కడుపు పండట్లేదా..?

11-06-2019: కడుపున ఓ కాయ కాయడం క్రమేపీ అందని ద్రాక్ష చందంగా మారుతోంది! గర్భధారణకు అడ్డుపడే కారణాలు... లక్షణాల రూపంలో ముంచుకొచ్చే ముంపును ముందుగానే తెలుపుతూ ఉంటాయి! అయినా వాటిని అలక్ష్యం చేయడం, సమయానికి చికిత్స తీసుకోకపోవడం వల్ల గర్భధారణ క్లిష్టమవుతోంది! గర్భధారణకు అడ్డుపడే పలు సమస్యలను అత్యాధునిక చికిత్సలతో పరిష్కరించే వీలుంది!
 
పెళ్లై సంవత్సరం తిరిగేలోపే పండంటి బిడ్డను ప్రసవించే రోజులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. ఆలస్యంగా పెళ్లికి సిద్ధపడడం, పెళ్లైన తర్వాత గర్భధారణను వాయిదా వేస్తూ ఉండడం, పునరుత్పత్తి వ్యవస్థలో సమస్యలు... ఇలా పిల్లలు కలగకపోవడానికి ఎన్నో కారణాలు. అయితే ఈ సమస్యలన్నీ నెలసరి ద్వారా బయల్పడే ప్రయత్నం చేస్తాయి. వాటి లక్షణాలు స్పష్టంగా అంతర్గత సమస్యను తెలుపుతూనే ఉంటాయి.

గర్భధారణకు సమస్యలు!
తల్లి అవకుండా అడ్డుపడే ఆ ప్రధాన సమస్యలు ఏవంటే....
అధిక బరువు: లావుగా ఉన్నప్పుడు కొవ్వు పొట్టలో ఎక్కువగా చేరుతుంది. ఈ కొవ్వు కారణంగా ఫిమేల్‌ హార్మోన్లు, మేల్‌ హార్మోన్లుగా మార్పు చెందుతాయి. దాంతో టెస్టోస్టెరాన్‌ పరిమాణం పెరిగిపోవడంతో అండాశయాల నుంచి అండాలు విడుదల కావు. దాంతో గర్భధారణ జరగదు.
 
పాలీసిస్టిక్‌ ఓవరీస్‌: ఈ సమస్య ఉన్నవాళ్లకు మొటిమలతో పాటు, ముఖం, గడ్డం మీద అవాంఛిత రోమాలు తలెత్తుతాయి. అలాగే నెలసరి కూడా ప్రతి నెలా ఆలస్యమవుతూ ఉంటుంది.
ఫైబ్రాయిడ్లు: ఈ సమస్య ఉన్న వారిలో నెలసరి స్రావం తీవ్రంగా ఉంటుంది. స్రావం గడ్డలు గడ్డలుగా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఫైబ్రాయిడ్‌ సమస్యను సూచిస్తాయి. అయితే ప్రతి ఫైబ్రాయిడ్‌ వల్ల సమస్య ఉండకపోయినా, ఎన్ని ఉన్నాయి? ఎంత పెద్దగా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే అంశాల మీద గర్భం ఽధరించే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అవి గర్భసంచీలో ఉన్నా, పెద్దగా ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఉన్నా గర్భధారణ జరగదు.
ఎండోమెట్రియాసిస్‌: నెలసరి సమయంలో నొప్పి ఉంటుంది. నెలసరి స్రావం కూడా తీవ్రంగా ఉంటుంది. అలాగే శారీరక కలయిక సమయంలో కూడా నొప్పి ఉంటుంది. గర్భసంచీ లోపల పెరగవలసిన పొర
ఎండోమెట్రియం గర్భసంచీ బయట పెరగడమే ఈ సమస్యకు కారణం.
అడినోమయోసిస్‌: ఈ సమస్య లక్షణాలు ఎండోమెట్రియోసి్‌సనే పోలి ఉంటాయి. అయితే వీరిలో గర్భసంచీ పొర స్థానభ్రంశం చెంది, గర్భసంచీ కండరంలో పెరుగుతుంది.
 
సమస్యను బట్టి చికిత్స!
పిల్లలు కలగకపోవడానికి అడ్డుపడే సమస్యలను సమర్థమైన చికిత్సలతో సరిదిద్దే వీలుంది. కొన్నిటిని జీవనశైలి మార్పులతో పరిష్కరించుకోవచ్చు. మరికొన్ని సమస్యలకు సర్జరీలు కూడా అవసరం కావచ్చు. అయితే ఆ సర్జరీలన్నీ తక్కువ సమయంలో కోలుకోగలిగేవే!
అధిక బరువు: పెరిగిన బరువును తగ్గించుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది. మరీ ముఖం్యగా పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పి.సి.ఒ.డి) సమస్య ఉన్నవాళ్లు అస్తవ్యస్త ఆహారపుటలవాట్లకు స్వస్తి చెప్పి,
వ్యాయామం, సమతులాహారంతో అధిక బరువు తగ్గించుకుంటే ఎటువంటి చికిత్సతో పని లేకుండానే సమస్య అదుపులోకి వస్తుంది.
పి.సి.ఒ.డి: లావుగా ఉన్నవాళ్లకే కాదు... సన్నగా ఉండేవారికీ పి.సి.ఒ.డి ఉంటుంది. సన్నటివాళ్లకు ఈ సమస్య గర్భధారణకు అడ్డంకిగా పరిణమించపోయినా, లావుగా ఉండేవారికి మాత్రం పెద్ద అడ్డంకిగా మిగిలిపోతుంది. ఈ సమస్య ఉన్నవారి అండాశయాల్లో లెక్కకు మించి అండాలు విడుదల కాకుండా పేరుకుపోతూ ఉంటాయి. వీటిని మందులు, ఇంజెక్షన్ల సహాయంతో విడుదలయ్యేలా చేసి సమస్యను సరిదిద్దవచ్చు. చికిత్స సమయంలో క్రమం తప్పకుండా స్కాన్‌ చేస్తూ, అండాలు విడుదలవుతున్న తీరును బట్టి, అవసరాన్ని బట్టి మందులు, లేదా ఇంజెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది.
ఫైబ్రాయిడ్స్‌: చిన్నవిగా ఉండి గర్భధారణకు అడ్డుపడవు అనుకున్న
వాటిని అలాగే వదిలేయవచ్చు. గర్భసంచీ లోపల, గర్భసంచీ గోడల్లో, గర్భసంచీ బయట...ఇలా ఫైబ్రాయిడ్లు ఎక్కడైనా తలెత్తవచ్చు. గర్భసంచీ బయట తలెత్తే ఫైబ్రాయిడ్లు ప్రమాదం లేనివి. ఇలా కాకుండా లోపల, గోడల్లో ఏర్పడే ఫైబ్రాయిడ్లు పెద్దగా ఉన్నా, ఎక్కువ మొత్తంలో ఉన్నా సర్జరీ చేసి తొలగించక తప్పదు.
ఎండోమెట్రియాసిస్‌: ఎండోమెట్రియాసిస్‌ అనే సమస్య ఉన్నవారికి, నెలసరి వస్తున్నంతకాలం ఎండోమెట్రియాసిస్‌ వస్తూనే ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారిలో నెలసరి సమయంలో స్రావం బయటకు పూర్తిగా వెళ్లిపోకుండా లోపల కొంత ఉండిపోతూ ఉంటుంది. దాంతో లోపల మిగిలిపోయిన స్రావం గడ్డకట్టి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాంతోపాటు తయారయ్యే అండాల నాణ్యత కూడా దెబ్బతింటుంది. అలాగే అండాలను చేరే వీర్యకణాలను కూడా చంపేస్తూ ఉంటుంది. ఫలితంగా గర్భధారణ జరగదు. ఈ సమస్యను మందులు లేదా సర్జరీతో సరిదిద్దవచ్చు.
ఎడినోమయోసిస్‌: గర్భసంచీ లోపల పెరగవలసిన పొర గర్భసంచీ కండరంలో పెరగడంతో, దీన్ని సర్జరీతో తొలగించి సమస్యను సరిదిద్దవచ్చు.
 
ఆధునిక సర్జరీలు ఇవే!
సమస్య ఎలాంటిదైనా సర్జరీ అవసరమైన సందర్భంలో సర్జరీ సమయాన్నీ, కోలుకునే సమయాన్నీ తగ్గించడంతోపాటు, సమస్యను
సమర్థంగా పరిష్కరించడమే ధ్యేయంగా సాగుతూ ఉంటాయి. అలాంటి అత్యాధునిక సర్జరీలే హిస్ట్రోస్కోపీ, ల్యాప్రోస్కోపీ! వీటికి ముందు గర్భాశయ సమస్యలన్నిటికీ గర్భాశయానికి కోతతో సాగే శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వీటి వల్ల సర్జరీ సమయంతోపాటు రోగి కోలుకునే సమయం కూడా ఎక్కువగా ఉండేది. కానీ తాజాగా గర్భాశయం లోపల ఉన్న సమస్యలను హిస్ట్రోస్కోపీతో, గర్భాశయం బయట సమస్యలను ల్యాప్రోస్కోపీతో సరి చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
 
హిస్ర్టోస్కోపీ: ఇది శరీరం మీద ఎటువంటి గాటూ, కుట్టూ లేకుండా యోని ద్వారా చేసే సర్జరీ. గర్భసంచీ లోపలకు కెమెరా చొప్పించి, అంతర్గతంగా సమస్యను స్పష్టంగా చూసే వీలుండే సర్జరీ కూడా ఇదొక్కటే! ఇలా చూడడం ద్వారా గర్భసంచీ ఆకారం, పరిమాణం సరిగ్గా ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. పాలిప్‌ లేదా ఫైబ్రాయిడ్లు గర్భసంచీలో పెరిగాయా? అనేదీ గమనించవచ్చు. గర్భాశయం లోపల కోతలు, గాట్లు ఏర్పడి, వాటి కారణంగా గర్భధారణ జరగడం లేదా అనేదీ నిర్ధారణ చేసుకోవచ్చు. అలా ఈ సర్జరీ ద్వారా పాలిప్స్‌, ఫైబ్రాయిడ్లు, గాట్లను తొలగించవచ్చు. కేవలం 4 నుంచి 5 గంటల్లో సర్జరీ పూర్తవుతుంది. గంట తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు.
ల్యాప్రోస్కోపీ: పాలీసిస్టిక్‌ ఓవరీ్‌సలో అండాలు ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, వాటి నుంచి కొన్నిటిని తొలగించడం కోసం, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియాసిస్‌ సంబంధిత మాస్‌ను తొలగించడానికి ఈ సర్జరీ అవసరం అవుతుంది. కొంతమందిలో పొట్టలో తలెత్తే ఇన్‌ఫెక్షన్ల వల్ల ఫ్యాలోపియన్‌ ట్యూబ్‌లు, పేగులు అతుక్కుపోయి, అండాన్ని ట్యూబులు అందుకోలేకపోతూ ఉంటాయి. ఈ సమస్యను కూడా ల్యాప్రోస్కోపీతో సరిచేయవచ్చు. బొడ్డు దగ్గర చిన్న కోత పెట్టి, అక్కడి నుంచి కెమెరాను పంపించి, పొట్ట దగ్గర ఐదు మిల్లీ మీటర్ల వ్యత్యాసంతో మూడు చిన్న గాట్లు పెట్టి పరికరాలు చొప్పించి ల్యాప్రోస్కోపీ సర్జరీ చేయవలసి ఉంటుంది. సర్జరీ చేసిన రోజు లేదా మరుసటి రోజు ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చు.
 
త్రీడీ స్కాన్‌తో సమస్య మరింత స్పష్టం!
లక్షణాల ఆధారంగా గర్భధారణకు అడ్డుపడుతున్న సమస్యను కొంత మేరకు గుర్తించవచ్చు. అయితే మరింత స్పష్టంగా సమస్య తీవ్రత తెలియాలంటే త్రీడీ స్కాన్‌ తీయించుకోవడం తప్పనిసరి. అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ను మించిన లోతైన వివరాలు త్రీడి స్కాన్‌తో తెలుస్తాయి.
 
పిండానికి రెండు గర్భసంచీలు?
గర్భంలో ఆడపిల్లగా పెరిగే ప్రతి పిండం ఐదు నెలల వయసుకు చేరుకునే వరకూ రెండు గర్భాశయాలు ఉంటాయి. ఆ తర్వాత నుంచి రెండు గర్భాశయాలకూ మధ్య ఉన్న గోడ (సెప్టమ్‌) తొలగిపోయి ఒకటిగా మారుతుంది. అయితే కొన్ని పిండాల్లో ఇలా జరగకుండా సెప్టమ్‌ అలాగే మిగిలిపోతుంది. ఈ సమస్య ఉన్నట్టు పుట్టి, పెరిగి పెళ్లయ్యాక కూడా ఎవరికి వారు కనిపెట్టలేకపోవచ్చు. ఇందుకు కారణం ఎటువంటి అసహజ లక్షణాలూ కనిపించకపోవడమే! ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేకపోయినా గర్భధారణ జరగని సందర్భంలో త్రీడీ స్కాన్‌ తీయించినప్పుడు మాత్రమే ఈ సమస్య బయల్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎత్తుకు తగిన బరువుతో ఉండి, నెలసరి సక్రమంగానే ఉండి, ఎటువంటి గర్భనిరోధక సాధనాలూ వాడకపోయినా గర్భం దాల్చలేకపోతూ ఉంటే సెప్టమ్‌ ఉందేమోనని అనుమానించవచ్చు.
 
వైద్యులను ఎప్పుడు కలవాలంటే?
పెళ్లైన ఏడాది వరకూ ఎలాంటి గర్భనిరోధక సాధనాలు వాడకపోయినా గర్భం దాల్చకపోయినప్పుడు....
వరుసగా నెలసరి క్రమం తప్పుతున్నప్పుడు 
నెలసరి స్రావం తీవ్రమైనప్పుడు
ముఖం, గడ్డం మీద వెంట్రుకలు పెరిగినప్పుడు 
విపరీతంగా మొటిమలు తలెత్తినప్పుడు
పెళ్లికి ముందే గర్భాశయంలో నీటి బుడగలు ఉండి, చికిత్స తీసుకుంటున్న వాళ్లు ఆరు నెలలు గడిచినా గర్భం దాల్చనప్పుడు....