నాకు నపుంసకత్వం ఉందా?

30-07-2019: డాక్టర్‌! నా వయసు 35 ఏళ్లు. నాకు అంగస్తంభనాలు, స్ఖలనాలు సాధారణంగానే ఉన్నా, నా భార్య నేను నపుంసకుడిననే నెపం మోపి, విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధపడ్డాను. అయితే, ప్రస్తుతం నాకు అంగస్తంభన సమస్య ఎదురవుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? అంగస్తంభనాలు జరగకుండా నా మొదటి భార్య ఏదైనా మందు పెట్టి ఉంటుందేమోననే అనుమానం కూడా కలుగుతోంది. నన్ను ఏం చేయమంటారు?
- ఓ సోదరుడు, చిట్యాల.
 
మొదటి భార్యతో ఉన్నప్పుడు మీకు లైంగిక సామర్ధ్యం బాగానే ఉంది కాబట్టి, ప్రస్తుతం తలెత్తిన అంగస్తంభన సమస్యకు కారణం మీ మనసులోనే ఉందని అనిపిస్తోంది. నపుంసకులు అనే నెపం మోపి, మీ నుంచి ఆమె విడాకులు తీసుకుంది కాబట్టి, అంతర్లీనంగా మీ మనసులో ‘నాలో నిజంగానే నపుంసకత్వం ఉందా?’ అనే అనుమానం నాటుకుపోయు ఉంటుంది. పైగా పెళ్లి కుదిరింది. కాబట్టి, అంతర్మథనం పెరిగి, పటుత్వం కొంత తగ్గి ఉంటుంది. అంతే కానీ, అంగం స్తంభించకుండా మీ మాజీ భార్య మందు పెట్టి ఉంటుందనే మీ అనుమానంలో నిజం లేదు. అంగస్తంభనాల మీద ప్రభావం చూపించే అలాంటి మందులు లేవు. మీ వయసు 35 ఏళ్లు. కాబట్టి ఈ వయసులో కొత్తగా నపుంసకత్వం వచ్చే సమస్య కూడా లేదు. మీకు ఇప్పటికీ అనుమానంగా ఉంటే, వైద్యులను సంప్రతించి హార్మోన్‌ పరీక్షలు చేయించుకోండి. అంగస్తంభన సమస్యలకు ఎన్నో అత్యాధునిక చికిత్సలు ఉన్నాయి. కాబట్టి కంగారు పడకుండా వైద్యుల సహాయంతో అనుమాన నివృత్తి చేసుకుని, పెళ్లికి సిద్ధపడండి.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)