ఈ దూరానికి కారణం ఏంటి?
ఆంధ్రజ్యోతి (19-11-2019):డాక్టర్‌! మాకు పెళ్లై ఇప్పటికి మూడేళ్లు. ఇప్పటివరకూ మేమిద్దరం ఒక్కసారి కూడా శారీరకంగా కలవలేదు. ‘‘పిల్లలు కావాలి అనుకునప్పుడు మాత్రమే కలుద్దాం!’’ అంటూ మా వారు నన్ను దూరం పెట్టేశారు. దగ్గరవ్వాలని ప్రయత్నం చేసినా, ఆయన దూరంగా వెళ్లిపోతారు. ఇంతకూ మా వారు నన్ను శారీరకంగా దూరం పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది?
- ఓ సోదరి, కరీంనగర్‌
 
డాక్టర్ సమాధానం: మీ వారికి ఉన్న సమస్యను కనిపెట్టడానికి శారీరక, మానసిక పరీక్షలు అవసరం. అంగస్తంభనాలు, హార్మోన్‌ సంబంధిత పరీక్షలు చేయిస్తే, మీకు దగ్గర కాలేకపోవడానికి కారణం శారీరక లోపాలో, కాదో తెలుస్తుంది. ఒకవేళ శారీరక లోపాలు లేవని తేలితే, మానసిక వైద్యుల సహాయంతో కారణాలను కనిపెట్టే వీలుంది. కేవలం పిల్లలు కలుగుతారనే ఒకే ఒక సాకుతో దూరంగా ఉండిపోవడం అవివేకం. ఆ భయం ఉంటే, కండోమ్స్‌ వాడి కలవవచ్చు. కాబట్టి మీ వారికి కచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని నేరుగా మీ వారితో చర్చిస్తే, పరిస్థితి మరింత క్లిష్టంగా తయారై, మీ మీద విముఖత పెంచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ వారిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లండి. వాళ్లు మాత్రమే ఆయనతో మాట్లాడి అసలు కారణాలను రాబట్టగలుగుతారు. ఫలితాన్ని బట్టి చికిత్స చేసి, పరిస్థితులను చక్కదిద్దగలుగుతారు. కొంతమంది పురుషులకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండవచ్చు. సెక్స్‌లో ఫెయిలయితే ఎలా? అనే భయంతో భార్యకు చేరువ కాలేకపోతూ ఉంటారు. ఇంకొందరికి సేమ్‌ సెక్స్‌ పట్ల ఆకర్షణ కలగడం లాంటి గుణం కూడా ఉండవచ్చు. కాబట్టి కారణం ఏది అనేది వైద్యుల సహాయంతో కనిపెట్టి, తగిన చికిత్స ఇప్పించే ప్రయత్నం చేయండి.
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090
(కన్సల్టేషన్‌ కోసం)