పెళ్లై ఏడాది గడిచినా ఇప్పటివరకూ శారీరకంగా కలవలేదు

15-04-2019: డాక్టర్‌! మా అమ్మాయికి అమెరికా సంబంధం వస్తే గత ఏడాది పెళ్లి చేసి పంపించాం! అయితే వాళ్లిద్దరూ ఇప్పటివరకూ శారీరకంగా కలవలేదు. అతను అమ్మాయిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అయితే, అతనికి లైంగిక కోరికలు లేవనీ, సంసారానికి పనికిరాడనీ అమ్మాయి చెప్పడంతో, విడాకులు తీసుకోవాలని నిర్ణయుంచుకున్నాం! మేం తీసుకున్న నిర్ణయం సరైనదేనా?

-ఓ సోదరి, విజయనగరం
 
నపుంసకత్వం అనే పదానికి అర్థం లేదు. శారీరకంగా కలవలేకపోవడానికి ఎలాంటి భౌతికపరమైన, మానసికపరమైన కారణాలు ఉన్నా, వాటిని చక్కదిద్దే ఆధునిక వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. పరీక్షలతో అసలు కారణాన్ని కనిపెట్టి, కౌన్సెలింగ్‌, మందులతో సమస్యను తొలగించుకోవచ్చు. మీ అల్లుడి విషయానికొస్తే, లైంగికంగా కలవలేకపోవడం మినహా, అమ్మాయితో ప్రేమగానే మెలుగుతున్నాడు కాబట్టి తొందరపడి విడాకులు తీసుకోకండి. దానికి బదులు అల్లుడిని ఇండియాకు రప్పించి అవసరమైన పరీక్షలు చేయించి, అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయండి. హార్మోన్‌ లోపం మొదలు పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ వరకూ పురుషులు లైంగికంగా దగ్గరకాలేకపోవడానికి పలు కారణాలు ఉంటాయి. సమస్యనుబట్టి చికిత్స ఇప్పిస్తే అన్నీ సర్దుకుంటాయి.
 
అమెరికాలో తనంతట తాను వైద్యులను కలిసి విషయం వివరించడానికి మీ అల్లుడికి సిగ్గు అడ్డు రావచ్చు. కాబట్టి ఒక నెల రోజులపాటు ఇండియాలో ఉండేలా ప్లాన్‌ చేసి పిలిపించండి. విడాకుల ఆలోచన గురించి ప్రస్తావించకుండా అనుభవజ్ఞులైన వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లండి. సమర్థమైన చికిత్సతో అతనికి ఉన్న సమస్యను తేలికగానే గుర్తించి చక్కదిద్దవచ్చు. ఈ విషయం అమ్మాయికి కూడా చెప్పి ఒప్పించండి.
 
 
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)