కాదనడానికి... కారణాలు అనేకం

కొన్నిసార్లు పురుషుడూ ఆమెను దూరంగా పెడుతుంటాడు. అదంతా, ఆమె పట్ల అయిష్టతను తెలిపే మార్గమని అనుకుంటాడు. లేదంటే, తనలోని లైంగికపరమైన లోపాల్ని దాచుకోడానికి ఆ ముసుగు వేసుకుంటాడు. ఆలూమగల లైంగిక వాంఛల విషయంలో సమతౌల్యం లోపించడమూ ఈ సంక్షోభానికి కారణమే.
 
పత్రికల్లో అత్యాచారాలకు సంబంధించిన వార్తల్ని చూడగానే సహోద్యోగులు తీవ్రంగా స్పందిస్తుంటారు. ‘అలాంటి వెధవల్ని ఉరితీయాలి’, ‘కాదుకాదు... చౌరస్తాలో నిలబెట్టి ముక్కలు ముక్కలుగా నరకాలి’ అంటూ ఆవేశంగా ఊగిపోతుంటారు.
ఆమె మాత్రం స్పందించదు. మహా అయితే, నిర్లిప్తంగా ఓ నవ్వు నవ్వుతుంది. ‘ముక్కూమెహం తెలియనివాడు ఒకసారి జరిపే అత్యాచారం కంటే, కట్టుకున్నవాడు... రోజూ చేసే అత్యాచారం మహా భయంకరమైంది’ అంటూ మనసులోనే మధనపడిపోతూ ఉంటుంది. 
నిజమే, ఇష్టంలేని కలయిక మానభంగం లాంటిదే. ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది గృహిణులు ఆ పడకగది నరకాన్ని అనుభవిస్తున్నారో తేల్చి చెప్పడానికి ఎలాంటి గణాంకాలూ లేవు. ఓ అధ్యయనంలో తొమ్మిది వందలమంది మహిళల్ని సర్వే చేయగా... అందులో దాదాపు నలభైఏడు శాతం ‘నిజమే, మా భర్తలు మమ్మల్ని బలవంతంగా ఆక్రమించుకుంటున్నారు’ అని అంగీకరించారు.
జీవిత భాగస్వామి సెక్స్‌ను తిరస్కరించడానికి చాలా కారణాలు ఉండవచ్చు. బాల్యంలో ఆమె, ఏ దగ్గరి బంధువుల కారణంగానో లైంగిక దోపిడికి గురై ఉండవచ్చు. లేదంటే కన్నతల్లో, తోబుట్టువో సంసార జీవితంలో తీవ్ర హింసను అనుభవించి ఉండవచ్చు. ఇలాంటి జ్ఞాపకాలు... జీవిత భాగస్వామి పట్ల భయాన్ని పెంచుతాయి. సెక్స్‌ అంటే విముఖత కలిగిస్తాయి. అతడికి లైంగికంగా దగ్గరయ్యేందుకు సరిపడా మానసిక సామీప్యం లేకపోవడం కూడా ఓ కారణం. భర్త లైంగిక ప్రవర్తన జుగుప్స కలిగించినా ఇలాంటి స్పందనలే ఉంటాయి.
ఆమె కాదనగానే పురుషుడి అహం దెబ్బతింటుంది. అతన్లోని మృగం బయటికొస్తుంది. నయానో భయానో దారికి తెచ్చుకోవాలని చూస్తాడు. ఆ ఆలోచన సరికాదు. ఆటవికం, అనైతికం, నేరం కూడా! ముందుగా ఆ తిరస్కారానికి కారణం తెలుసుకోవాలి. ఆమెలో గూడుకట్టుకున్న భయాల్నీ అపోహల్నీ  తొలగించాలి. తను సెక్స్‌ను మాత్రమే తిరస్కరిస్తోంది... భర్తగా తనను కాదని అర్థం చేసుకోవాలి. కమ్మగా వండిపెడుతుంది, ఇంటిని అద్దంలా ఉంచుకుంటుంది, ఉద్యోగినిగానూ మంచిపేరు తెచ్చుకుంటుంది... ఆర్థికంగా, ఉద్వేగపరంగా అండదండల్ని అందిస్తుంది. కానీ, అక్కడ మాత్రమే... అప్పుడు మాత్రమే... భీత హరిణం అవుతుంది. చేయి వేయగానే తేళ్లూజర్రులూ పాకినట్టు వణికిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో, అవసరమైతే మానసిక నిపుణుల సలహా తీసుకోవచ్చు. సెక్స్‌ థెరపీ సమర్థంగా పనిచేస్తుంది.
ఆమె కూడా... బిగుసుకుపోయి కూర్చోకూడదు. తనవైపు నుంచీ కొంత చొరవ ఉండాలి. స్వచ్ఛందంగా ఆ భయాల వలయంలోంచి బయటికొచ్చే ప్రయత్నం చేయాలి. ‘నా అయిష్టానికి కారణం ఇదీ! నా భయాలకు మూలం ఇక్కడుంది’ అంటూ తన మనసులో ఉన్నదంతా అతడి ముందు కక్కేయాలి. పురుషుడు ఏ వైఫల్యాన్ని అయినా తట్టుకుంటాడు కానీ, పడకగదిలో తిరస్కారానికి గురైతే మాత్రం... భరించలేడు. ఆ కోణాన్నీ ఆమె అర్థం చేసుకోవాలి. అతడిలోని శారీరక లోపాలో, మానసిక జాడ్యాలో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే... ఆ విషయాన్ని సున్నితంగా వ్యక్తం చేయాలి. కొన్నిసార్లు పురుషుడూ ఆమెను దూరంగా పెడుతుంటాడు. అదంతా, ఆమె పట్ల అయిష్టతను తెలిపే మార్గమని అనుకుంటాడు. లేదంటే, తనలోని లైంగికపరమైన లోపాల్ని దాచుకోడానికి ఆ ముసుగు వేసుకుంటాడు. ఆలూమగల లైంగిక వాంఛల విషయంలో సమతౌల్యం లోపించడమూ ఈ సంక్షోభానికి కారణమే. అతడిలో కోరికలు బుసలు కొడుతూ ఉంటాయి. ఆమెలో మాత్రం మొక్కుబడిగా ఉంటాయి. లేదంటే, ఆమెను సంతృప్తి పరిచేంత లైంగిక సత్తువ అతడిలో లేకపోవచ్చు. ఇవన్నీ వైద్యశాస్త్రంలో పరిష్కారం ఉన్న సమస్యలే. ఇద్దరూ గ్రహించాల్సిన విషయాలూ కొన్ని ఉన్నాయి. అతని మీద ఆమె కావచ్చు, ఆమె మీద అతను కావచ్చు... ఆధిపత్యం సాధించడానికి సెక్స్‌ను ఓ ఆయుధంగా వాడుకోవడం సరికాదు. శృంగారం మనసుతోనూ ముడిపడిన విషయం. భౌతికమైన అనుభవం కోసం ఆరాటాన్ని పక్కనపెట్టి... ముందుగా, మానసిక సామీప్యాన్ని పెంచుకునే ప్రయత్నం ప్రారంభించాలి. ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించాలి. ఫోర్‌ప్లేకి ప్రాధాన్యం ఇవ్వాలి. పెళ్లి పుస్తకంలో సెక్స్‌ అనేది ఓ ముఖ్యమైన అధ్యాయం. ఆ పేజీలు ఖాళీగా ఉంటే... అది ఆలూమగల వైఫల్యమే. ఇద్దరూ ముద్దాయిలే.