‘సెక్స్‌ ఎడ్యుకేషన్’... బూతుపదం కాదు!

‘అమ్మో! ఈ కాలం పిల్లలు తెలివిమీరిపోతున్నారు’
‘నా మట్టుకు నాకు శోభనం గదిలో అడుగుపెట్టే దాకా...’
‘సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటూ అవాకులూ చవాకులూ పేలుతున్న మేధావుల్ని అనాలి’
‘ఇంటర్నెట్‌ వచ్చేశాక ప్రతిదీ బహిరంగమైపోతోంది’
 
23-09-2018:... ఏదో పార్టీలో తల్లిదండ్రులంతా ఓ చోట చేరి చర్చించుకుంటున్నారు. కాదుకాదు, వ్యవస్థ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. వాళ్ల బాధేమిటో నాకు అర్థమైంది. ఏది సెక్స్‌ ఎడ్యుకేషనో తెలియకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. లైంగికత మీద సరైన అభిప్రాయం లేనివారికి లైంగిక విద్య మీద మాత్రం గౌరవం ఎందుకు ఉంటుంది?
 
సెక్స్‌ ఎడ్యుకేషన్‌ అంటే... జీవన నైపుణ్య విద్య. పెద్దలతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా వ్యవహరించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అపరిచితుల్ని ఏమేరకు విశ్వసించాలి, సైకిలు ఎలా తొక్కాలి, కారు ఎలా నడపాలి... ఇలా జీవితంలో పనికొచ్చే చాలా చాలా విషయాల్ని మనం పిల్లలకు నేర్పుతుంటాం. ఆపాటి జాగ్రత్తలు లేకపోతే... జీవన సమరంలో నెగ్గుకురాలేరు. ఆ పాఠాల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ కూడా ఒకటి.
చాలామంది భావించినట్టు, సెక్స్‌ ఎడ్యుకేషన్‌ వల్ల బాధ్యతా రాహిత్యం పెరగదు. బాధ్యత అలవడుతుంది. బీమా చేసినంత మాత్రాన నష్టాలు సంభవించవని కాదు. ఆ కష్టనష్టాల్ని తట్టుకోగల శక్తి వస్తుంది. లైంగిక విద్య ఏం చేయాలో చెప్పదు. ఏం చేయకూడదో హెచ్చరిస్తుంది. అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తుంది. అపోహల్నీ భయాల్నీ తొలగించి... సరైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఎరుకపరుస్తుంది. ఫలితంగా కౌమార బాలబాలికలకు బాధ్యత తెలుస్తుంది. విశృంఖలత్వం దరిదాపుల్లోకి కూడా రాదు. అజాగ్రత్త, అశ్రద్ధ ... అన్న మాటలు నిఘంటువులోంచి మాయమైపోతాయి. ఆ ఎరుకతోనే తమచుట్టూ రక్షణ వలయం నిర్మించుకుంటారు. ప్రలోభాలకూ ఉద్వేగాలకూ లోనుకాకుండా... పరిపక్వతతో వ్యవహరిస్తారు.
 
బాలబాలికలకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎలా పంచుకోవాలో అర్థం కాదు. సరిగ్గా ఆ సమయంలోనే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైంది. లైంగికత విషయంలో తమకే తగని గందరగోళం ఉంటే, తమలోనే తికమక నెలకొని ఉంటే... పిల్లలకేం చెబుతారు? చెప్పినా, ఇంకాస్త తికమకపెడతారు. మరికొంత గందరగోళపరుస్తారు. దీనివల్ల నష్టమే ఎక్కువ. అయినా, మనం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యుగంలో ఉన్నాం. మనం చెప్పకపోతే, పిల్లలు మరో మార్గంలో తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే విషయం... అసత్యం కావచ్చు, అర్ధసత్యం కావచ్చు. ఆ సమాచారం వారిని తప్పుదోవ పట్టించినా పట్టించవచ్చు. దయచేసి ఆ పరిస్థితి రానివ్వకండి. నిజాల్ని సున్నితమైన భాషలో, శాస్ర్తీయ పరిజ్ఞానాన్ని జోడించి చెప్పండి. ఉప ప్రశ్నలకూ అనుబంధ ప్రశ్నలకూ ఓపిగ్గా జవాబు ఇవ్వండి.
 
పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకోవచ్చా, యాదృచ్ఛికంగా ఏ ఇబ్బందికరమైన భంగిమలోనో వారికి కనిపిస్తే? పిల్లల ముందు తలెత్తుకోలేని పరిస్థితే వస్తే?... తదితర ప్రశ్నలు వ్యక్తం చేస్తుంటారు చాలామంది. నిజమే, ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమయంలో ఎదురయ్యే ఇబ్బందే ఇది. ఆ సమయంలో ఎలా స్పందించాలన్నది పిల్లల వయసును బట్టి ఉంటుంది. ఆ సమయంలో జీవితభాగస్వామిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఉన్నారనుకోండి, ‘ఇది మీ అమ్మ సీటు’ అంటూ తేలిగ్గా నవ్వేయవచ్చు. ఆ ఒక్క దృశ్యంతోనే వాళ్ల మనసులు కలుషితం అవుతాయని బెంగపడాల్సిన పన్లేదు.
 
పిల్లల గదిలోకి పెద్దలు వెళ్లినా..
పెద్దల గదిలోకి పిల్లలు వెళ్లినా... అనుమతి తీసుకున్నాకే అడుగువేయడం మంచి పద్ధతి. బాల్యం నుంచీ కొన్ని ప్రాథమికమైన మర్యాదలు నేర్పితే... ఇలాంటి ఇబ్బందులు ఉండనే ఉండవు.