ఈ మార్పులు ఎందుకు?

ఆంధ్రజ్యోతి(24-12-2019): 

ప్రశ్న: డాక్టర్‌! నా వయసు 45 ఏళ్లు. గత కొంతకాలంగా నా శరీరంలో కొన్ని మార్పులను గమనిస్తున్నాను. గడ్డం పూర్తిగా పెరగడం లేదు. వక్షోజాల పరిమాణం పెరుగుతోంది. వృషణాలు, అంగం పరిమాణం తగ్గింది. కోరికలు కూడా తగ్గినట్టు గ్రహించాను. పరీక్షల్లో టెస్టోస్టిరాన్‌, థైరాయిడ్‌ హార్మోన్ల పరిమాణం మామూలుగానే ఉంది. నాకు రెండేళ్ల నుంచీ మద్యం అలవాటు కూడా ఉంది. నాలో ఈ మార్పులకు మద్యం అలవాటు కారణమా? లేక హార్మోన్ల సమస్యలు కారణమా?
- ఓ సోదరుడు, విజయవాడ
 
డాక్టర్ సమాధానం: మీ లక్షణాలను బట్టి మీలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ స్థాయి పెరిగినట్టు అనిపిస్తోంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే పరీక్షల్లో ఆ హార్మోన్‌ సమంగానే ఉన్నట్టు తేలింది కాబట్టి మీ సమస్యకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ పెరగడమే కారణంగా భావించవచ్చు. సాధారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్‌తో పాటు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కూడా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ హార్మోన్‌ స్రావం పెరిగినప్పుడు మీరు చెప్పిన లక్షణాలన్నీ తలెత్తుతాయి.
 
కాబట్టి ఈ హార్మోన్‌కు సంబంధించిన పరీక్ష చేయించుకోండి. ఫలితాన్ని బట్టి మందులు వాడితే, కొద్ది నెలల్లోనే పరిస్థితి సర్దుకుంటుంది. ఇంతకుముందు లాగే గడ్డం పెరుగుతుంది. అంగం, వృషణాల పరిమాణం సాధారణ స్థితికి వస్తుంది. వక్షోజాలు తగ్గుతాయి. లైంగిక కోరికలూ పెరుగుతాయి. కాబట్టి కంగారు పడకుండా వైద్యులను కలిసి, హార్మోన్‌ పరీక్ష చేయించుకోండి. ఫలితాన్ని బట్టి చికిత్స తీసుకోండి. అయితే మద్యం అలవాటు వల్ల కూడా లైంగిక కోరికలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మద్యం అలవాటును
నియంత్రించుకోండి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)