సహజంగా పిల్లలను కనలేమా?

24-09-2019: డాక్టర్‌! మా వారికి వీర్యకణాలు తక్కువగా ఉన్నాయి. పైగా వేరికోసిల్‌ కూడా ఉండడంతో వైద్యులు సర్జరీ సూచించారు. కానీ అందుకు ఆయన భయపడుతూ ఉండడంతో పిల్లల కోసం ఐ.వి.ఎఫ్‌ పద్ధతిని ఆశ్రయించాము. బిడ్డ పుట్టాడు. ఇప్పుడు రెండోసారి పిల్లల కోసం ఇదే పద్ధతిని అనుసరించాలని వైద్యులు అంటున్నారు. మాకు సహజసిద్ధంగా పిల్లలు పుట్టే అవకాశమే లేదా?
- ఓ సోదరి, విశాఖపట్నం.
మొదటిసారి ఐ.వి.ఎఫ్‌ ద్వారా బిడ్డను కన్నంత మాత్రాన రెండోసారీ ఇదే పద్ధతి అనుసరించవలసిన అవసరం లేదు. మీ వారికి ఉన్న సమస్యను సరిదిద్ది సహజసిద్ధంగానే పిల్లలను కనే అవకాశం ఉంది. ఐ.వి.ఎఫ్‌ విధానంలో పిల్లలను కనే క్రమంలో వాడే హార్మోన్‌ ఇంజెక్షన్లు, ఇతరత్రా ఆరోగ్యపరమైన ఒత్తిళ్లతో పోల్చుకుంటే వేరికోసిల్‌ సర్జరీకి అయ్యే శ్రమ, ఖర్చు తక్కువే! పైగా వేరికోసిల్‌ తొలి దశలో ఉంటే సర్జరీతో పని లేకుండా మందులతోనే సరిదిద్దవచ్చు.
 
వీర్యకణాల వృద్ధికీ చికిత్సలు ఉన్నాయి. ఒకవేళ సర్జరీ తప్పనిసరి అయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సర్జరీ మెలకువల మూలంగా సర్జరీకి పట్టే సమయం తగ్గింది. ఉదయం ఆస్పత్రిలో చేరితే మధ్యాహ్నానికి సర్జరీ ముగించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు. కాబట్టి మీ వారిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లి అవసరమైన పరీక్షలు చేయించండి. అవసరమైతే భయపడకుండా సర్జరీ చేయించుకోమని ఆయనను ఒప్పించండి. సర్జరీతో సమస్యను సరిదిద్దితే వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో సహజసిద్ధంగా గర్భం దాల్చే అవకాశాలూ పెరుగుతాయి.