తన కండిషన్లకు ఒప్పుకుంటేనే కార్యానికి ఒప్పుకుంటానంటోంది

15-07-2019:డాక్టర్‌! నాకు పెళ్లై ఏడాది దాటింది. మొదట్లో ఇద్దరం మా లైంగిక జీవితాన్ని ఎంతో ఆనందంగా కొనసాగించాం. అయితే గత కొంతకాలంగా పడగ్గదిలో, తన కండిషన్లకు ఒప్పుకుంటేనే కార్యానికి ఒప్పుకుంటానని బెదిరిస్తోంది. దాంతో లైంగికాసక్తి కోల్పోతున్నాను. అంగం స్తంభించడం లేదు. ఇందుకు కారణం మానసికమైనదని నాకు తెలుసు. అయితే నా పరిస్థితి చూసి, నేను సంసారానికి పనికిరానని నా భార్య దగ్గరి బంధువులకు ఫిర్యాదు చేస్తోంది. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? సలహా ఇవ్వగలరు.
 ఓ సోదరుడు, ఖమ్మం
దాంపత్య జీవితం సజావుగా, ఆనందంగా సాగాలంటే  దంపతులిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని మసలుకోవాలి. మీ విషయంలో మీ భార్య తన పనులు చేయించుకోవడం కోసం, తన మాట నెగ్గించుకోవడం కోసం సెక్స్‌ను అస్త్రంలా వాడుతున్నట్టు అనిపిస్తోంది. ఆమె ధోరణి  కారణంగా మీలో ఆసక్తి తగ్గి, అంగస్తంభన సమస్య ఎదురవుతోంది. ఇలా జరగడం అత్యంత సహజం. మీరు అంటున్నట్టు ఈ సమస్య మానసికమైనదే! అయితే ఆమె ధోరణిలో మార్పు రానంతకాలం మీ సమస్యలో కూడా మార్పు రాదు. కాబట్టి ఆమె ప్రవర్తన మార్చుకునేలా ఫ్యామిలీ డాక్టర్‌ లేదా మ్యారేజ్‌ కౌన్సెలర్‌లతో ఆమెకు కౌన్సెలింగ్‌ ఇప్పించండి. పంతాలు, పట్టింపులు నెగ్గించుకోవడానికి, వస్తువులు కొనిపించుకోవడానికి పడగ్గదిని వాడుకునే ధోరణి సరికాదనీ, ప్రేమ, అన్యోన్యతలతో మెలుగుతూ కాపురం చేసినప్పుడే ఎటువంటి సమస్యా లేకుండా సంసార జీవితం సజావుగా సాగుతుందనీ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారమవుతుంది.