మందులతో మగపిల్లలు పుడతారా?

01-10-2019:డాక్టర్‌! మాకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు. మూడోసారి మగబిడ్డను కనాలని ఉంది. ఈ విషయం వైద్యులకు చెబితే, అందుకోసం ప్రత్యేకమైన మందులు ఉన్నాయనీ, అవి వాడితే కచ్చితంగా మగపిల్లవాడు పుడతాడని అంటున్నారు. ఈ మందులు వాడమంటారా? తగిన సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి, రాజమండ్రి

గర్భం దాల్చడం వరకే మీ చేతుల్లో పని. అది ఆడబిడ్డా, లేదా మగబిడ్డా అనేది ఎవరి చేతుల్లోను ఉండదు. మీ వైద్యులు చెబుతున్నట్టు ‘వై’ క్రోమోజోములను పెంచి, మగబిడ్డ పుట్టేలా చేసే మందులు అంటూ ప్రత్యేకంగా లేవు, ఉండవు కూడా! మీ బలహీనతను ఆసరాగా తీసుకుని వైద్యులు మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించండి. ఆ మందులూ, వాటి వాడకం గురించి రహస్యంగా ఉంచమని మిమ్మల్ని వైద్యులు కోరడం వెనక ఉన్న నిజం ఇదే! ఖరీదైన మందులు అనే పేరుతో దఫాకు వేలకొద్దీ డబ్బు రాబట్టే ఇలాంటి మోసాలు ఈ మధ్య విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. 

కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మరో బిడ్డ కోసం ప్రయత్నించడం ఎందుకు? ఏ బిడ్డ పుట్టినా ఆడా, మగా అనే తారతమ్యాలు లేకుండా పెంచడం ఉత్తమం. మరోసారి ప్రయత్నిద్దామని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మూడోసారి కూడా ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? కాబట్టి వైద్యుల మోసపూరిత మాటలను నమ్మకండి. ఉన్న బిడ్డలతో సరిపెట్టుకోండి. వారిని బాధ్యతతో ఉన్నతంగా పెంచండి.