సమస్య నాలోనా? మా వారిలోనా?

05-08-2019: డాక్టర్‌! నాకు పెళ్లయి అయిదేళ్లు. మాకు ఇద్దరు పిల్లలు. అయితే అంతకుముందు లేని ఓ ఇబ్బంది గత రెండేళ్లుగా నన్ను వేధిస్తోంది. ఆయనతో లైంగికంగా కలిసిన ప్రతిసారీ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌, జ్వరంతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతూ, లైంగికంగా కలిసిన వెంటనే ఈ సమస్య తిరగబెడుతూ ఉంది. కండోమ్‌ వాడితే ఎలాంటి సమస్యా ఉండదు. ఇలా ఎందుకు జరుగుతోంది? సమస్య నాలో ఉందా? లేదా మా వారిలోనా?
- ఓ సోదరి, నర్సరావుపేట.
 
లైంగికంగా కలిసినప్పుడే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వస్తుందంటే అందుకు కారణం మీ వారి వీర్యంలో ఉండి ఉంటుంది. వీర్యంలో ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు, ప్రోస్టేట్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా, వీర్యం అసిడిక్‌ పిహెచ్‌ ఎక్కువ ఉన్నా భార్యకు ఈ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడం సహజం. కండోమ్‌తో కలిసినప్పుడు సమస్య ఉండడం లేదంటే ఇబ్బంది కచ్చితంగా మీవారి వీర్యంలోనే ఉంది. కాబట్టి మీ వారిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లి సెమన్‌ కల్చర్‌ పరీక్ష చేయించండి. పరీక్షలో ఫలితం పాజిటివ్‌ వస్తే, ఏ కారణంతో తలెత్తిన ఇన్‌ఫెక్షన్‌ను అయినా మందులు వాడి సరిదిద్దవచ్చు. కాబట్టి కంగారు పడకుండా వైద్యులను కలవడానికి మీవారిని ఒప్పించండి. పరాయి స్త్రీలను కలవడం ద్వారా లైంగిక వ్యాధులు సోకి ఉంటే, ఆ విషయం బయటపడుతుందనే భయంతో పురుషులు వైద్య పరీక్షలకు అంగీకరించకపోవచ్చు. కాబట్టి మీ వారిని అనునయించి, విష యం రాబట్టండి. పరీక్షలు చేయించి, చికిత్స ఇప్పించి, ‘మరోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాన’ని మాట తీసుకోండి. సమస్యను మౌనంగా భరించకుండా, తీవ్రతను మీ భర్తకు తెలియజెప్పి చికి త్స తీసుకునేలా ప్రోత్సహించండి.
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)