ఈ కొత్త సమస్యకు కారణం ఏంటి?

20-08-2019:డాక్టర్‌! మాకు పెళ్లయి ఐదేళ్లు. రెండవ బిడ్డ పుట్టిన తర్వాత నుంచి మా వారిలో మార్పు వచ్చింది. ఆయనకు అతి తక్కువ సమయంలోనే వీర్యస్ఖలనం జరిగిపోతోంది. ఈ సమస్యతో మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. ఆయన లోలోపల కుంగిపోతున్నారు. లైంగికంగా కలవాలన్న ఆసక్తి నాలో కూడా తగ్గిపోతోంది. ఇంతకు ముందు లేని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? కారణం ఏమై ఉంటుంది? మా లైంగిక జీవితం ఇక ముందు ఇలాగే అసంతృప్తిగా కొనసాగవలసిందేనా?
- ఓ సోదరి, రెంటచింతల
 
మీ వారికి ఉన్న సమస్య ‘ప్రీ మెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌’. ప్రారంభం నుంచి మామూలుగా ఉండి, ఈ సమస్య హఠాత్తుగా తలెత్తిందంటే, అందుకు మానసిక కారణాలు ఉండి ఉండకపోవచ్చు. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గుదల, ప్రోస్టేట్‌ గ్రంథిలో ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ రెండు ఇబ్బందులను చికిత్సతో పూర్తిగా నయం చేయవచ్చు. సమస్య తొలగిపోతే తిరిగి ఆయన పరిస్థితి చక్కబడుతుంది.
 
కాబట్టి మీ వారిని అనుభవజ్ఞులైన యూరాలజిస్ట్‌, లేదా ఆండ్రాలజిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లండి. శీఘ్రస్ఖలనం అనే సమస్య ఎంతో చిన్నది. దాని కారణంగా దంపతుల మధ్య అనుబంధం బలహీనపడడం సహజమే అయినా, చికిత్సతో నయమయ్యే వీలున్న ఈ సమస్యను భూతద్దంలో నుంచి చూస్తూ కుంగిపోవడం, శారీరకంగా, మానసికంగా దూరం పెంచుకోవడం అవివేకం. కాబట్టి మీ భర్తను అనునయించి, చికిత్స ఇప్పించండి.