పడకగదిలో... తిట్ల పురాణాలు!

‘మా ఆవిడని ముద్దుపెట్టుకోవడమూ, బార్బీడాల్‌ను ముద్దాడటమూ.. రెండూ ఒకటే. స్పందనే ఉండదు’
‘మీ అమ్మానాన్నలు అమ్మాయిని కన్నారో, అందమైన బొమ్మని కన్నారో నాకైతే అర్థం కావడం లేదు’
‘ఈమాత్రం దానికి నిన్ను పెళ్లిచేసుకోవడం ఎందుకూ? ఓ వైబ్రేటర్‌ కొనుక్కుంటే సరిపోయేది’
‘రాళ్లకైనా భావప్రాప్తి కలుగుతుందేమో కానీ...’
...ఇలా సాగుతుంది అతడి మాటలదాడి. అమె చాలాసార్లు మౌనంగానే భరిస్తుంది. కొన్నిసార్లు కించిత్‌ ఆవేశంగా జవాబు చెబుతుంది. పడకగదిలో మొదలైన అసంతృప్తి కాస్తా... రూపురేఖల మీదికో అలంకరణ మీదికో మళ్లుతుంది. 
‘ఆడ చింపాంజీకి చుడీదార్‌ చుట్టినట్టుంటావ్‌’
‘బ్యూటీపార్లర్‌ ఖర్చులు దండగ నీకు. అదేదో పద్యంలో అన్నట్టు... ఎలుకతోలు తెచ్చి ఎంతెంత కడిగినా, నలుపు నలుపేకాని తెలుపుకాదు!’
... కొన్నిసార్లు ఆ వెటకారం శ్రుతిమించుతుంది. బూతుల స్థాయికి దిగజారుతుంది.
‘నీకు ఆ ఖరీదైన బ్రాలు అవసరమా? నా పాత బనియన్‌ వేసుకున్నా నడిచిపోతుంది’
‘కాలేజీ రోజుల్లో పులిలా ఉండేవాడిని. నా సామర్థ్యమూ అలానే ఉండేది. వరుసగా ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌తో...! నా మగతనం ఇప్పుడిలా ఏడ్చి చచ్చింది. అందుకు కారణం నువ్వే, నీ ఏడుపుగొట్టు మొహమే’
పిల్లలు చదువుకోకపోయినా, కుళాయిలో నీళ్లు రాకపోయినా, పప్పులో ఉప్పు తక్కువైనా, కూరలో కారం ఎక్కువైనా - ఆమెను అనాల్సిందే! ఆమె రూపురేఖల్నీ, పడకగది అసమర్థతనూ నిందించాల్సిందే. 
... లోపాల్నీ బలహీనతల్నీ ఎత్తిచూపడం గొప్పనుకుంటారు చాలామంది మగవాళ్లు. అలా అనగా అనగా... ఏదో ఓ రోజు జీవితభాగస్వామి 
మారిపోతుందన్న ఆలోచన. 
సరైన ఆలోచనా విధానం కాదది. నిజానికి, ఆత్మన్యూనతతో బాధపడేవారే జీవితభాగస్వామి మీద నోరు పారేసుకుంటారు. తమలోని సవాలక్ష లోపాల్ని కప్పిపుచ్చుకోడానికి, నెపాన్ని ఆ అమాయకురాలి మీదికి నెట్టేస్తుంటారు. అటు తల్లిగా, ఇటు ఉద్యోగినిగా, మధ్యలో భార్యగా అన్ని బాధ్యతలకూ సమన్యాయం చేస్తున్న ఆ ఇల్లాల్ని చూసి ఓర్చుకోలేని కుసంస్కారమే అవాకులూ చవాకులూ పేలేలా చేస్తుంది. 
నిజమే, జీవితభాగస్వామిలో మనకు నచ్చే లక్షణాలు ఉంటాయి. నచ్చనివీ ఉంటాయి. ఆ అసంతృప్తి పడకగదికి కూడా విస్తరించి ఉండవచ్చు. శృంగారంలో ప్రతి కదలికనూ ఆమె ఆస్వాదించాలనీ, ఆస్వాదిస్తున్నట్టు కనిపించాలనీ, ఆ తమకం తనకు వినిపించాలనీ అతడు కోరుకోవచ్చు. కొన్నిసార్లు ఆమే చురుకైన పాత్ర పోషించాలనే వాంఛ వెంటాడుతూ ఉండవచ్చు. స్ర్తీ సహజమైన బిడియం వల్లో, ఇంకేవో కారణాలతోనో ఆమె అలా నడుచు కోలేకపోవచ్చు. అలాంటప్పుడు.. వేధింపులతోనో, విమర్శలతోనో జీవిత భాగస్వామి మనసును గాయపరచడం సరికాదు.
 మనసులోని మాట... నేర్పుగా చెప్పాలి. ముద్దుగా బతిమాలాలి. ప్రేమగా ఒప్పించాలి. అపోహలుంటే తొలగించాలి. భయాలుంటే పోగొట్టాలి. లైంగికత పట్లా, లైంగిక చర్యల్లో భాగస్వామ్యం పట్లా తరాలుగా కొన్ని అశాస్ర్తీయమైన అభిప్రాయాలు ఆమె బుర్రను ఆక్రమించేశాయి. వాటిని దూరం చేయాలి. 
శృంగారం వన్‌వే ట్రాఫిక్‌ లాంటి వ్యవహారం కాదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ముఖ్యం. సంతృప్తిని తానొక్కడే పొందడం కాదు, ఆమెకూ పంచాలి. ఆమె అందంగా అలంకరించుకోవడం లేదని గేలిచేయడం కాదు. వస్త్రధారణకు తానెంత ప్రాధాన్యం ఇస్తున్నాడో ఆలోచించుకోవాలి. ఆమె ఊబకాయాన్ని వెక్కిరించడం కాదు, తన బీఎమ్‌ఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) ఎంతన్నది లెక్కించుకోవాలి. శారీరక పరిశుభ్రత, అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం, తాత్కాలిక నపుంసకత్వం - పురుషుల్ని వేధిస్తున్న సమస్యలూ అనేకం ఉన్నాయి. కానీ, ఆ లోపాల్ని అతను ఆమోదించే సాహసం చేయడు. సరికదా, ఆ వైఫల్యాలకు ఆమే కారణమంటూ... నిందలు వేస్తాడు. 
ఆలూమగల సమభాగస్వామ్యంలో...
శృంగారం అనేది...
మనసుల భేటీ, తనువుల పోటీ!
ఇద్దర్లో ఏ ఒక్కరు మొక్కుబడిగా పాల్గొన్నా, అది హింసే!