మా అబ్బాయి పురుషుల మీద ఆసక్తి కలుగుతోందనీ అంటున్నాడు

27-08-2019:డాక్టర్‌! మా అబ్బాయికి 20 ఏళ్లు. బాల్యం నుంచీ ఆడపిల్లలా ప్రవర్తిస్తూ ఉంటే శారీరకంగా ఎటువంటి లోపం కనిపించలేదు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. తనకు ఆడపిల్లల్లా దుస్తులు ధరించాలని ఉందనీ, పురుషుల మీద ఆసక్తి కలుగుతోందనీ అంటున్నాడు. వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే అబ్బాయిలో మార్పు వస్తుందని అనుకుంటున్నా. తగిన సలహా ఇవ్వగలరు.
ఓ సోదరుడు, జగిత్యాల
 
మీ అబ్బాయి పరిస్థితిని ‘సెక్సువల్‌ ఓరియెంటేషన్‌’ అంటారు. జననేంద్రియాలు సహజంగానే ఉన్నా, అమ్మాయిలా ప్రవర్తించే ఈ స్థితి ఉన్నఫళాన వచ్చింది కాదు. బాల్యం నుంచే అతడిలో ఈ స్థితి చోటు చేసుకుంది కాబట్టి, కౌన్సెలింగ్‌తో మార్చడం కష్టం. పైగా సెక్సువల్‌ ఓరియెంటేషన్‌కు (ఆర్టికల్‌ 377) సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి దీన్ని నేరంగా పరిగణించే పరిస్థితి లేదు. ఒకవేళ మీ అబ్బాయి పట్ల మీరు బలవంతంగా ప్రవర్తిస్తే, మీ ప్రయత్నాన్ని నేరంగా పరిగణించే ప్రమాదం ఉంది. మీ అబ్బాయి మేజర్‌ కాబట్టి జెండర్‌ పరంగా, ఆ అబ్బాయి తీసుకునే ఏ నిర్ణయానికీ అడ్డు చెప్పే అర్హత మీకు లేదు. కాబట్టి పరిస్థితిని అమోదించి, మీ అబ్బాయికి నచ్చినట్టు జీవితాన్ని గడిపే అనుమతి ఇవ్వండి. మీ అబ్బాయిని పోలినవాళ్లు అంతటా ఉన్నారు. అంతిమంగా మీ అబ్బాయి ఆనందాన్ని కోరుకునేవారైతే అతడి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా, అతడి స్థితిని స్వాగతించండి.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)