పెళ్లి అయిన తర్వాత భంగపడే బదులు, పెళ్లికి ముందే తెలుసుకోవాలంటే ఏం చేయాలి?

29-10-2019: డాక్టర్‌! నాకు మరికొద్ది రోజుల్లో పెళ్లి కాబోతోంది. మద్యం, ధూమ పానం అలవాట్లు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడుతున్నాను. అయితే మద్యం తాగడం ప్రారంభించిన కొత్తలో స్తంభనాలు బాగా ఉండేవి. ఇప్పుడు ఆ తీవ్రత తగ్గింది. అలాగే లైంగిక సామర్థ్యం గురించి, పిల్లల గురించి కూడా నాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత భంగపడే బదులు, సంసారానికి, పిల్లలు కనడానికి నేను పూర్తిగా అర్హుడిని అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ అంశాలను నిర్థారించే పరీక్షలు ఏవైనా ఉన్నాయా?
- అభిషేక్‌, హైదరాబాద్‌
 
మీ లాంటి ఎంతోమంది పురుషులకు పెళ్లికి ముందు ఇలాంటి అనుమానాలు తలెత్తడం సహజం. అయితే వీటి నివృత్తి కోసం వైద్యులను కలవాలి. మీకు తలెత్తిన అనుమానాలను నిర్ధారించుకోవడానికి పరీక్షలు కూడా ఉన్నాయి. వీర్యకణాల సంఖ్య తెలుసుకోవడం కోసం స్పెర్మ్‌ టెస్ట్‌, టెస్టోస్టిరాన్‌, థైరాయిడ్‌ హార్మోన్లలో అవకతవకలు తెలుసుకోవడం కోసం హార్మోన్‌ పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఈ పరీక్షల్లో హెచ్చుతగ్గులు ఉంటే, మందులతో సరిదిద్దుకోవచ్చు. స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉన్నా, దాన్ని పెంచే మందులు ఉన్నాయి. కాబట్టి కంగారుపడవలసిన అవసరం లేదు. పురుషులకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలకు సమర్థమైన మందులు, చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
 
ఇక మీకు ఉన్న అధిక బరువు కూడా హార్మోన్లలో అవకతవకలకు కారణం కావచ్చు. మద్యం తాగడం అలవాటు అయిన ప్రారంభంలో స్తంభనాలు ఎక్కువగా ఉండడానికి కారణం మందు ఇచ్చే కిక్‌. క్రమేపీ మద్యానికి అలవాటు పడడం వల్ల తర్వాతి కాలంలో స్తంభనాలు అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. అయితే మీరు బరువు పెరగడానికి మద్యం కూడా ఓ కారణమే. మద్యం వల్ల శరీరంలో హార్మోన్‌ స్రావాల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పరీక్షల ఫలితాలతో పని లేకుండా మద్యం, ధూమపానానికి స్వస్థి పలకండి. అధిక బరువు తగ్గించుకోవడం కోసం క్రమం తప్పక వ్యాయామం చేయండి. అర్థం లేని అనుమానాలు వదిలి పెళ్లికి సిద్ధపడండి.