వేసవిలో ఈ ఇబ్బంది సహజమేనా?

19-03-2019: డాక్టర్‌! వేసవికీ వీర్యవృద్ధికీ సంబంధం ఉందా? ఇంతకుముందు నార్మల్‌గా ఉన్న స్పెర్మ్‌ కౌంట్‌ గత నెల నుంచి తగ్గింది. ఇది సహజమేనా? లేక నాలో ఏదైనా లోపం ఉందా?
- ఓ సోదరుడు, గుంటూరు
 
వేసవిలో వాతావరణంలో పెరిగే వేడి ప్రభావం వీర్యం మీద ఉంటుంది. మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో ఎంతోకొంత స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడం సహజమే! ఇంటిపట్టున లేదా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపే వారి కంటే పగలంతా ఎక్కువగా ఎండకు గురయ్యేవారికి వీర్యకణాలు తగ్గుతాయు. ఇలా జరగకుండా ఉండాలంటే ఎక్కువగా నీరు తాగుతూ, పౌష్టికాహారం తీసుకోవాలి. ఎక్కువగా ఎండకు గురి కాకుండా చూసుకోవాలి. అలాగే రాత్రివేళ లోదుస్తులు ధరించడం మానేస్తే మంచిది. బిగుతైన జీన్స్‌ లాంటి దుస్తులు వేసుకోవడం తగ్గించి, గాలి చొరబడే వీలుండే పల్చని దుస్తులు వేసుకోవాలి. మీ విషయంలో అనుమానాలు ఉంటే వైద్యులను కలిసి హార్మోన్‌ పరీక్షలు చేయించుకోండి. ఫలితాలు నార్మల్‌గా ఉంటే, మీ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి వేసవి వేడి కారణమని నిర్ధారించుకోవచ్చు.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.