భార్యాభర్తల మధ్య ఆ దూరం పెరిగితే...

 

ఆంధ్రజ్యోతి (26-11-2019): అంతకుముందరి ఆసక్తి లోపిస్తుంది! స్పందనలు కరువవుతాయి! కోరికలు సన్నగిల్లుతాయి! అయితే పెరిగే వయసుతో పాటు ఇవన్నీ సహజం అని ఊరుకోవడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి స్థితి దంపతులను శారీరకంగానే కాదు, మానసికంగానూ దూరం చేస్తుంది! కాబట్టి కారణాలను అన్వేషించి, పరస్పరం చర్చించుకుని, దాంపత్య జీవన మాధుర్యాన్ని ఆస్వాదించాలి! దంపతుల్లో ఈ ధోరణి అన్ని విధాలా ఆరోగ్యకరం, ఆనందకరం!
 
పెళ్లైన కొత్తలో ఉండే లైంగిక ఆసక్తి క్రమేపీ తగ్గడం సహజం. పిల్లలు, కెరీర్‌, ఇతరత్రా బాధ్యతలతో దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యం తగ్గుతుంది. అయితే నడివయసుకు... అంటే 45 ఏళ్లకు చేరుకునేసరికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. పిల్లలు పెద్దవాళ్లవుతారు. ఉద్యోగంలో స్థిరత్వం చేకూరుతుంది. బాధ్యతలు కొంత తగ్గుతాయి. అయితే ఆ వయసులో మిగతా అంశాలతో పాటే కోరికలూ తగ్గుముఖం పడతాయి. శారీరక కలయిక పట్ల ఆసక్తి తగ్గుతుంది. అలాగే సంతృప్తి తీవ్రతా తగ్గుతుంది. దాంతో సెక్స్‌కు దంపతులు పూర్తిగా దూరమవుతారు. నిజానికి ఇలాంటి మార్పును ఎందుకు స్వాగతించాలి? వయసు పైబడినంత మాత్రాన శారీరక కలయికకు దూరంగా ఉండాలనే నియమం లేదు కదా? ‘‘సహజ సిద్ధంగానే శరీరంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి కాబట్టి వాటితో సర్దుకుపోతే సరిపోతుంది కదా?’’ అని ఎక్కువ శాతం మంది దంపతులు సర్దుకుపోతూ ఉంటారు. కానీ లైంగిక కోరికలు తగ్గడానికి కారణాలను సరిదిద్దుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు, లైంగిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
 
మీకోసం కొంత సమయం!
పిల్లలు కుటుంబంలో భాగమే! అలాగని భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం కొరవడేంతగా పిల్లల కోసమే సమయం కేటాయించడం సరి కాదు. మరీ ముఖ్యంగా నడి వయసులో అడుగుపెట్టిన దంపతులు తమ మధ్య శారీరక బంధం బలహీనపడిందని గ్రహింపుకు వస్తే, ఆ విషయాన్ని సీరియ్‌సగానే తీసుకోవాలి. అందుకు కారణాలు ఏకాంతం దొరకకపోవడమే. అయితే, ఆ వీలు కల్పించుకోవాలి. పిల్లలను వేరే గదిలో పడుకోబెట్టడం, తరచుగా దంపతులు మాత్రమే పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం... ఇలా తమకంటూ నాణ్యమైన, ఏకాంత సమయాన్ని కల్పించుకోవాలి. అలాంటి సమయాల్లో కచ్చితంగా తిరిగి పూర్వపు లైంగిక ఆసక్తులు చిగురించే వీలు ఉంటుంది.
కొంతమందిలో ఈ చిట్కాలు ఫలించవచ్చు. మరికొందరిలో లైంగిక ఆసక్తి తగ్గడానికి శారీరక సమస్యలు కారణం కావచ్చు.
 
లైంగిక ఆసక్తి తగ్గిందంటే?
లైంగిక కోరికలు తగ్గడానికి స్త్రీపురుషుల్లో వేర్వేరు కారణాలు ఉంటాయి. అవి హార్మోన్లలో లోపాలు కావచ్చు. దంపతుల్లో ఒకరికి కోరిక ఉన్నా, మరొకరిలో కోరికలు లోపించడం కావచ్చు. లేదా ఇద్దరూ ఆ ప్రయత్నాలు మానుకోవడం కావచ్చు.
 
హార్మోన్లలో తగ్గుదల: నడి వయసులో అడుగుపెట్టే సమయానికి పురుషుల్లో ‘టెస్టోస్టెరాన్‌’, స్త్రీలలో ‘ఈస్ర్టోజన్‌’ హార్మోన్ల స్రావాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా మహిళలు మెనోపాజ్‌ దశలోకి, పురుషులు ఆండ్రోపాజ్‌ దశలోకి అడుగుపెడతారు. దాంతో ఇద్దరిలో లైంగిక కోరికలు తగ్గుతాయి. పురుషుల్లో స్తంభనాలు తగ్గితే, మహిళల్లో యోని పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండు సమస్యలకూ చికిత్సలు ఉన్నాయి. పురుషులకు జెల్‌, ప్యాచ్‌, ఇంజెక్షన్ల రూపంలో అవసరాన్నిబట్టి టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను ఇవ్వవచ్చు. 60 ఏళ్ల వయసుపైబడితే అవసరం మేరకు వయాగ్రా మాత్రలూ వాడుకోవచ్చు. అలాగే మహిళలకు కూడా జెల్స్‌, మాత్రల రూపంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ అందించి పరిస్థితి చక్కదిద్దవచ్చు.
 
ఒకరిలో సమస్య: భర్తకు కోరికలు ఉన్నా, భార్యకు ఆసక్తి ఉండకపోవచ్చు. దాంతో భర్తకు సహకరించకపోవడం, ఫలితంగా భర్తలో నిరాసక్తత చోటుచేసుకోవడం లాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ భార్యకు కోరికలు ఉండి, భర్తలో లోపించినా, భార్య చొరవ తీసుకోలేకపోవడం మూలంగా దంపతుల మధ్య దూరం పెరగవచ్చు.
 
ఈ వయసులోనా?: కొందరు దంపతులు నడివయసుకు చేరుకోగానే, తమకు తాము పెద్దరికాన్ని ఆపాదించుకుంటారు. లైంగిక కోరికలు ఉన్నా ఆ వయసులో సెక్స్‌లో పాల్గొనడం సరి కాదనే భావన కలిగి ఉంటారు. ఎవరైనా గ్రహిస్తే ఏమనుకుంటారో!, పిల్లలకు తెలిస్తే ఎలా స్పందిస్తారో? అనే అనుమానాలు, భయాలు వారిలో ఉంటాయి. ఇలా బలవంతంగా కోరికలను చంపుకోవడం కూడా ఆరోగ్యకరం కాదు.
 
రూపం గురించిన చింత: నడివయసుకు చేరుకునేటప్పటికి శరీర పటుత్వం తగ్గడం, ఆకృతి కోల్పోవడం సహజం. దాంతో మరీ ముఖ్యంగా మహిళలు తమ శరీరాన్ని భర్త కంట పడకుండా, దాచడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా భర్త చేరువైనా దూరం పెట్టేస్తూ ఉంటారు. అలాగే పురుషులు కూడా పటువు కోల్పోయిన భార్య శరీరం పట్ల ఏవగింపు ఏర్పరుచుకుంటారు. ఈ రెండు ప్రవర్తనలూ సరి కావు. పెరిగే వయసుతో హార్మోన్లలో హెచ్చుతగ్గుల కారణంగా మెటబాలిజం తగ్గి, పొట్ట, పిరుదులు... ఇలా కొన్ని ప్రదేశాల్లో కొవ్వు పేరుకోవడం సహజం. దాంతో శరీరాకృతి క్రమం తప్పవచ్చు. కాబట్టి తిరిగి పూర్వ రూపం తెచ్చుకోగలిగే ప్రయత్నాలు ఇద్దరూ మొదలు పెట్టాలి. వ్యాయామం చేయడంతో పాటు పోషకాహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవశైలిని అలవరుచుకోవాలి.
 
అన్యోన్యం, అవగాహన అవసరం!
సెక్సువల్‌ పర్‌ఫార్మెన్స్‌ గురించిన కంగారు పురుషుల్లో ఎక్కువ. ప్రారంభంలో అనుభవమైన ఫెయిల్యూర్‌ ఆండ్రోపాజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా తలెత్తవచ్చు. అయితే కోరికతో భార్యకు చేరువైన తర్వాత, పూర్వపు సామర్ధ్యాన్ని ప్రదర్శించడంలో భర్త విఫలమైతే భార్య హేళనగా మాట్లాడకూడదు. ‘మీకు వయసైపోయింది’ లాంటి మాటలతో చిన్నబుచ్చకూడదు. ఇలాంటి మాటల వల్ల పురుషుల్లో ఆత్మాభిమానం దెబ్బతిని, ఆ తర్వాత నుంచి పూర్తిగా సెక్స్‌కు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ‘ఫర్వాలేదు, మరొకసారి ప్రయత్నం చేద్దాం’ లాంటి మాటలతో ఆత్మస్థయిర్యాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అలాగే పురుషులు కూడా లైంగికంగా సహకరించని భార్యను ఎద్దేవా చేస్తూ మాట్లాడకూడదు. అలాగే బిగువు సడలిన శరీరాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదు.
 
విటమిన్‌ డి కీలకం!
మహిళల్లో ఈస్ట్రోజెన్‌, పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్ల తగ్గుదలకు పరోక్ష కారణం ‘విటమిన్‌ డి’ లోపం. ఎక్కువ సమయంపాటు ఇంట్లో గడిపే మహిళల్లో, ఆఫీసుల్లో నీడపట్టున పగలంతా గడిపే పురుషుల్లో విటమిన్‌ డి సరిపడా ఉండదు. కాబట్టి రోజులో కొద్ది సమయం పాటు అయినా, ఇద్దరూ శరీరాలకు ఎండ సోకనివ్వాలి.
 
ఎక్కువ సమయం కూర్చోవద్దు!
ఆరుగంటల పాటు కదలకుండా కూర్చోవడం పది సిగరెట్లు తాగడంతో సమానం. రోజుకు ఆరు గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయి పనిచేసే పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గుతుంది. ఫలితంగా లైంగిక కోరికలూ తగ్గుతాయి. కాబట్టి ఎక్కువ సమయం నిలబడి ఉండడం లేదా కూర్చుని పని చేసే ఆరు గంటల వ్యవధిలో, రెండు గంటల కొకసారి అరగంట పాటు నడవడం వంటివి చేయాలి.
 
శృంగారం... ఆరోగ్యకరం!
లైంగిక కోరికలు తీర్చుకోవడానికి, పిల్లల కోసమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికీ కూడా సెక్స్‌ అవసరమే! ఎలాగంటే...
 
కోరికలు సజీవంగా: వాడకం తగ్గితే వస్తువు పాడయినట్టే, సెక్స్‌ లో పాల్గొనడం తగ్గితే, కోరికలూ క్రమేపీ తగ్గిపోతాయి. దాంతో సెక్స్‌కు పూర్తిగా దూరమవుతారు! ఇలా జరగకుండా వీలైనంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉండాలి. మానసిక బంధం బలపడడానికి సెక్స్‌ కూడా ఒక మాధ్యమం. కాబట్టి కోరికలు తగ్గితే దంపతులు చర్చించుకుని, సమస్యలను పరిష్కరించుకుని చేరువకావాలి.
 
ఆరోగ్యం మెరుగు: క్రమంతప్పకుండా సెక్స్‌లో పాల్గొనే మహిళల్లో మెనోపాజ్‌, పురుషుల్లో ఆండ్రోపాజ్‌ వాయిదా పడతాయి. పురుషుల్లో ప్రోస్టేట్‌ కేన్సర్‌, ప్రోస్టేట్‌ సంబంధిత సమస్యలు, మహిళల్లో యోని సంబంధ ఇబ్బందులు తలెత్తవు.
 
అధిక రక్తపోటు దూరం: సెక్స్‌లో పాల్గొనడం మూలంగా మనసును ఆహ్లాదంగా ఉంచే ‘ఫీల్‌ గుడ్‌హార్మోన్లు’ విడుదలవుతాయి. దాంతో ఒత్తిడి తొలగుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు లాంటి సమస్యలు దరిచేరవు.
 
వ్యాయామ ఫలం: ట్రెడ్‌మిల్‌ మీద పరిగెత్తినంత ఫలితం దక్కకపోయినా, సెక్స్‌లో పాల్గొనడం మూలంగా క్యాలరీలు కొంత మొత్తంలోనైనా ఖర్చవుతాయి.
 
గుండె సమస్యలు దూరం: స్త్రీపురుషుల్లో ఈస్ర్టోజెన్‌, టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల స్థాయిలు సమంగా ఉండాలంటే తరచుగా సెక్స్‌లో పాల్గొంటూ ఉండాలి. ఈ హార్మోన్ల స్రావాలు తగ్గితే ఎముకలు గుల్లబారడం, హృద్రోగాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
 
నొప్పులు మటుమాయం: సెక్స్‌లో పాల్గొనడం మూలంగా నొప్పిని తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది. మహిళల్లో నెలసరి నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
 
కమ్మని నిద్ర: భావప్రాప్తి పొందిన తదనంతరం ‘ప్రొలాక్టిన్‌’ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఈ హార్మోన్‌ సాంత్వనకు లోనుచేసి, నిద్ర మత్తు ఆవరించేలా చేస్తుంది. కాబట్టి కంటి నిండా నిద్ర కరువవుతుంటే, సెక్స్‌ వైపు మనసు మళ్లించుకోవాలి.
 
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌
ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,
జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌