ఆమెకు చేరువ కాలేను!

ఆంధ్రజ్యోతి (14-12-2020): నాకు పెళ్లై మూడేళ్లు. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇప్పటివరకూ నా భార్యకు లైంగికంగా దగ్గర కాలేదు. ఇందుకు కారణం ఆమె మీద నాకు కోరిక కలగకపోవడమే! నా భార్య స్వతహాగా మంచిది. నా తల్లితండ్రుల మద్దతు కూడా ఆమెకే ఉంది. అయినా నాకు ఆమె పట్ల ఆసక్తి కలగడం లేదు. నన్ను ఏం చేయమంటారు?

- ఓ సోదరుడు, నందిగామ

డాక్టర్ సమాధానం: అందం కంటే గుణం గొప్పది అంటారు. మీకు అదృష్టవశాత్తూ మంచి గుణం కలిగిన భార్య దొరికింది. ఒకవేళ అందంతో పాటు, తగువులు పెట్టే గుణం కలిగి ఉండే అమ్మాయి భార్యగా దొరికి ఉంటే ఏం చేసేవారు? కాబట్టి ఆమె మనస్తత్వానికి విలువ ఇవ్వండి. మీ లాగే పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్న ఎంతో మంది సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు. ప్రారంభంలో ఇలాంటి ఇబ్బంది అనిపించినా, ఒకసారి శారీరకంగా దగ్గరయిన తర్వాత సహజంగానే అనుబంధం ఏర్పడుతుంది.
 
కాబట్టి శారీరకంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. ఆమె మీద కోరికలు కలగకపోవడమే మీ ప్రధాన ఇబ్బంది అయితే, వయాగ్రా మాత్రలు వాడి అయినా సరే, కలిసే ప్రయత్నం చేయండి. ఇలా ఒకటి రెండు సార్లు లైంగికంగా కలిస్తే ఆమె పట్ల మీకు ఉన్న అయిష్టత తగ్గిపోతుంది. ఇద్దరి మధ్యా చక్కని అనుబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత దూరాలు తగ్గిపోతాయి. వయాగ్రాతో పని లేకుండానే వైవాహిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. తల్లితండ్రులతో కలిసిపోయి, వారిని కూతురి కన్నా ఎక్కువగా ఆదరించే భార్య దొరకడం మీ అదృష్టం. కేవలం లైంగిక ఆసక్తి కలగడం లేదనే కారణంతో ఆమెను దూరం చేసుకోవడం అవివేకం. కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, వయాగ్రా వాడి ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. అన్నీ సర్దుకుంటాయి.
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)