లైంగిక వ్యసనం!

మద్యం...

ఓ వ్యసనం. 
ధూమపానం...
ఓ వ్యసనం.
జూదం...
ఓ వ్యసనం.
మరి, సెక్స్‌...
? ? ?
ఆమధ్య ఓ హాలీవుడ్‌ నిర్మాత సెక్స్‌ ఎడిక్షన్‌ బారినపడ్డట్టు వార్తలొచ్చాయి. అందులోంచి బయటపడటానికి ఆయన రిహబిలిటేషన్‌ సెంటర్‌లో చేరినట్టు కూడా సమాచారం. అంటే మద్యంలా, ధూమపానంలా, జూదంలా... సెక్స్‌ కూడా ఓ వ్యసనమేనా?
అసలు, ‘లైంగిక వ్యసనం’ అంటే ఏమిటి?
- నిపుణులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనికి కారణం... ఏ స్థాయి దాకా ఉంటే కోరికో, ఏ స్థాయిని మించితే వ్యసనమో బేరీజు వేసే కొలమానమంటూ లేకపోవడమే. ‘అవుట్‌ ఆఫ్‌ ద షాడోస్‌ - అండర్‌స్టాండింగ్‌ సెక్సువల్‌ ఎడిక్షన్‌’ పుస్తక రచయిత డాక్టర్‌ పాట్రిక్‌ కార్నెస్‌ తన అధ్యయనంలో మద్యపాన బానిసలకూ, లైంగిక వ్యసనపరులకూ చాలా పోలికలు ఉన్నాయని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనాలోని కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ‘ఎడిక్షన్‌ మెడిసిన్‌’ నిపుణులుగా పనిచేస్తున్న డాక్టర్‌ జెన్నిఫర్‌ నిర్వచనం ప్రకారం... ‘సెక్స్‌ అందుబాటులో లేకపోతే తట్టుకోలేని తీవ్రస్వభావాన్ని’ లైంగిక వ్యసనంగా భావించవచ్చు. ఆ తరహా వ్యక్తుల ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. సెక్స్‌ తర్వాత ఏ సాధారణ వ్యక్తిలో అయినా... ఓ తృప్తి, ఆనందం, రిలాక్సేషన్‌ కలుగుతాయి. లైంగిక వ్యసనపరులు మాత్రం... ఓ రకమైన డిప్రెషన్‌కు గురవుతారు. సమయానికి సెక్స్‌ అందుబాటులో లేకపోయినా తట్టుకోలేరు. ఎంతకైనా తెగిస్తారు. ఏమైనా చేస్తారు. మంచి-చెడు, నైతికత-అనైతికత, పరువు-ప్రతిష్ఠ... ఏవీ గుర్తుకురావు. 
సెక్స్‌ ఎడిక్షన్‌కు గురైన వ్యక్తి తన నియంత్రణలో తానుండడు. ఎవరో ఆడిస్తున్నట్టు, ఎవరో నడిపిస్తున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. లైంగిక స్వభావమూ విపరీతంగా ఉంటుంది. కోరిక తీర్చుకునే పద్ధతి కూడా... అసహజంగా, వికృతంగా ఉంటుంది. ఆ పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే... ఓ మృగం వేటకు వెళ్లినట్టు... సెక్స్‌ను వెతుక్కుంటూ బయల్దేరతాడు. ఆ ధోరణి వల్ల ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, జీవితభాగస్వామికి దూరం కావచ్చు, సమాజం వేలెత్తిచూపవచ్చు. అయినా సరే... లెక్కచేయడు. 
ఓ మామూలు మనిషి... సెక్స్‌ వ్యసనపరుడిగా ఎందుకు మారతాడు? ఆ విష వలయంలో ఎలా చిక్కుకుంటాడు? అంటే... ఆ పరిణామం వెనకున్న శారీరక, మానసిక, సామాజిక కారణాలు ఏమిటి? నిపుణుల నుంచి కచ్చితమైన సమాధానాల్లేవు. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఓ రెండు మాత్రం చాలామందికి ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఒకటేమో ‘బయో కెమికల్‌’ మూలాల్లోంచి పుట్టింది. మరొకటి ‘సైకో డైనమిక్‌’ సూత్రాల మీద నిర్మితమైంది. కొన్ని సందర్భాల్లో... మెదడులో అనూహ్యంగా కొన్నిరకాల రసాయనాలు భారీ స్థాయిలో విడుదల అవుతూ ఉంటాయి. ఫలితంగా మాదకద్రవ్యాలో మద్యమో పుచ్చుకున్నప్పుడు కనిపించే విపరీత ప్రవర్తన లాంటిదే... ఆ వ్యక్తిలోనూ తొంగి చూస్తుంది. మళ్లీ మళ్లీ ఆ రసాయనాలు ఊరుతున్నకొద్దీ ఇంకాఇంకా ఆ అనుభూతే కావాలనిపిస్తుంది. అదే బానిసత్వానికి తొలిమెట్టు. రెండో సిద్ధాంతం... సెక్స్‌ వ్యసనాన్ని బాల్య జ్ఞాపకాలతో ముడిపెడుతుంది. సెక్స్‌ పట్ల వ్యతిరేకత, జుగుప్స తీవ్రంగా ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లలు... పెరిగి పెద్దయ్యాక కూడా లైంగికతను శాపంగానో, పాపంగానో పరిగణిస్తారు. చిన్నప్పటి గాయాల్ని మద్యంతోనో, మాదకద్రవ్యంతోనో మాన్చుకోవాలని చూస్తారు. మితిమీరిన సెక్స్‌లోనూ పరిష్కారం వెతుక్కుంటారు. ఆ కాసేపూ మనసు సేదదీరినట్టు అనిపిస్తుంది. ఆతర్వాత మళ్లీ వెలితి. దాన్ని పూడ్చుకోడానికి పదేపదే అదే అనుభవం కోసం పాకులాడతారు.  
సైకోథెరపీ ద్వారా, ఔషధాల ద్వారా, సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల భాగస్వామ్యం ద్వారా... సెక్స్‌ వ్యసనపరుల్ని ఆ ఊబిలోంచి బయటికి తీసుకురావడం సాధ్యమే. కానీ, తక్షణ ఫలితాల్ని ఆశించకూడదు. ఆ సంక్షోభ సమయంలో కుటుంబ సభ్యుల అండ, ఆత్మీయుల తోడ్పాటు అవసరం. ఆ చీకట్లోంచి బయటికి రాగానే... మళ్లీ మామూలు మనుషులు అవుతారు. సాధారణ లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు.