వలపు ‘బొమ్మలు’!

 ‘డాక్టరు గారూ! నమస్కారం. ఎవరికీ చెప్పుకోలేని సమస్య నాది. నా వయసు ముప్పై అయిదు. పాతికేళ్ల వయసులో పెళ్లయింది. ముప్పై నిండకుండానే భర్త పోయాడు. నాలో లైంగిక వాంఛలు ఎక్కువే. ఎంతకాలమని ఆ కోరికల్ని అణిచిపెట్టుకోగలను? అలా అని, అనైతిక సంబంధాల కోసం పాకులాడటమూ నాకు ఇష్టం లేదు. వాటివల్ల లేనిపోని తలనొప్పులు. హత్యలకూ ఆత్మహత్యలకూ దారితీయవచ్చు. ఏదో ఆంగ్ల పత్రికలో సెక్స్‌ టాయ్స్‌ గురించి చదివాను. ఆడవాళ్లూ ఉపయోగించవచ్చని రాశారు. నిజమేనా? అలాంటి బొమ్మలూ ఉంటాయా? నేనూ వాడవచ్చా? వాటివల్ల ప్రమాదమేం ఉండదు కదా?

.. ఆమె చెబుతున్న ప్రతి మాటా, ఆమె వేస్తున్న ప్రతి ప్రశ్నా జాగ్రత్తగా విన్నాను. 
వలపు బొమ్మలకు సంబంధించి... చాలామందిలో చాలా అపోహలున్నాయి. కట్టుకథలూ ప్రచారంలో లేకపోలేదు. 
సెక్స్‌ టాయ్స్‌ని వాడటం వల్ల ఎలాంటి హానీ జరగదు. నిజానికి ‘సెక్స్‌ టాయ్స్‌’ అన్న మాటా సరైంది కాదు, శాస్ర్తీయం అసలే కాదు. ‘సెక్సువల్‌ ఎయిడ్స్‌’... లైంగిక ఉపకరణాలు అంటే బావుంటుందేమో. లైంగిక సమస్యల్ని పరిష్కరించుకోవడంలో, లైంగిక ఆనందాన్ని పెంచుకోవడంలో ఇవి సాయపడతాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామంది సెక్సువల్‌ ఎయిడ్స్‌ను నిర్మొహమాటంగా ఉపయోగిస్తారు. ఓ అమెరికన్‌ అధ్యయనం ప్రకారం... లైంగిక ఉద్దీపన కోసం యాభై ఆరు శాతం మంది నీలి చిత్రాల్ని ఆశ్రయిస్తారు, ఇరవై ఏడు శాతం మంది (స్ర్తీలు అయితే పురుషులవి, పురుషులు అయితే స్ర్తీలవి) లోదుస్తుల్ని ఎంచుకుంటారు, ఇరవై ఏడుశాతం మంది లైంగిక ఉపకరణాల సాయం తీసుకుంటారు. వీటి వాడకంలో తొలుత కాస్తంత జంకూగొంకూ కనిపించినా... పురుషులు అరవై నాలుగుశాతం సందర్భాల్లో, స్ర్తీలు ముప్పై ఆరుశాతం సందర్భాల్లో చొరవ తీసుకున్నారు. 
లైంగిక భాగస్వాములు లేనివారు మాత్రమే, సెక్స్‌ టాయ్స్‌ని ఆశ్రయిస్తా రనుకుంటే పొరపాటే. ‘సెక్స్‌ ఇన్‌ అమెరికా’ అధ్యయనం ప్రకారం... పరిపూర్ణ ఆరోగ్యవంతులైన దంపతులు కూడా శృంగారానుభూతిని రెట్టింపు చేసుకోడానికి పడకగదిలో బొమ్మల కొలువు పెట్టుకుంటారు. 
అయినా, లైంగిక ఉపకరణాలు ఇప్పటివి కాదు. వాత్స్యాయన కామసూత్ర కాలం నుంచీ ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో వాత్స్యాయన మహర్షి వివరంగా చెప్పాడు. హరప్పా తవ్వకాల్లోనూ సెక్స్‌ టాయ్స్‌ని  పోలిన పరికరాలు బయటపడ్డాయి. క్లియోపాత్ర పడకగదిలో ఓ మూలన వలపు బొమ్మల అర ఉండేదట! 
లైంగిక అవసరాల్ని బట్టి, పడకగది అభిరుచుల్ని బట్టి ... రకరకాల పరిమాణాల్లో, రకరకాల రూపాల్లో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి. స్ర్తీపురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను తలపించే నిర్మాణాలతో సహా... రాకుమారినో, గ్రీకువీరుడినో గుర్తుకుతెచ్చే నమూనాల్ని కూడా విక్రయిస్తున్నారు. కాస్త యంత్రశక్తిని జోడించిన ‘వైబ్రేటర్స్‌’కు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. 
  సెక్స్‌ థెరపీలో బొమ్మలకు చాలా ప్రాధాన్యం ఉంది. పందొమ్మిదో శతాబ్దంలో... ‘ఫిమేల్‌ హిస్టీరియా’ అనే మానసిక లైంగిక వ్యాధి చికిత్సలో బొమ్మల్నీ భాగం చేశారు. అప్పట్లో, భావప్రాప్తి కరువైన మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉండేదట. హిస్టీరికల్‌ పరాక్సిజమ్‌ను (భావప్రాప్తి సాంకేతిక నామం) అందించడంలో వైబ్రేటర్‌ గొప్ప చికిత్సా పరికరంగా పనిచేస్తుంది. 
అయితే, సెక్స్‌ బొమ్మల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్సాలజిస్టు సిఫార్సు మేరకే వీటిని ఉపయోగించాలి. ఇదో వ్యసనంగా మారితే మాత్రం చిక్కే. యథేచ్ఛగా ఉపయోగించడం వల్ల... సహజ శృంగారంలోని సున్నితత్వాన్ని కోల్పోతారు. ఆతర్వాత, జీవిత భాగస్వామితో కలయిక సంతృప్తికరంగా అనిపించకపోవచ్చు కూడా. 
  రోబోటిక్‌ టెక్నాలజీ పుణ్యమాని అచ్చంగా మనిషిలా స్పందించే సెక్స్‌ రోబోలు కూడా వస్తున్నాయి. 
పరికరం పరికరమే.
ఎన్నటికీ ‘భాగస్వామి’ కాలేదు. 
ఏరు దాటగానే తెప్పను వదిలేస్తాం. భుజానికి ఎత్తుకుని ఇంటిదాకా మోసుకెళ్లం.
‘సెక్స్‌ టాయ్స్‌’కు అయినా...
సెక్స్‌ రోబోస్‌కు అయినా... ఈ పోలికే వర్తిస్తుంది. ఆమాత్రం ఇంగితం ఉంటే చాలు.