ముందు ప్రేమించిన వ్యక్తితో లైంగిక క్రీడలో పాల్గొంటున్నట్టు కలలు కంటూ ఉంటాను. నేను మంచి భార్యను కానా?

జవాబు: అలా ఎందుకనుకుంటున్నారు? మానవ ప్రవర్తనలో ఇది అత్యంత సహజం. అతన్ని పెళ్లి చేసుకోలేకపోయారు కాబట్టి అతనైతే ఎలా ఉండి ఉండేది? అని అనుకోవటం, రాత్రివేళ అందుకు సంబంధించిన ఆలోచనలు రావటం, ఊహలు కలగటం సాధారణమే! అయితే అతని గురించి పగలు కలలు కనకుండా, అది వ్యసనంగా మారకుండా ఉండనంతవరకూ ఎటువంటి ప్రమాదం లేదు. అలాగే ఆ ఆలోచనల వల్ల భర్త మీద అయిష్టత ఏర్పడకుండా ఉండాలి. అలాంటి ఆలోచనలే భర్త మీదకు మళ్లేలా ఆయనతో సఖ్యతగా మెలిగే ప్రయత్నం చేయండి. మీ ఇష్టాన్ని భర్త మీదకు, ఆయనతో ఏర్పడుతున్న అనుబంధం మీదకు మళ్లించండి. మీవారికి తరచుగా కాల్‌ చేస్తూ సరదాగా, సెక్సీగా మాట్లాడుతూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న అంశాలే దాంపత్యం బ్యాలెన్స్‌ కోల్పోకుండా కాపాడతాయి. అలాగే వాస్తవంగా ఆలోచించటం మొదలుపెట్టండి. ఒకవేళ మీరు ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని ఉంటే అతనిలో మీరు భరించలేని లోపాలు కూడా ఉండి ఉండే అవకాశం ఉందిగా? అతన్ని కాకుండా మీవారితోనే మీ జీవితం ముడిపడి ఉండటం వెనుక బలమైన కారణం ఉండి ఉంటుందని గ్రహించండి. వాస్తవంలోకొచ్చి ఆలోచిస్తూ ఇలాంటి ఫాంటసీలను తరిమికొట్టండి.

 
 
 
డాక్టర్‌. షర్మిల మజుందార్‌
కన్సల్టెంట్‌ సెక్సాలజిస్ట్‌
రామయ్య ప్రమీల హాస్పిటల్‌.