సహజసిద్ధంగా పిల్లల్ని కనలేనా?

ఆంధ్రజ్యోతి (18-12-2019): 

ప్రశ్న: డాక్టర్‌! మాకు పెళ్లై ఇప్పటికి ఐదేళ్లు. నా వయసు 27 సంవత్సరాలు. మూడు సార్లు గర్భం దాల్చినా, మూడో నెలలోనే అబార్షన్‌ అయిపోతోంది. మా వారి స్పెర్మ్‌ కౌంట్‌ బాగానే ఉన్నా, మార్ఫాలజీ తక్కువగా ఉందనీ, అందుకే గర్భస్రావాలు జరుగుతున్నాయనీ డాక్టర్లు అంటున్నారు. మార్ఫాలజీ సరిచేయడానికి చికిత్స లేదనీ, పిల్లల కోసం ఐ.వి.ఎఫ్‌ను ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. మా వారి సమస్యకు పరిష్కారం లేదా?
- ఓ సోదరి, నర్సీపట్నం.
 
డాక్టర్ సమాధానం: వీర్యకణాల ఆకారం, నిర్మాణంలో తేడాలను మార్ఫాలజీ అంటారు. మార్ఫాలజీ తక్కువగా ఉంటే, గర్భం దాల్చినా మూడవ నెలలో గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. మూడో నెలలో కాకుండా మూడు నెలలు దాటిన తర్వాత నాల్గవ నెల నుంచి గర్భస్రావాలు జరుగుతూ ఉంటే, సమస్యకు మీ వారి వీర్యంతో సంబంధం ఉండదు. అయితే మీ వారి విషయంలో వీర్యకణాల సంఖ్య మెరుగ్గానే ఉంది కాబట్టి గర్భధారణకు ఎటువంటి ఆటంకం ఉండదు. మార్ఫాలజీ మెరుగుకు మందులు ఉన్నాయి. వరుస గర్భస్రావాలు జరుగుతున్నంత మాత్రాన ఐ.వి.ఎఫ్‌ను ఆశ్రయించవలసిన అవసరం లేదు. మార్ఫాలజీ తక్కువ ఉండడానికి మూల కారణాలను తెలుసుకుని, మందులతో మెరుగుపరుచుకుంటే, సహజసిద్ధంగా గర్భం దాల్చి, పిల్లలను కనవచ్చు. స్పెర్మ్‌ కౌంట్‌ మెరుగ్గా ఉండి, మార్ఫాలజీ తక్కువగా ఉన్న వారిలో 80శాతం మందికి ఐ.వి.ఎఫ్‌ అవసరం పడదు. మార్ఫాలజీ మెరుగవడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. కాబట్టి వైద్యులను కలిసి మీ వారికి చికిత్స ఇప్పించండి!
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)