లోపం పురుషుడిదీ కావచ్చు!

ఘనంగా వివాహం.
మధురంగా తొలిరాత్రి.
ఉల్లాసంగా హనీమూన్‌.
అత్తారింట్లో తొలి పండగ.
ఏడాది గడిచిపోతుంది.
ఆ ముహూర్తానికే పెళ్లయిన దంపతులు అమ్మానాన్నలు అనిపించుకుంటారు. 

ఆ ఇంట్లో మాత్రం పాపాయి ఏడుపులు వినిపించవు. బోసినవ్వులు కనిపించవు. 

ఎందుకిలా?
నెలరోజుల నుంచీ మనోజ్‌ మనసు మనసులో లేదు. తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాదాపుగా ప్రతిరోజూ సెక్స్‌లో పాల్గొంటూనే ఉన్నాడు. లోపం ఆమెలోనే ఉందేమో? ఆ మాట భార్యతో అనలేకపోతున్నాడు. అలా అని లోలోపలే కుమిలిపోనూలేడు.
బాల్య స్నేహితుడు ప్రణయ్‌ ముందు విషయాన్ని చర్చకు పెట్టాడు. ‘ఓసారి డాక్టరు దగ్గరికి వెళ్లడం మంచిది. సమస్య నీలోనూ ఉండవచ్చు కదా’ అని సలహా ఇచ్చాడు ప్రణయ్‌.
‘నాలోనా? ఇంపాజిబుల్‌?’

మిత్రుడి అభిప్రాయాన్ని తోసిపుచ్చాడు మనోజ్‌. 

నూటికి తొంభైమంది మగవాళ్లు ఇలానే స్పందిస్తారు. అలానే వాదిస్తారు. నిజానికి, ముప్పై నుంచి ముప్పై అయిదుశాతం సందర్భాల్లో పిల్లలు పుట్టకపోవడానికి కారణం పురుషుడే. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా, ఆడవారి మీదే అభాండాలు వేస్తారు. ఆమెను... హింసిస్తారు. ఆమెలో మానసిక రుగ్మతలకూ కారణం అవుతారు. భౌతిక దాడులకు దిగే పురుషాహంకారులూ లేకపోలేదు. 

ఆమె గర్భం దాల్చకపోవడానికి, అతడి వైపు నుంచి ప్రధాన కారణాలు ఇవే...
వీర్యంలో నాణ్యత లోపించడం.
లైంగిక వ్యవస్థలో లోపాలు.
సరైన పద్ధతిలో సెక్స్‌ చేయకపోవడం.

జననేంద్రియంలో లోపాలు.

పురుషుడిలో ఉత్పత్తి అయ్యే... ప్రతి మిల్లీ లీటరు వీర్యంలో కనీసం 20 మిలియన్ల వీర్య కణాలు ఉండాలి. అందులో యాభైశాతం కణాలు చురుగ్గా కదులుతూ ఉండాలి. ముప్పైశాతం కణాలు నిర్మాణపరంగా ఆరోగ్యవంతమైనవి అయి ఉండాలి. అప్పుడే, లైంగిక భాగస్వామి గర్భం దాలుస్తుంది. పుట్టుకతోనే వచ్చిన లోపాలవల్ల కానీ, ప్రమాదాల్లోనో ఇన్ఫెక్షన్ల మూలంగానో వృషణాలు దెబ్బ తినడం వల్ల కానీ... ఆ ప్రభావం వీర్యం మీద పడుతుంది. 

‘హైపోస్పడియాస్‌’...పురుషాంగ ద్వారం ఉండాల్సిన చోట ఉండకపోవడం, పురుషాంగం వంగిపోయి ఉండటం... తదితర కారణాల వల్ల వీర్యం గమ్యాన్ని చేరుకోలేదు. చిరునామా సరిగా రాయని పోస్టుకార్డులా ఇంకేదో చోటికి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు గర్భం దాల్చడం అసాధ్యం. 

గవదబిళ్లలు, బోదకాలు, గనేరియా తదితర ఆరోగ్య సమస్యలు కూడా వృషణ కణజాలాన్ని దెబ్బతీస్తాయి. 

పురుషుడి ప్రత్యుత్పత్తి సామర్థ్యం మీద పరిసరాల ప్రభావమూ ఉంటుంది. బాయిలర్‌ ప్లాంట్స్‌ లాంటి... తట్టుకోలేనంత వేడి వాతావరణాల్లో పనిచేసే కార్మికుల్లోనూ వంధ్యత్వ లక్షణాలు అధికంగా కనిపిస్తుంటాయి. వృషణాలు శరీర ఉష్ణోగ్రత కంటే.... తక్కువ ఉష్ణోగ్రతలోనే సమర్థంగా పనిచేయగలవు. రేడియేషన్‌ ప్రభావమూ వాటి పనితీరును దెబ్బతీస్తుంది. 

వంధ్యత్వాన్ని అధిగమించాలంటే ఒకటే మార్గం... ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. లైంగిక ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం! మరీ బిగుతైన లోదుస్తులూ ప్యాంట్లూ ధరించకూడదు. పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాలు... తదితర చెడు వ్యసనాల్ని దూరంగా ఉంచాలి. ఇంట్లో ఉన్నప్పుడు లోదుస్తులు ధరించకపోవడమే మంచిది. సాధ్యమైనంత వరకూ నూలు వస్ర్తాల్నే ఎంచుకోవాలి. పెళ్లికి ముందు... వీర్య పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.  సమస్యలుంటే... వైద్య నిపుణుల్ని సంప్రదించాలి. 

రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రెండు మనసులు కలిస్తేనే ముచ్చట్లు! ఓ కొత్త ప్రాణికి స్వాగతం పలకడంలో ఇద్దరూ సమ భాగస్వాములే!