‘అక్రమ’ ఆకర్షణ!

ముచ్చటైన కుటుంబం.
భర్త-భార్య- కొడుకు.
భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అమెరికాలోని ఓ సబర్బ్‌లో ఇల్లు. ఓసారి ఆఫీసు నుంచి ఆమె ఇంటికి బయల్దేరుతుండగా.. పెనుగాలి వీస్తుంది. చేతిలోని వస్తువులన్నీ చెల్లాచెదురు అయిపోతాయి. కాలికి గాయం అవుతుంది. దాదాపుగా తనలాంటి స్థితిలోనే ఉన్న ఓ యువకుడు తారసపడతాడు. అతనో పాత పుస్తకాల వ్యాపారి. గాయానికి మందు పూసుకోవచ్చు రమ్మంటూ... ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. సరేనంటుంది ఆమె. మొహం కడుక్కోడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్తుంది. చేయి తగిలి ఏదో వస్తువు టాయిలెట్‌ బేసిన్‌లో పడిపోతుంది. అసహ్యంగా అనిపించినా బయటికి తీస్తుంది. 
‘మురికిలో చేయి పెట్టబోతున్నావ్‌ జాగ్రత్త సుమా?’ అంటూ కాలం చేసిన ప్రతీకాత్మక హెచ్చరిక అది. చిన్న పరిచయం కాస్తా శారీరక సంబంధం అవుతుంది. ఆ వ్యామోహంలో పడిపోయి భర్తను నిర్లక్ష్యం చేస్తుంది. కొడుకును పట్టించుకోదు. అలంకరణ మీద మితిమీరిన వ్యామోహం పెంచుకుంటుంది. ఆమె కదలికలు భర్తలో అనుమానం కలిగిస్తాయి. ఓ మిత్రుడి సాయంతో కూపీ లాగుతాడు. నిజం తెలుస్తుంది. గుండె పగిలినంత పని అవుతుంది. ఓరోజు నేరుగా ఆ కుర్రాడి ఇంటికి వెళ్తాడు. ‘నువ్వు చేస్తున్నది చాలా తప్పు’ అని హెచ్చరిస్తాడు. ఆ ఆవేశంలో చేతికి దొరికిన వస్తువుతో అతడి తల పగలగొడతాడు. యువకుడు అక్కడికక్కడే మరణిస్తాడు. సరిగ్గా అప్పుడే భార్య నుంచి ఆ యువకుడి నంబరుకు ఫోన్‌....
‘ఈ చాటుమాటు వ్యవహారాలు చాలు. నీ మాయలో పడిపోయి నా కుటుంబానికి దూరం అవుతున్నాను. సారీ... సారీ.. సారీ. ఇక నిన్ను కలుసుకోవడం కుదర్దు’ అంటూ కన్నీళ్లతో కూడిన పశ్చాత్తాపం. భార్య ప్రేమికుడి శవాన్ని కట్టగట్టి చెత్తకుప్పల మధ్య పడేసి ఇంటికి వెళ్లిపోతాడు భర్త. అయినా, ఆ జ్ఞాపకం పీడకలలా వెంటాడుతూనే ఉంటుంది. 
దర్శకుడు ఇక్కడో ప్రతీకాత్మక దృశ్యాన్ని జోడించాడు. ఓ రాత్రి పసివాడు పక్కమీద నిక్కరు తడుపుకుని.... అపరాధ భావంతో తల్లి దగ్గరికి వస్తాడు. ‘జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి నాన్నా! అందులోంచి బయటపడాలే కానీ, తలుచుకుని కుమిలిపోకూడదు’ అని ధైర్యం చెబుతుంది. ఆ మాటల్లోనే ఆమె మనసు మనకు అర్థం అవుతుంది. అంతలోనే పోలీసులు వస్తారు. భార్యాభర్తల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తారు. నిన్నటిదాకా ప్రశాంతంగా సాగిన జీవితంలో... అనూహ్యమైన మలుపులు. జీవితం ఏ నిమిషంలో ఎలాంటి మలుపు తీసుకుంటుందో ఎవరూ ఊహించలేరు. క్షణికావేశాలూ, తాత్కాలిక మోహాలూ, అసంతృప్తులూ, ఆకర్షణలూ చాలా సందర్భాల్లో అనైతిక బంధాలకు కారణం అవుతూ ఉంటాయి. అదో ఊబి. ఒక్కసారి చిక్కుకుపోతే బయటపడటం చాలా కష్టం. ఫలితంగా ఎవరి జీవితం వారి చేతుల్లో ఉండదు. అటు తననే నమ్ముకున్న భాగస్వామి- పిల్లలు.. ఇటు అనైతిక వ్యామోహం! సమతౌల్యం సాధించలేక నరకం అనుభవిస్తారు. ఎవరికంటా పడకుండా తప్పించుకు తిరగాలి. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పాలి. రెండిళ్ల వ్యవహారాలు చక్కబెట్టడానికి రోజుకు ఇరవై నాలుగు గంటలు సరిపోవు. నైతిక, అనైతిక భాగస్వాముల్ని తృప్తి పరచడానికి ఒక లైంగిక వ్యవస్థ సరిపోదు. ఆ పరుగులో వృత్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కెరీర్‌ సంక్షోభంలో పడుతుంది. ఖరీదైన బహుమతులు, బయటి విందులు, హోటల్‌ గదులు... స్థోమతకు మించిన ఖర్చులతో అప్పులు పేరుకుపోతాయి. ఏదో ఒకరోజు, ఆ చీకటి చరిత్ర తెలియకూడని వాళ్లకు తెలుస్తుంది. బెదిరింపులు, హెచ్చరికలు, బ్లాక్‌ మెయిలింగ్‌లూ, హత్యాయత్నాలూ, కోర్టు కేసులూ, విడాకులూ... పరిస్థితి ఎక్కడికైనా దారితీయవచ్చు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం... హత్యలలో ఎనభైశాతం అక్రమ సంబంధాలతో ముడిపడినవే. 
మళ్లీ సినిమా దగ్గరికి వస్తే...
‘ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం. కొత్త జీవితం గడుపుదాం..’ అని భర్తకు సలహా ఇస్తుంది భార్య. తనూ సరేనంటాడు. పోలీస్‌ స్టేషన్‌ పక్కన, ఎర్రలైటు దగ్గర ఆ దంపతులు ప్రయాణిస్తున్న వాహనం ఆగుతుంది. అక్కడితో సినిమా అయి పోతుంది. ముగింపును ప్రేక్షకుడి ఊహకే వదిలేశాడు దర్శకుడు. సినిమా పేరు... ‘అన్‌ ఫెయిత్‌ఫుల్‌’
 ఇలాంటి కథల్లో క్లైమాక్స్‌ను ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఏ అక్రమ సంబంధానికి కూడా ముగింపులో...
‘శుభం’ ఉండదు.