ఇలా ఇబ్బంది పడవలసిందేనా?

29-04-2019: డాక్టర్‌! నేను మెనోపాజ్‌ దశలో ఉన్నాను. సెక్స్‌ కోరికలు తగ్గిపోయాయి. ఆయన బలవంతం మీద కలిసినా, ఆ ప్రదేశంలో మంట మొదలై ఇబ్బంది కలుగుతోంది. కలిసిన ప్రతిసారీ మూత్రంలో మంట కూడా కొద్ది రోజులపాటు ఉంటోంది. నాలాంటి మహిళలకు ఈ వయసులో ఈ తిప్పలు తప్పవా? నా లైంగిక జీవితం తిరిగి పూర్వ స్థితికి ఎప్పటికీ రాదా?
- ఓ సోదరి, హైదరాబాద్‌.
 
 
మెనోపాజ్‌ దశకు చేరుకున్న ఎక్కువ శాతం మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య ఇది. దీన్ని ‘ఫిమేల్‌ సెక్సువల్‌ డిస్‌ఫంక్షన్‌’ అంటారు. దీనికి చికిత్స ఉంది. మెనోపాజ్‌కు చేరుకున్న వయసులో మహిళల్లో ఈస్ర్టోజెన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గిపోవడంతో యోని మార్గం పలుచబడడం, లూబ్రికేషన్‌ లోపించడం, రక్తప్రసరణ తగ్గడం, ఫలితంగా సెక్స్‌ కోరికలు తగ్గడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరిలో ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ పెరగడం మూలంగా, డి విటమిన్‌ లోపం వల్ల, థైరాయిడ్‌ హార్మోన్‌ సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కాబట్టి సమస్య కారణాన్ని కనిపెట్టి చికిత్స తీసుకోవాలి.
 
యోనిలో రక్త ప్రసరణ పెరిగేలా, ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ కలిగిన జెల్‌ వాడాలి. అలాగే లూబ్రికేషన్‌ కోసం క్రీమ్‌లు కూడా వాడవలసి ఉంటుంది. మెంతి పొడి, అశ్వగంధ వంటి ఆయుర్వేద మందుల ద్వారా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను పెంచవచ్చు. వీటితోపాటు అవసరమైతే టెస్టోస్టిరాన్‌ ఇంజెక్షన్‌ కూడా తక్కువ పరిమాణాల్లో తీసుకోవచ్చు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కూడా శరీరంలో సహజసిద్ధంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అవుతుంది. సెక్స్‌ ఇబ్బంది పెడుతుంది కదా అని దానికి దూరమయ్యేకొద్దీ ఆసక్తి, కోరికలు క్రమేపీ తగ్గుతాయి. ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటే దాని మీద ఆసక్తి, కోరికలు అంతే సక్రమంగా ఉంటాయి. కాబట్టి మీ లైంగిక జీవితం ఇక్కడితో ముగిసిపోయిందని కంగారు పడవద్దు. వైద్యులను కలిసి చికిత్స తీసుకుంటూ చురుగ్గా సెక్స్‌లో పొల్గొంటూ ఉండండి. చికిత్సతో మీ
సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి.
డాక్టర్‌ రాహుల్‌ రెడ్డిఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.